ఆంధ్రప్రదేశ్‌లో మరో కొత్త పోర్టు నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తిరుపతి జిల్లా దుగరాజపట్నం వద్ద కొత్త ఓడరేవు నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న మూడు ప్రధాన పోర్టులు 2026 చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉండగా, ఇప్పుడు మరో పోర్టు నిర్ణయం రాష్ట్రాభివృద్ధికి కీలకంగా మారనుంది.
సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. దుగరాజపట్నం పోర్టుతో పాటు అక్కడ నౌకా నిర్మాణ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ సముద్ర తీరం ఉన్న నేపథ్యంలో, పోర్టులకు అనుసంధానంగా ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ కల్పిస్తే భారీ పెట్టుబడులు వస్తాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణపట్నం, రామాయపట్నం వంటి పోర్టులు ఉన్నాయని సీఎం గుర్తు చేశారు. తిరుపతి జిల్లాలో దుగరాజపట్నం పోర్టు అందుబాటులోకి వస్తే అది ఒక కీలక కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో పోర్టు ఏర్పాటు చేయడానికి అనువైన ప్రాంతాన్ని గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పోర్టుల అభివృద్ధితో పాటు విమానాశ్రయాల నిర్మాణంపైనా సీఎం దృష్టి పెట్టారు. కుప్పం, శ్రీకాకుళం, దగదర్తి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో ఎయిర్‌పోర్టుల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే నాగార్జునసాగర్, బొబ్బిలి, దొనకొండ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్‌స్ట్రిప్‌లను అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
కేబినెట్ సమావేశంలో పాలనపై కూడా సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేశారు. మంత్రులు, అధికారులు మరింత చురుకుగా పనిచేయాలని, సమావేశాలకు ముందే పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. 2025లో ప్రభుత్వం మెరుగ్గా పనిచేసిందని, 2026లో ఇంకా మంచి ఫలితాలు సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్టులు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన విజయమని సీఎం పేర్కొన్నారు.