అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజువెలాపై మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా విధించిన డిమాండ్లకు వెనిజువెలా తలవంచకపోతే, ఆ దేశంపై ‘రెండో విడత’ సైనిక దాడులకు సిద్ధమని స్పష్టం చేశారు. వెనిజువెలాను ప్రస్తుతం అమెరికానే నియంత్రిస్తోందని, అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన అనంతరం అక్కడ తాత్కాలిక పాలన తమ ఆధీనంలోకి వచ్చిందని ట్రంప్ ప్రకటించారు. వెనిజువెలాను మళ్లీ గాడిలో పెట్టడమే తమ లక్ష్యమని, అవసరమైతే మరింత కఠిన చర్యలకు వెనుకాడబోమని ఆయన స్పష్టంగా చెప్పారు.
వెనిజువెలాను ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఆ దేశాన్ని ఒక ‘మృత దేశం’గా అభివర్ణించిన ఆయన, దశాబ్దాలుగా కొనసాగిన దుష్పరిపాలనే ఈ దుస్థితికి కారణమన్నారు. వెనిజువెలాలో అపారమైన చమురు నిక్షేపాలు, సహజ వనరులు ఉన్నాయని, వాటిపై అమెరికాకు పూర్తి యాక్సెస్ కావాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోందని వెల్లడించారు. దెబ్బతిన్న చమురు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించేందుకు అమెరికా చమురు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని, కానీ దానికి భారీ పెట్టుబడులు అవసరమని ట్రంప్ పేర్కొన్నారు. వెనిజువెలా ఆర్థిక పునరుద్ధరణకు అమెరికా నాయకత్వమే కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక మదురో బంధీ కావడంపై వెనిజువెలా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పద్రినో లోపెజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సామ్రాజ్యవాద దురాక్రమణగా ఆయన అభివర్ణించారు. మదురోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూనే, ప్రస్తుతానికి తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్ నాయకత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు. మరోవైపు అమెరికా చర్యలపై అంతర్జాతీయంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. స్పెయిన్, బ్రెజిల్, చిలీ, కొలంబియా వంటి దేశాలు ఈ పరిణామాలు ప్రాంతీయ భద్రతకు ముప్పుగా మారే ప్రమాదముందని హెచ్చరించాయి.
ప్రాంతంలో సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. కరీబియన్ ప్రాంతంలో అమెరికా ఇప్పటికే 15,000 మంది సైనికులను సిద్ధంగా ఉంచగా, వెనిజువెలా సరిహద్దుల్లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిస్పందనగా కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో 30,000 మంది సైనికులను సరిహద్దులకు తరలించారు. కారకాస్ నగరంలో ప్రజలు మరోసారి దాడులు జరగవచ్చన్న భయంతో నిత్యావసర సరుకుల కోసం సూపర్‌మార్కెట్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిణామాలు లాటిన్ అమెరికా మొత్తానికే అస్థిరతను తెచ్చే ప్రమాదం ఉందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.