సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో రహస్యంగా కోడికత్తుల తయారీ వ్యవహారం కలకలం రేపింది. అద్దె గదులు తీసుకుని, యంత్రాల సహాయంతో భారీ స్థాయిలో కోడి పందేల కోసం ఉపయోగించే కత్తులు తయారు చేస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడుల్లో బయటపడింది. ఈ దాడుల్లో సుమారు 2 వేల కోడికత్తులను స్వాధీనం చేసుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పోలీసుల సమాచారం ప్రకారం సంక్రాంతి సమయంలో కోడి పందేలు నిర్వహించే వారికి ముందుగానే ఆర్డర్లు తీసుకుని ఈ కత్తులను తయారు చేస్తున్నారు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి కార్యకలాపాలు బయటకు తెలియకుండా నిర్వహిస్తారు. అయితే ఈసారి పెద్ద ఎత్తున కత్తులు తయారవుతున్నాయన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో బృందాలుగా విడిపోయిన పోలీసులు ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కత్తులతో పాటు వాటికి పదును పెట్టే యంత్రాలు, నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.
విస్సన్నపేట ప్రాంతంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఐదు యంత్రాలతో కోడికత్తులకు పదును పెడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి వందల సంఖ్యలో కత్తులు బయటపడ్డాయి. మరోవైపు అంపాపురం, మైలవరం, ఇబ్రహీంపట్నం, జి.కొండూరు మండలాల పరిధిలోనూ ఇదే తరహా తయారీ కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కొక్క చోట వందల సంఖ్యలో కత్తులు లభించడంతో పోలీసులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. వీటిని స్థానిక పోలీస్‌స్టేషన్లకు తరలించి కేసులు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో కోడి పందేలు నిర్వహించే నిర్వాహకులు ముందుగానే కత్తులను కొనుగోలు చేసి, అవసరమైనంత పదును పెట్టించుకుని నిల్వ ఉంచుకుంటున్నారని తెలిసింది. కొందరు కస్టమర్లు నేరుగా కత్తులు తీసుకువచ్చి పదును పెట్టించుకుంటున్నట్లు కూడా గుర్తించారు. పోలీసుల నిఘా తప్పించుకునేందుకు తరచూ ప్రదేశాలు మార్చుతూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని సమాచారం.
టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేసిన విషయం ఏంటంటే, కోడికత్తుల తయారీ, విక్రయం రెండూ చట్టవిరుద్ధమే. వీటి కారణంగా ప్రాణనష్టం, ఘర్షణలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వారు హెచ్చరించారు. అందుకే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి తయారీ కేంద్రాలపై నిఘా కొనసాగుతుందని, అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని తెలిపారు
ఆ జిల్లాలో 2 వేల కోడికత్తులు స్వాధీనం..!!