భారతీయ ఎస్‌యూవీ విభాగంలో తన ఆధిపత్యాన్ని మరింత బలపరుస్తూ మహీంద్రా అండ్ మహీంద్రా తన లేటెస్ట్ ప్రీమియం ఎస్‌యూవీ XUV 7XOను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో సూపర్ హిట్ అయిన XUV 700కు ఇది అడ్వాన్స్‌డ్, టెక్-లోడెడ్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా కంపెనీ పరిచయం చేసింది. ప్రారంభ ధరను రూ. 13.66 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించగా, ఈ ధరలో ఇంత అధునాతన ఫీచర్లు అందించడం ఆటో మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, డిజైన్ నుంచి డ్రైవింగ్ అనుభూతి వరకూ ప్రతి అంశంలోనూ కొత్తదనాన్ని చూపించింది మహీంద్రా.
XUV 7XO ఎక్స్‌టీరియర్ డిజైన్ చూస్తే, XUV 700 డీఎన్‌ఏ కనిపించినా మరింత షార్ప్‌గా, ఫ్యూచరిస్టిక్‌గా రూపొందించారు. ముందు భాగంలో కొత్త పియానో బ్లాక్ గ్రిల్, ఆకట్టుకునే ‘టాలోన్’ యాక్సెంట్స్, అగ్రెసివ్ హెడ్‌ల్యాంప్ డిజైన్ కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. ఇంటీరియర్‌లోకి అడుగుపెడితే టెక్నాలజీ ఫెస్ట్ మొదలవుతుంది. ఏకంగా మూడు పెద్ద స్క్రీన్లతో కూడిన 31.24 సెం.మీ డిస్‌ప్లే లేఅవుట్‌ను అందించింది. ఇది భారతదేశంలో పెట్రోల్ లేదా డీజిల్ ఎస్‌యూవీలో తొలిసారి. ప్రీమియం లెదర్ సీట్లు, 16-స్పీకర్ల హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్, డాల్బీ అట్మోస్ ఆడియో కలిసి కారును రోడ్డుపై నడిచే థియేటర్‌లా మార్చేశాయి. అదనంగా మహీంద్రా పరిచయం చేసిన కొత్త ‘DAVINCI’ సస్పెన్షన్ సిస్టమ్ వల్ల గుంతల రోడ్లపై కూడా ప్రయాణం మరింత సాఫీగా మారుతుంది.
పవర్‌ట్రెయిన్ పరంగా XUV 7XOను రెండు ఇంజన్ ఆప్షన్లలో అందిస్తోంది మహీంద్రా. పెట్రోల్ వేరియంట్‌లో 2.0 లీటర్ టర్బో ఇంజన్ నుంచి 197 bhp పవర్ వస్తుండగా, డీజిల్ వేరియంట్‌లో 2.2 లీటర్ ఇంజన్ 185 bhp శక్తిని అందిస్తుంది. రెండు ఇంజన్లకూ 6-స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. డీజిల్ వేరియంట్‌లో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సౌకర్యం కూడా ఉండడం ఆఫ్-రోడ్ ప్రియులకు అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. పవర్, పెర్ఫార్మెన్స్, కంఫర్ట్ మూడింటికీ బ్యాలెన్స్ ఇచ్చేలా ఈ ఎస్‌యూవీని డిజైన్ చేశారు.
భద్రత విషయంలో XUV 7XO మరో అడుగు ముందుకేసింది. ఇందులో 120కి పైగా సేఫ్టీ ఫీచర్లు ఉండగా, భారత్ NCAP ప్రమాణాల ప్రకారం 5-స్టార్ రేటింగ్ సాధించేలా దీన్ని రూపొందించారు. లెవల్ 2 ADAS టెక్నాలజీ ద్వారా అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ సహా 17 రకాల డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లు లభిస్తాయి. జనవరి 14 (సంక్రాంతి) నుంచి అధికారిక బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. టాప్ ఎండ్ వేరియంట్లు AX7, AX7T, AX7L బుక్ చేసుకున్న వారికి అదే రోజు నుంచి డెలివరీలు అందుబాటులోకి రానుండగా, బేస్ వేరియంట్లు AX, AX3, AX5 మాత్రం ఏప్రిల్ 2026 నుంచి మార్కెట్లోకి వస్తాయి.