విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమాన ప్రయాణానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 4, 2026న ఈ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండ్ కానుంది. ఇది భోగాపురం ఎయిర్‌పోర్ట్ చరిత్రలోనే ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.
ఈ చారిత్రాత్మక తొలి ప్రయాణంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొననున్నారు. వీరిద్దరూ ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో భోగాపురం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. దీంతో ఈ టెస్టింగ్ ఫ్లైట్‌కు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం లభించనుంది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. రన్‌వే, టెర్మినల్ భవనాలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థ, భద్రతా ఏర్పాట్లు వంటి కీలక పనులు వేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే చిన్న విమానాలతో ట్రయల్ రన్ నిర్వహించి, ఎయిర్‌పోర్ట్ పనితీరును అధికారులు పరిశీలించారు.
జనవరిలో నిర్వహించనున్న ఈ టెస్టింగ్ ఫ్లైట్ ద్వారా విమానాశ్రయ సాంకేతిక సామర్థ్యాన్ని పూర్తిగా పరీక్షించనున్నారు. ఆ తర్వాత అన్ని అనుమతులు లభిస్తే 2026 మే నెల నుంచే వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా అంతర్జాతీయ విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి.
భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కీలకంగా మారనుంది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు లభించడంతో పాటు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ కనెక్టివిటీతో విజయనగరం, విశాఖపట్నం పరిసర ప్రాంతాలు మరింత అభివృద్ధి చెందనున్నాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.