ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని స్కూల్, కాలేజీ విద్యార్థులకు మరోసారి మంచి అవకాశం కల్పించింది. విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపులను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్యాంపులు జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు కొనసాగుతాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అలాగే జూనియర్ కాలేజీల్లో ఈ క్యాంపులు ఏర్పాటు చేయనున్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు మాండేటరీ బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) అవసరం ఉండగా, ఇప్పటివరకు కేవలం 5.94 లక్షల మంది మాత్రమే అప్‌డేట్ చేయించుకున్నారు. ఇంకా 10.57 లక్షల మంది విద్యార్థుల ఆధార్ బయోమెట్రిక్ వివరాలు పెండింగ్‌లో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. ఈ కారణంగా మిగిలిన విద్యార్థుల కోసం పాఠశాలలు, కాలేజీల్లోనే ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకంగా 15 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న జూనియర్ కాలేజీ విద్యార్థులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోవాలని సూచించారు. ఆధార్‌లో MBU పూర్తికాకపోతే NEET, JEE వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు హాజరు కావడంలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే విద్యార్థులు తమ సమీపంలోని స్కూల్ లేదా జూనియర్ కాలేజీలో నిర్వహించే ఆధార్ క్యాంప్‌కు హాజరై అప్‌డేట్ పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.
పిల్లలు చిన్న వయసులో ఆధార్ తీసుకున్నప్పటికీ, ఐదు నుంచి 15 ఏళ్ల మధ్య వయసులో వేలిముద్రలు, కంటి పాపల వివరాలు మారుతుంటాయి. ఈ మార్పులను ఆధార్‌లో అప్‌డేట్ చేయకపోతే పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు నమోదు వంటి అంశాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యలను నివారించడానికే ప్రభుత్వం ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది.
ఈ ఆధార్ అప్‌డేట్ పూర్తిగా ఉచితం అని అధికారులు స్పష్టం చేశారు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. గత ఏడాది సెప్టెంబర్ నుంచే ఈ క్యాంపులు జరుగుతున్నప్పటికీ ఇంకా చాలా మంది విద్యార్థులు అప్‌డేట్ చేయించుకోలేదని తెలిపారు. అందుకే ఎక్కువ మంది పెండింగ్‌లో ఉన్న పాఠశాలలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు.