తెలుగు సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించేందుకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మరోసారి విభిన్నమైన ప్లాన్‌తో ముందుకొస్తున్నారని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న భారీ చిత్రం వారణా టీజర్‌ను ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో విడుదల చేయాలన్న ఆలోచన ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పటివరకు భారతదేశంలో ఏ సినిమాకు జరగని విధంగా, విదేశీ ప్రతిష్ఠాత్మక వేదికపై ప్రమోషనల్ కంటెంట్‌ను ఆవిష్కరించాలన్న ప్రయత్నమే ఈ వార్తకు ప్రత్యేకత తెచ్చింది.
సమాచారం ప్రకారం, పారిస్‌లోని ప్రఖ్యాత లే గ్రాండ్ రెక్స్ (Le Grand Rex ) థియేటర్‌లో ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఈ వేదిక కేవలం సినిమా థియేటర్ మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయి ఈవెంట్లు, లైవ్ కాన్సర్ట్లు జరిగే లగ్జరీ ఆడిటోరియంగా పేరు పొందింది. దాదాపు మూడు వేల మంది ఒకేసారి కూర్చునే సౌకర్యం ఉన్న ఈ హాల్‌లో టీజర్‌ను ప్రదర్శిస్తే, ‘వారణాసి’ పేరు ప్రపంచవ్యాప్తంగా మరింత బలంగా వినిపిస్తుందని భావిస్తున్నారు. అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా, జనవరిలో ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది.
ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. భారీ బడ్జెట్, అంతర్జాతీయ ప్రమాణాల విజువల్స్, రాజమౌళి మార్క్ కథనంతో ఈ చిత్రం గ్లోబల్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కుతోందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన టైటిల్ గ్లింప్స్ విడుదల ఈవెంట్‌కు వచ్చిన స్పందనే దీనికి ఉదాహరణ. ఆ గ్లింప్స్‌లో కనిపించిన టైమ్ ట్రావెల్ సూచనలు, పురాణ నేపథ్యం, భవిష్యత్ అంశాల మేళవింపు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేపాయి.
ముఖ్యంగా మహేశ్ బాబు లుక్ గురించి అభిమానుల్లో పెద్ద చర్చ నడుస్తోంది. సంప్రదాయ దుస్తుల్లో, రౌద్ర భావంతో కనిపించిన ఆయన అవతారం సినిమాకు కొత్త డైమెన్షన్ ఇచ్చిందనే అభిప్రాయం వినిపిస్తోంది. కథ పరంగా గతం, వర్తమానం, భవిష్యత్‌ను ఒకే దారంలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారని టాక్. దీనివల్ల ‘వారణాసి’ కేవలం యాక్షన్ సినిమా కాకుండా, భావోద్వేగాలు, ఆధ్యాత్మికత, సైన్స్ ఫిక్షన్ అంశాలు కలిసిన ప్రత్యేక ప్రయోగంగా నిలవనుందని అంచనాలు పెరుగుతున్నాయి.
తారాగణం విషయానికొస్తే బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, శక్తివంతమైన ప్రతినాయక పాత్రలో పృధ్విరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. సంగీత బాధ్యతలను ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి భుజాన వేసుకోగా, కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించారు. ఈ కలయికే సినిమాపై నమ్మకాన్ని మరింత పెంచుతోంది.
ఇంకా కొన్ని నెలల పాటు షూటింగ్ కొనసాగనున్న ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. అంతవరకు ప్రతి అప్‌డేట్‌ను ప్రత్యేకంగా ప్లాన్ చేస్తూ, ‘వారణాసి’ని ప్రపంచ స్థాయి సినిమాగా నిలబెట్టాలన్న లక్ష్యంతో రాజమౌళి ముందుకు సాగుతున్నారని చెప్పుకోవాలి. పారిస్ వేదికగా టీజర్ విడుదల నిజమైతే, అది భారతీయ సినిమా చరిత్రలో ఓ కొత్త అధ్యాయంగా మిగిలిపోతుందన్న మాట సినీ వర్గాలలో వినిపిస్తుంది.