విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నగరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆరిలోవ ప్రాంతంలో రూ.14 కోట్లతో ఆధునిక ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
ఇండోర్ స్టేడియంతో పాటు విశాఖలో మరిన్ని మౌలిక వసతుల పనులు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే జోన్ కార్యాలయం ప్రారంభం, ఆనందపురం జంక్షన్‌లో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా ఫ్లైఓవర్ నిర్మాణం, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ఎనిమిది కొత్త రహదారుల నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
ఈ అభివృద్ధి కార్యక్రమాలపై విశాఖ ఎంపీ ఎం. శ్రీభరత్ ఎమ్మెల్యేలతో కలిసి వివరించారు. రైల్వే జోన్ కార్యాలయం ఒకటి రెండు నెలల్లో ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, గెజిట్ నోటిఫికేషన్ కూడా త్వరలో వస్తుందని తెలిపారు. ఆనందపురం జంక్షన్‌లో వాహనాల రద్దీ తగ్గించేందుకు జాతీయ రహదారి సంస్థ అధికారులు ఫ్లైఓవర్ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారని వెల్లడించారు.
భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ కలిసి ఎనిమిది రహదారులను అభివృద్ధి చేస్తున్నాయి. విశాఖకు వచ్చే పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఆర్‌కే బీచ్, కైలాసగిరి, జూ, కంబాలకొండ వంటి పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
విశాఖ అభివృద్ధిపై కూటమి నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో పెట్టుబడిదారులు భయపడినా, ప్రస్తుతం విశాఖ ప్రశాంతంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. నగరాన్ని టూరిజం, ఐటీ, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పనిచేస్తున్నామని చెప్పారు. తాగునీటి సమస్యకు పరిష్కారంగా రూ.595 కోట్లతో కొత్త మంచినీటి పథకం, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, అన్న క్యాంటీన్ల విస్తరణ వంటి మరిన్ని కార్యక్రమాలు కూడా అమలు కానున్నాయి.