ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) ప్రజల స్వయం ఉపాధికి బలమైన చేయూత అందిస్తోంది. ఎస్సీ కార్పొరేషన్, సెర్ప్ ఆధ్వర్యంలో రాయితీ రుణ పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా 4,400 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక ప్రక్రియ జనవరి మొదటి వారంలో ప్రారంభమై నెలాఖరుకు పూర్తవుతుంది. జిల్లాల వారీగా ఎస్సీ జనాభాను ఆధారంగా తీసుకుని లబ్ధిదారుల సంఖ్యను నిర్ణయించారు.
ఈ పథకం ప్రధాన లక్ష్యం ఎస్సీ వర్గాల ప్రజలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకోవడం. మొత్తం 56 రకాల వ్యాపారాల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకుని ఉపాధి ప్రారంభించుకునే అవకాశం కల్పించారు. ఆటో నడపడం, చెప్పుల షాపు, బేకరీ, మొబైల్ షాపు, టిఫిన్ సెంటర్, ఫుడ్ స్టాల్, జీడిపప్పు వ్యాపారం వంటి చిన్న వ్యాపారాలు ఈ పథకం కింద ప్రారంభించవచ్చు.
ఒక వ్యాపార యూనిట్ ఏర్పాటుకు కనీసం లక్ష రూపాయల ఖర్చు ఉంటే, అందులో రూ.50 వేలను ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. దీంతో లబ్ధిదారులు తక్కువ పెట్టుబడితోనే తమ స్వంత వ్యాపారం ప్రారంభించవచ్చు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం రూ.63.26 కోట్లు కేటాయించింది. ఇది కేంద్ర ప్రభుత్వ పీఎం అజయ్ పథకంతో భాగస్వామ్యంగా అమలవుతోంది.
ఎస్సీ మహిళలకు ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. ‘ఉన్నతి’ పథకాన్ని రాయితీ రుణాలతో అనుసంధానం చేసి, డ్వాక్రా సంఘాల పరిధిలోని ఎస్సీ మహిళలకు వడ్డీ లేని రుణాలు అందించనుంది. యూనిట్ విలువలో రాయితీ పోగా మిగిలిన మొత్తాన్ని వడ్డీ లేకుండా ఇచ్చి, నెలవారీ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించారు. దీని వల్ల మహిళలపై ఆర్థిక భారం గణనీయంగా తగ్గనుంది.
ఇక NSFDC, NSKFDC పథకాల కింద గతంలో రుణాలు తీసుకున్న ఎస్సీ లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 11,479 మందికి వడ్డీ మాఫీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ లబ్ధిదారులు నాలుగు నెలల్లో అసలు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల వడ్డీ భారంతో ఇబ్బంది పడుతున్న ఎస్సీ కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.