ప్రపంచ రాజకీయాల్లో సంచలనం రేపిన వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో అరెస్ట్ ఉదంతం ఇప్పుడు న్యూయార్క్ ఫెడరల్ కోర్టు గడప చేరింది. డ్రగ్స్ అక్రమ రవాణా, నార్కో టెర్రరిజం వంటి తీవ్రమైన ఆరోపణలతో అమెరికా అధికారులు మదురోపై కేసు నమోదు చేయగా, ఆయన కోర్టులో హాజరై తాను పూర్తిగా నిర్దోషినని స్పష్టం చేశారు. కారకాస్‌లోని అధ్యక్ష భవనం నుంచే తనను బలవంతంగా అరెస్ట్ చేసి అమెరికాకు తీసుకొచ్చారని, ఇది అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు విరుద్ధమని న్యాయమూర్తికి వివరించారు. ఈ కేసు లాటిన్ అమెరికా రాజకీయాల్లోనే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
కోర్టులో మాట్లాడిన మదురో, “నేను ఒక గౌరవనీయుడిని, నా దేశానికి అధ్యక్షుడిని. నా మీద మోపిన ఆరోపణల్లో ఏ ఒక్కటి కూడా నిజం కాదు. నేను నిర్దోషిని” అని స్పష్టంగా ప్రకటించారు. తనను అధికారికంగా పదవి నుంచి తొలగించినా, తానే వెనిజువెలా ప్రజల నిజమైన నాయకుడినని పునరుద్ఘాటించారు. మదురోతో పాటు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కూడా కోర్టుకు హాజరై, తాను వెనిజువెలా ప్రథమ మహిళనని, తనపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ దంపతుల వాదనలు కోర్టు విచారణలో కీలకంగా మారాయి.
మదురోపై అమెరికా ప్రాసిక్యూషన్ మొత్తం నాలుగు ప్రధాన అభియోగాలు నమోదు చేసింది. నార్కో టెర్రరిజానికి పాల్పడ్డాడన్న ఆరోపణ, భారీగా కొకైన్‌ను అమెరికాలోకి అక్రమంగా తరలించేందుకు కుట్ర పన్నాడన్న అభియోగం, మెషిన్ గన్స్ వంటి విధ్వంసకర ఆయుధాలు కలిగి ఉండటం, అలాగే మెక్సికోకు చెందిన సినలోవా, జెటాస్ డ్రగ్ కార్టెల్స్‌తో పాటు కొలంబియా తిరుగుబాటు గ్రూపులతో కలిసి అంతర్జాతీయ డ్రగ్స్ నెట్‌వర్క్ నడిపాడన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే, వెనిజువెలా చమురు వనరులపై కన్నేసిన అమెరికా, రాజకీయ కుట్రలో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టిందని మదురో డిఫెన్స్ టీమ్ తీవ్రంగా వాదిస్తోంది.
మదురో అరెస్ట్ అనంతరం వెనిజువెలాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికా చేపట్టిన ఈ ఆపరేషన్‌కు మద్దతు తెలిపిన వారిని అరెస్ట్ చేయాలని అక్కడి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో రష్యా, చైనా సహా వెనిజువెలా మిత్రదేశాలు అమెరికా చర్యను తీవ్రంగా ఖండించాయి. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ కూడా ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేస్తూ, 1989 పనామా దాడి తర్వాత లాటిన్ అమెరికాలో అమెరికా చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యగా దీన్ని అభివర్ణించారు. బ్రూక్లిన్ డిటెన్షన్ సెంటర్ నుంచి భారీ భద్రత మధ్య హెలికాప్టర్‌లో మదురో దంపతులను కోర్టుకు తరలించడం ఈ కేసు తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది.