China typhoon: రాబోయే 24 గంటలు.. చైనాను వణికిస్తున్న టైఫూన్ 'డాల్ఫిన్': తీరం దాటిన వినాశకర తుపాను.. తీవ్ర రెడ్ అలర్ట్!
China typhoon: ఈ ఏడాది చైనాను తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్ 'డాల్ఫిన్' తూర్పు తీర ప్రాంతంలో ప్రళయం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం తీరం దాటిన ఈ టైఫూన్ కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి.
- WORLD:ఈ ఏడాది చైనాను తాకిన అత్యంత శక్తివంతమైన తుఫాను ఇదే...
- 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు..
China typhoon: ఈ ఏడాది చైనాను తాకిన అత్యంత శక్తివంతమైన టైఫూన్ 'డాల్ఫిన్' తూర్పు తీర ప్రాంతంలో ప్రళయం సృష్టిస్తోంది. ఆదివారం సాయంత్రం తీరం దాటిన ఈ టైఫూన్ కారణంగా భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా అధికారులు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. టైఫూన్ ప్రభావంతో రవాణా, పర్యాటక రంగాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
ఆదివారం సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యుహువాన్ నగరం సమీపంలో డాల్ఫిన్ టైఫూన్ తీరాన్ని తాకింది. ఆ సమయంలో గంటకు 151 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీచాయి. గంట వ్యవధిలోనే సమీపంలోని వెన్‌జౌ నగరం వద్ద రెండోసారి తీరం దాటింది. దీంతో అధికారులు దేశంలోనే అత్యున్నత స్థాయి 'రెడ్ అలర్ట్' జారీ చేశారు. టైఫూన్ తీరం దాటినప్పటికీ, దాని ప్రభావం కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
అధికారులు చేపట్టిన సహాయక చర్యలు మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో ఉన్నాయి. ఒక్క వెన్‌జౌ నగరంలోనే 9 లక్షల మందిని, తైజౌలో 3.90 లక్షల మందిని, ఫుజియాన్ ప్రావిన్స్‌లో 1.67 లక్షల మందిని, షాంఘైలో 2.15 లక్షల మందికి పైగా ప్రజలను లోతట్టు ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. ఒక్క వెన్‌జౌ నగరంలోనే 1,500 అత్యవసర పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
టైఫూన్ కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. ఒక్క షాంఘైలోనే సుమారు 1,500 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హ్యాంగ్‌జౌ విమానాశ్రయంలోనూ వందలాది విమానాలు నిలిచిపోయాయి. జెజియాంగ్ ప్రావిన్స్‌లో 686 రోడ్డు మార్గాలు, 658 రైలు సర్వీసులను నిలిపివేశారు. పోర్టులు, ఫెర్రీ సేవలు కూడా మూతపడ్డాయి. షాంఘైలోని ప్రఖ్యాత లెగోలాండ్ రిసార్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, 234 ప్రధాన పర్యాటక కేంద్రాలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
దాదాపు 6,000 కిలోమీటర్లు ప్రయాణించి చైనాను తాకడం ఈ టైఫూన్ ప్రత్యేకత. జులై చివరిలో మార్షల్ దీవుల వద్ద ఏర్పడిన ఈ టైఫూన్, చైనాకు రాకముందు జపాన్‌లోని ఒకినావా, ఫిలిప్పీన్స్ దేశాలపై కూడా తన ప్రభావాన్ని చూపింది. సోమవారం నాటికి టైఫూన్ బలహీనపడినా, ఇది దేశంలోని లోతట్టు ప్రాంతాల వైపు కదులుతోంది.
దీనివల్ల రాజధాని బీజింగ్‌తో సహా 10కి పైగా ప్రావిన్సులలో రాబోయే రెండు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బీజింగ్‌లో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, వరద నియంత్రణ చర్యలు చేపట్టారు. నదులు, పర్వత ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. జెజియాంగ్‌లో ఒక బాలుడు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం ఉన్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరిగినట్లు అధికారిక ప్రకటన రాలేదు.
Tags
Be the first to react

