రాష్ట్రంలో కొత్తగా రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుకు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఇప్పటివరకు 26 జిల్లాలుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. డిసెంబర్ 31 నుంచి ఈ కొత్త జిల్లాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
పోలవరం జిల్లాకు రంపచోడవరం కేంద్రంగా నిర్ణయించగా, మార్కాపురం జిల్లాకు మార్కాపురమే ప్రధాన కేంద్రంగా వ్యవహరించనుంది. గిరిజన ప్రాంతాలు, దూర గ్రామాల ప్రజలకు పరిపాలన మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఈ జిల్లాల ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల ప్రజలు ఇప్పటివరకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
కొత్త జిల్లాలతో పాటు రెవెన్యూ పరిపాలనలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అనకాపల్లి జిల్లాలో అడ్డరోడ్డు జంక్షన్, ప్రకాశం జిల్లాలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి రెవెన్యూ డివిజన్లుగా గుర్తింపు పొందాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం రెవెన్యూ డివిజన్ల సంఖ్య 77 నుంచి 82కి చేరింది.
మండలాల పరంగా కూడా పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఆదోని ప్రాంతంలో ఆదోని–1, ఆదోని–2 అనే రెండు కొత్త మండలాలను ఏర్పాటు చేయడంతో రాష్ట్రంలోని మండలాల సంఖ్య 681కి పెరిగింది. పెనుగొండ మండలాన్ని వాసవీ పెనుగొండగా పేరు మార్చగా, నందిగామ మండలాన్ని పలాస రెవెన్యూ డివిజన్ నుంచి టెక్కలికి మార్చారు. అలాగే సామర్లకోట మండలాన్ని కాకినాడ డివిజన్ నుంచి పెద్దపురం డివిజన్‌లో కలిపారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాను పాడేరు కేంద్రంగా పునర్వ్యవస్థీకరించగా, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనూ కొన్ని మండలాల సరిహద్దుల్లో మార్పులు చేశారు. గూడూరు నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరు జిల్లాలో కలపగా, రైల్వే కోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోకి, రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాలోకి చేర్చేందుకు తుది నోటిఫికేషన్ జారీ అయింది. ప్రజల అభిప్రాయాలు, స్థానిక అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఈ మార్పులు చేపట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.
డిసెంబర్ 31 నుంచి కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, మారిన మండలాల సరిహద్దులన్నీ అమల్లోకి వస్తాయని స్పష్టత ఇవ్వడంతో రాష్ట్ర పరిపాలన కొత్త దశలోకి అడుగుపెడుతున్నట్టు అయింది.