తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు శుభవార్త అందింది. హైదరాబాద్ నుంచి తిరుపతికి నడిచే ఇండిగో విమాన (IndigoFlights) సర్వీసు మళ్లీ ప్రారంభమైంది. గత నెలలో ఏర్పడిన ఇండిగో సంక్షోభం కారణంగా ఈ సర్వీసు డిసెంబర్ 18 నుంచి నిలిచిపోయింది. దాంతో విమాన ప్రయాణాన్ని ఆశ్రయించే భక్తులు, ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఇప్పుడు పరిస్థితులు సాధారణ స్థితికి రావడంతో ఈ విమాన సర్వీసును తిరిగి పునరుద్ధరించారు.
హైదరాబాద్ నుంచి ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు శ్రీవారి దర్శనం కోసం ప్రయాణిస్తుంటారు. ఎక్కువ మంది రైళ్ల ద్వారా, మరికొందరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా వెళ్తుండగా, ఇంకొంతమంది విమాన సర్వీసులను ఎంచుకుంటారు. రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుమలకు చేరడం చాలా మందికి సౌకర్యంగా ఉంటుంది. అలాంటి ప్రయాణికులకు ఈ ఇండిగో సర్వీసు నిలిచిపోవడం ఇబ్బందిగా మారింది.
డిసెంబర్ నెలలో ఇండిగో సంస్థ ఎదుర్కొన్న సాంకేతిక, నిర్వహణ సమస్యల కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి అనేక విమానాలను రద్దు చేశారు. విశాఖపట్నం–హైదరాబాద్, బెంగళూరు వంటి కీలక రూట్లలో కూడా సర్వీసులు నిలిచిపోయాయి. హైదరాబాద్‌కు రావాల్సినవి, ఇక్కడి నుంచి వెళ్లాల్సినవి రెండింటినీ రద్దు చేయడంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలపై ఆధారపడాల్సి వచ్చింది.
ఇప్పుడు జనవరి 2 నుంచి హైదరాబాద్–తిరుపతి (Hyderabad-Tirupati) ఇండిగో విమాన సర్వీసు తిరిగి ప్రారంభమైంది. ఈ విమానం హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి 3.05 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరిగి తిరుపతి నుంచి 3.25 గంటలకు బయల్దేరి హైదరాబాద్‌కు చేరేలా షెడ్యూల్ రూపొందించారు. ఈ సమయాలు భక్తులు, వ్యాపార ప్రయాణికులకు అనుకూలంగా ఉండటంతో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది.
ఇండిగోలో పరిస్థితులు క్రమంగా సర్దుకుంటున్న నేపథ్యంలో ఇతర రద్దు చేసిన సర్వీసులు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు రైల్వే, ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ, విమాన సర్వీసు పునరుద్ధరణతో వేగవంతమైన ప్రయాణం కోరుకునే వారికి పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా తిరుమల వెళ్లే భక్తులకు ఇది ఎంతో ఉపయుక్తంగా మారనుంది.