ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, 9 మరియు 10 షెడ్యూల్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సోమవారం సమావేశమైంది. ఈ సమావేశం ఆన్‌లైన్ వేదికగా జరిగింది.
ఈ కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచడం సాధ్యమా? దానికి సంబంధించిన న్యాయ, పరిపాలనా అంశాలు ఏమిటి? అనే విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు 62 ఏళ్ల వయోపరిమితితో కొనసాగుతున్న 2831 మంది ఉద్యోగుల పరిస్థితినీ కమిటీ పరిశీలించింది.
ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచితే ప్రభుత్వంపై పడే ఆర్థిక భారంపైనా ఉపసంఘం దృష్టి సారించింది. వేతనాలు, పెన్షన్లు, ఇతర భత్యాల రూపంలో ప్రభుత్వ ఖజానాపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశాన్ని సమీక్షించింది. వయోపరిమితి పెంపుతో వచ్చే అదనపు ఖర్చులపై స్పష్టత అవసరమని అభిప్రాయపడింది.
ఈ నేపథ్యంలో కార్పొరేషన్ల వారీగా ఉద్యోగుల సంఖ్య, వయోపరిమితి పెంచితే వచ్చే ఆర్థిక భారానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. ఆ వివరాల ఆధారంగా సమగ్ర నివేదికను సిద్ధం చేసి మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, పొంగూరు నారాయణ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచే అంశంపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.