జిల్లా కలెక్టరేట్లలో ప్రతి వారం నిర్వహించే గ్రీవెన్స్‌డే కార్యక్రమాల్లో ప్రజలు సమర్పించే అర్జీల్లో అధిక శాతం భూముల సమస్యలపైనే ఉంటున్నాయి. పట్టాదారు పాస్‌బుక్ లోపాలు, రీ సర్వే తప్పిదాలు, మ్యుటేషన్ సమస్యలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు వంటి అంశాలతో ప్రజలు ఏళ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఈ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్’ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల సమస్యలను ఒకే వేదికపై, నిర్దిష్ట గడువులో పరిష్కరించడమే ఈ రెవెన్యూ క్లినిక్‌ల ప్రధాన ఉద్దేశం.
ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ క్లినిక్ పనిచేస్తుంది. ఈ క్లినిక్‌లో జిల్లా రెవెన్యూ అధికారులు, డిప్యూటీ కలెక్టర్లు, సంబంధిత మండలాల తహసీల్దార్లు హాజరై ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరిస్తారు. భూములకు సంబంధించిన వివిధ అంశాల కోసం ప్రత్యేక టేబుళ్లు ఏర్పాటు చేసి, అర్జీలను డెస్క్ స్థాయిలోనే ప్రాథమికంగా పరిశీలిస్తారు. అనంతరం సంబంధిత తహసీల్దార్‌కు అర్జీని పంపించి, ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. సీనియర్ అధికారుల సమీక్ష తర్వాత సమస్య పరిష్కారానికి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రక్రియ అంతా పర్యవేక్షణతో, పారదర్శకంగా సాగుతుంది.
రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 14 రకాల భూమి సమస్యలపై పరిష్కారం లభిస్తుంది. రీ సర్వే లోపాలు, ఎఫ్-లైన్ పిటీషన్లు, అసైన్డ్ 1బీ, డీ పట్టా, వెబ్‌ల్యాండ్‌లో విస్తీర్ణ నమోదు లోపాలు, డీ పట్టా భూముల ఆక్రమణలు, మ్యుటేషన్ తప్పిదాలు, ప్రభుత్వ భూముల అక్రమ ఆక్రమణలు, 22ఏ జాబితా నుంచి భూముల తొలగింపు, 1-70 చట్టం అమలు, ROFR మంజూరు, జాయింట్ LPMల విభజన, సింగిల్ LPA విడదీయడం, హద్దుల సవరణ వంటి సమస్యలపై అర్జీలు స్వీకరిస్తారు. ఈ విధంగా దాదాపు అన్ని కీలక భూమి సమస్యలను ఒకే చోట పరిష్కరించే అవకాశం కల్పించారు.
రెవెన్యూ క్లినిక్‌లో స్వీకరించిన ప్రతి అర్జీకి ప్రత్యేక ఆన్‌లైన్ నంబర్ కేటాయించి, దరఖాస్తుదారుల ఫోన్, ఆధార్ వివరాలను నమోదు చేస్తారు. అర్జీ స్వీకరించిన వెంటనే సమస్య పరిష్కారానికి సంబంధించిన కార్యాచరణ వివరాలతో కూడిన సర్టిఫైడ్ కాపీని దరఖాస్తుదారుకు అందిస్తారు. ఇందులో సమస్య తీవ్రత, పరిష్కారానికి పట్టే సమయం వంటి వివరాలు ఉంటాయి. ఈ పత్రంపై డిప్యూటీ కలెక్టరు సంతకం చేస్తారు. సాధ్యమైనంత వరకు ఒక్క రోజులోనే సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. అది సాధ్యం కాని సందర్భాల్లో స్పష్టమైన గడువు విధించి, ఆ లోపు సమస్యను పరిష్కరించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. భూమి సమస్యల పరిష్కారం కోసం meekosam.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా, 1100 హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.