ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధికి కీలక నిర్ణయం తీసుకుంది. మూడు మున్సిపాలిటీలకు సంబంధించిన గ్రేడ్ హోదాలను పెంచుతూ తక్షణమే అమల్లోకి వచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఆయా పట్టణాలకు మరిన్ని అభివృద్ధి అవకాశాలు లభించనున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–1 నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు పెంచారు. 2022 నుంచి మున్సిపాలిటీకి వచ్చిన ఆదాయం, ఖర్చులను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ తెలిపింది. హోదా పెంపుతో తణుకు పట్టణానికి అధిక నిధులు వచ్చే అవకాశం ఉంది.
అలాగే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపాలిటీని కూడా స్పెషల్ గ్రేడ్ నుంచి సెలక్షన్ గ్రేడ్‌కు అప్‌గ్రేడ్ చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ ఆదాయ–వ్యయాల వివరాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
మరోవైపు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీ హోదాను గ్రేడ్–3 నుంచి గ్రేడ్–1కు పెంచారు. 2021 నుంచి వచ్చిన ఆర్థిక లెక్కల ఆధారంగా ఈ మార్పు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అధికారిక నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.
మున్సిపాలిటీల గ్రేడ్ పెంపుతో ఆయా పట్టణాలకు అధిక నిధులు, విస్తృత అధికారాలు లభిస్తాయి. దీంతో పట్టణాభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందే అవకాశం ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.