ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచలేదని స్పష్టంగా వెల్లడించింది. జీవిత పన్నుపై అదనంగా కేవలం 10 శాతం రోడ్ సేఫ్టీ సెస్ మాత్రమే విధిస్తున్నామని తెలిపింది. కొందరు భావిస్తున్నట్లు లైఫ్ ట్యాక్స్‌ను మరో 10 శాతం పెంచినట్లు కాదని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
ఈ రోడ్ సేఫ్టీ సెస్ ద్వారా వసూలు అయ్యే మొత్తాన్ని రోడ్డు ప్రమాదాల నివారణకు, రహదారుల అభివృద్ధికి మాత్రమే వినియోగిస్తామని రవాణాశాఖ తెలిపింది. ప్రజల ప్రాణభద్రతే ప్రధాన లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఈ సెస్ వాహన యజమానులపై పెద్దగా భారం కాదని అధికారులు స్పష్టం చేశారు.
ఉదాహరణకు లక్ష రూపాయల విలువైన బైక్ తీసుకుంటే, ఇప్పటి వరకు దానిపై 12 శాతం జీవిత పన్ను (రూ.12,000) చెల్లించేవారు. ఇప్పుడు అదే లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం రోడ్ సేఫ్టీ సెస్ (రూ.1,200) అదనంగా చెల్లించాలి. మొత్తంగా ఇది వాహన ధరపై భారీ భారం కాదని రవాణాశాఖ వివరించింది.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం వాహనాలపై విధించే జీఎస్టీని 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీని వల్ల లక్ష రూపాయల వాహనంపై దాదాపు రూ.10,000 వరకు ఆదా అవుతోంది. ఈ ఆదాతో పోలిస్తే, రోడ్ సేఫ్టీ సెస్ రూపంలో వచ్చే అదనపు భారం చాలా తక్కువేనని అధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర కేబినెట్ కొత్త మోటారు వాహనాలపై లైఫ్ ట్యాక్స్‌లో 10 శాతం రహదారి భద్రత సెస్ వసూలు చేసేందుకు ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. దీని ద్వారా రాష్ట్రానికి నెలకు సుమారు రూ.22.5 కోట్లు, ఏడాదికి రూ.270 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా. ఈ మొత్తాన్ని పూర్తిగా రోడ్డు భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణ, రహదారుల అభివృద్ధికే ఖర్చు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.