టర్కీలో చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. వృద్ధ పెన్షనర్లు తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎంచుకున్న మార్గం సాధారణ నిరసన కాదు, రాజకీయ నినాదం కూడా కాదు, కానీ కొంచెం హాస్యంగా కనిపించినా లోతైన ఆర్థిక సందేశం దాగి ఉన్న ఒక బెదిరింపు. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో జీవన వ్యయాలు భరించలేక ఇబ్బంది పడుతున్న వృద్ధులు, తమ పెన్షన్‌ను ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయితే ఆ డిమాండ్‌ను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోకపోవడంతో, వారు వినూత్నమైన హెచ్చరికతో ముందుకొచ్చారు.
మా పెన్షన్‌ను పెంచకపోతే మాకంటే 20 సంవత్సరాలు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటాం అని వృద్ధులు ప్రకటించారు. ఇది వినడానికి సరదాగా అనిపించినా, దాని వెనుక ఆర్థిక లాజిక్ ఉందండోయ్. వృద్ధులు చెప్పిన మాట ఏమిటంటే తాము త్వరలోనే మరణించినా తమ భార్యలకు ప్రభుత్వం కుటుంబ పెన్షన్ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఇప్పుడే పెన్షన్ పెంచకపోతే, భవిష్యత్తులో 40 నుంచి 50 సంవత్సరాల పాటు ప్రభుత్వం కుటుంబ పెన్షన్ రూపంలో మరింత ఎక్కువ ఖర్చు భరించాల్సి వస్తుంది. ఈ ఆలోచన ప్రజల్లోనే కాదు, ప్రభుత్వ వర్గాల్లో చర్చాంశనీయంగా మారింది
టర్కీలో ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, అద్దెలు అన్నీ విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్థిర ఆదాయం మీద ఆధారపడే వృద్ధ పెన్షనర్లు అధికంగా ప్రభావితమయ్యారు. వారి పెన్షన్ రోజువారీ ఖర్చులకు కూడా సరిపోవడం లేదని వారు వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో, సంప్రదాయ నిరసనలకన్నా భిన్నంగా, ప్రభుత్వానికి దీర్ఘకాల ఆర్థిక భారం ఎలా పెరుగుతుందో స్పష్టంగా అర్థమయ్యేలా ఈ కార్యాచరణ పనిచేసింది.
ఈ హెచ్చరిక ఎంత బలంగా మారిందంటే చివరకు టర్కీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి వచ్చింది. పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం వృద్ధుల పెన్షన్‌ను ఏకంగా 40 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం మాత్రమే కాదు, ప్రజల సృజనాత్మక ఆలోచనకు వచ్చిన విజయం అని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రజలు తమ సమస్యను సరైన రీతిలో, ప్రభావవంతమైన సందేశంతో తెలియజేస్తే, ప్రభుత్వాలు తప్పకుండా స్పందించాల్సి వస్తుందనే విషయానికి ఇది ఉదాహరణగా మారింది.
ఈ సంఘటనతో వృద్ధులు సమాజంలో భారమనే భావన కాకుండా వారి అనుభవంతో, తెలివితో వ్యవస్థలను ప్రశ్నించగల శక్తిగా మారగలరని ఇది నిరూపించింది. హాస్యంగా కనిపించినా, దీని వెనుక ఉన్న సందేశం చాలా గంభీరమైనది. ఆర్థిక విధానాలు రూపొందించేటప్పుడు, ముఖ్యంగా పెన్షన్లు, సంక్షేమ పథకాలు నిర్ణయించేటప్పుడు, భవిష్యత్ ప్రభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సంఘటన టర్కీ ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు ఒక పాఠంగా నిలిచింది.