ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. డిజిటల్ డిపాజిట్ల పేరుతో భారీగా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడ్డ ఫాల్కన్ సంస్థ ఎండీ అమర్ దీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గల్ఫ్ (Gulf) దేశాల నుంచి ముంబైకి వచ్చిన వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని, తెలంగాణ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌తో కేసు దర్యాప్తులో పెద్ద ముందడుగు పడినట్లైంది.
అమర్ దీప్‌పై ఇప్పటికే లుక్ అవుట్ సర్క్యులర్ (LOC) జారీ అయి ఉండటంతో, ముంబై ఇమ్మిగ్రేషన్ అధికారులు అతని రాకను వెంటనే గుర్తించారు. ఆ సమాచారాన్ని తెలంగాణ పోలీసులకు అందించడంతో, వారు వెంటనే చర్యలు తీసుకుని అతడిని అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్‌లో పారిపోయిన అమర్ దీప్‌ను పట్టుకోవడంలో పోలీసులు సుదీర్ఘంగా గాలింపు చేపట్టిన విషయం తెలిసిందే.
పోలీసుల విచారణలో అమర్ దీప్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో దాదాపు రూ.850 కోట్ల వరకు మోసం చేసినట్లు తేలింది. యాప్ ఆధారిత డిజిటల్ పెట్టుబడులు, ఎమ్‌ఎన్‌సీ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్ పేర్లతో ప్రజలను ఆకర్షించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు, షేర్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడిదారులను బురిడీ కొట్టించినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రావడంతో అమర్ దీప్ దంపతులు దేశం విడిచి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సంస్థ సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు అందుబాటులోకి రావడంతో, స్కామ్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం అమర్ దీప్‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, ఫాల్కన్ స్కామ్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, నిధుల దారి మళ్లింపు, బాధితుల సంఖ్యపై లోతైన విచారణ చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ కేసులో మరికొందరి పాత్రపై కూడా అనుమానాలు ఉన్నాయని, అవసరమైతే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.