ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కీలక అలర్ట్ ఇచ్చింది. ఇటీవల కాలంలో పింఛన్ల తొలగింపుపై రాజకీయంగా పెద్ద చర్చ జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే నిజానిజాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా పింఛన్ల విషయంలో తప్పుదోవ పట్టించే ప్రచారాలకు చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో, త్వరలోనే మరో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.
గతంలో వైసీపీ ప్రభుత్వం పింఛన్ల మొత్తాన్ని భారీగా పెంచడంతో పాటు లబ్ధిదారుల సంఖ్యను కూడా పెంచింది. ఆ తర్వాత ఏర్పడిన కూటమి ప్రభుత్వం అదే పింఛన్లను కొనసాగిస్తూ, ప్రతి నెలా ఇంటి వద్దకే పంపిణీ చేసే విధానాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపిన తర్వాత అనర్హులుగా గుర్తించిన కొందరిని జాబితా నుంచి తొలగించింది. ఈ క్రమంలో “పెద్ద సంఖ్యలో పింఛన్లు తీసేశార”నే ప్రచారం రాజకీయ వేదికలపై జోరుగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ఈ అంశాన్ని రాజకీయంగా లేవనెత్తుతోంది.
ఈ పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పింఛన్ లబ్ధిదారులపై ఐవీఆర్ఎస్ విధానంలో ఒక సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సర్వే ఉద్దేశం పింఛన్లను తొలగించడం కాదు, కొత్తగా లబ్ధిదారులను గుర్తించడం కూడా కాదు. ప్రస్తుతం పింఛన్ అందుకుంటున్న వారికి నిజంగా పింఛన్ సక్రమంగా అందుతోందా? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా? అనే అంశాలను నేరుగా తెలుసుకోవడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .
ఈ సర్వేలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ లబ్ధిదారులకు ప్రభుత్వ తరఫున ఫోన్ కాల్స్ వస్తాయి. కాల్ వచ్చినప్పుడు మూడు ప్రశ్నలు అడుగుతారు. మొదటిది, ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం అమలులో ఎలాంటి అవినీతి జరుగుతోందా అనే విషయం. రెండోది, ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ ఇంటి దగ్గరకే అందుతోందా అనే ప్రశ్న. మూడోది, పింఛన్ అందించే సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది అనే అంశం. ఈ ప్రశ్నలకు లబ్ధిదారులు ఫోన్‌లోనే సంఖ్యల ద్వారా సమాధానం ఇవ్వాలి.
ఈ సమాధానాల ఆధారంగా ప్రభుత్వం కొత్త సంవత్సరంలో పింఛన్ వ్యవస్థపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఒకవేళ అవినీతి జరుగుతోందని తేలితే, సంబంధిత సచివాలయ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. అలాగే ఇంటి వద్దకు రాకుండా పింఛన్ ఇవ్వడం లేదన్న ఫిర్యాదులు ఎక్కువైతే, ఆ విధానాన్ని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ సర్వే మరో కోణంలోనూ కీలకమని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం పింఛన్ల సంఖ్యను కావాలని తగ్గించిందా? లేక నిజంగా అనర్హులను మాత్రమే తొలగించిందా? అనే అంశాలపై స్పష్టత రావడానికి ఈ సర్వే ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అందుకే పింఛన్ లబ్ధిదారులు ఈ సర్వేలో చురుగ్గా పాల్గొని నిజాయితీగా సమాధానాలు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు.