ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం రవాణా శాఖలో మరో కీలక సంస్కరణకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు కొత్త వాహనం కొనుగోలు చేసిన తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరిగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అయితే తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ కొత్త విధానంతో, వాహనం కొనుగోలు చేసిన షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయ్యేలా రవాణా శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ అంశంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. ఈ మార్పు అమలులోకి వస్తే వాహనదారులకు సమయం, ఖర్చు రెండూ గణనీయంగా తగ్గనున్నాయి.
ప్రతి సంవత్సరం తెలంగాణ వ్యాప్తంగా సుమారు 6.03 లక్షల ద్విచక్ర వాహనాలు, అలాగే సుమారు 1.75 లక్షల కొత్త కార్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ప్రస్తుతం కొత్త వాహనం కొనుగోలు చేసినప్పుడు డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ నెంబర్‌ను ఇస్తారు. ఆ తర్వాత శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుడు మళ్లీ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. అక్కడ ప్రక్రియ పూర్తయిన తర్వాత నెంబర్ ప్లేట్ కోసం మరోసారి డీలర్‌ను సంప్రదించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా వాహనదారులకు అనవసరమైన తిరుగుడు, సమయ వ్యయం ఎదురవుతోంది. ఈ అసౌకర్యాలను తొలగించేందుకే ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని తీసుకొస్తోంది.
ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు కేంద్ర రోడ్డు రవాణా, రహదారి మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేసే ‘వాహన్’ మరియు ‘సారథి’ పోర్టళ్లను పూర్తిస్థాయిలో వినియోగిస్తూ, షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ‘సారథి’ పోర్టల్ అమలులో ఉన్నప్పటికీ, ‘వాహన్’ పోర్టల్‌ను మాత్రం పూర్తిగా అమలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో ‘వాహన్’ పోర్టల్‌ను వేగంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవలే అధికారులను ఆదేశించారు. దీనివల్ల రవాణా శాఖ సేవలు పూర్తిగా డిజిటల్ రూపంలోకి మారే అవకాశాలు ఉన్నాయి.
ప్రభుత్వ నిర్ణయం అమల్లోకి వస్తే వాహనం కొనుగోలు చేసిన సమయంలోనే డీలర్ కొనుగోలుదారుడి వివరాలను వాహన్–సారథి పోర్టల్‌లో నమోదు చేస్తారు. రవాణా శాఖ అధికారి డిజిటల్ అప్రూవల్ ఇచ్చిన వెంటనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. సాధారణ నెంబర్ కోరుకునే వారికి అదే రోజు సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం వరకు నెంబర్ ప్లేట్ అందే అవకాశం ఉంటుంది. ఫ్యాన్సీ నెంబర్ కోరుకునే వారు మాత్రం కొత్త నెంబర్ సిరీస్ విడుదలయ్యే వరకు వేచి చూడాల్సి ఉంటుంది. అయితే వాణిజ్య అవసరాల కోసం కొనుగోలు చేసే వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రం ఇప్పటిలాగే ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. మొత్తంగా ఈ సంస్కరణ వాహనదారులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది.