World Map: ఇప్పటి వరకు పాటిస్తున్నది అంతా ఫేక్! సరైన కొలతలతో మారనున్న ప్రపంచ మ్యాప్! UN తీర్మానం!
World Map: చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, తరగతి గదుల్లో, గోడలపై చూసిన ప్రపంచ పటం నిజమైన భూభాగ పరిమాణాలను చూపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. మనం విస్తృతంగా చూస్తున్న మెర్కేటర్ మ్యాప్ దేశాలు, ఖండాల అసలు పరిమాణాలను కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూపిస్తుంది.
మన ప్రపంచ పటం నిజమైన పరిమాణాలను చూపిస్తుందా? మెర్కేటర్‌కు బదులుగా ఈక్వల్ ఎర్త్‌పై యూఎన్ దృష్టి..
ఆఫ్రికా కంటే గ్రీన్‌లాండ్ పెద్దదిగా కనిపిస్తుందా? అసలు ప్రపంచ పటాల వెనుక కథ ఇదే..
న్యూఢిల్లీ: చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో, తరగతి గదుల్లో, గోడలపై చూసిన ప్రపంచ పటం నిజమైన భూభాగ పరిమాణాలను చూపిస్తుందా? ఈ ప్రశ్నకు సమాధానం అంత సులభం కాదు. మనం విస్తృతంగా చూస్తున్న మెర్కేటర్ మ్యాప్ దేశాలు, ఖండాల అసలు పరిమాణాలను కొన్ని ప్రాంతాల్లో తప్పుగా చూపిస్తుంది.
ఇలాంటి పరిమాణ వ్యత్యాసాలను తగ్గించే లక్ష్యంతో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్పై ఐక్యరాజ్యసమితి (యూఎన్) దృష్టి సారించింది. ఈ మ్యాప్ భూమిపై ఉన్న ఖండాలు, దేశాల విస్తీర్ణాన్ని మరింత వాస్తవికంగా చూపించే ప్రయత్నం చేస్తుంది.
ఆఫ్రికా, గ్రీన్‌లాండ్ మధ్య అసలు తేడా ఎంత?
ప్రపంచ పటాల విషయంలో తరచూ చెప్పుకునే ఉదాహరణ ఆఫ్రికా–గ్రీన్‌లాండ్. సాధారణ మెర్కేటర్ మ్యాప్‌లో ఈ రెండు ప్రాంతాలు దాదాపు సమాన పరిమాణంలో ఉన్నట్లుగా కనిపిస్తాయి.
కానీ వాస్తవానికి ఆఫ్రికా గ్రీన్‌లాండ్ కంటే సుమారు 14 రెట్లు పెద్దది. భూమి ఉపరితలాన్ని చదునైన కాగితంపై చూపించేటప్పుడు ఏర్పడే ప్రాసెస్ వల్ల ఈ తేడా పటంలో స్పష్టంగా కనిపించదు.
రష్యా, కెనడా, యూరప్, ఉత్తర అమెరికా వంటి అధిక అక్షాంశాల్లో ఉన్న ప్రాంతాలు కూడా మెర్కేటర్ మ్యాప్‌లో వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపిస్తాయి. మరోవైపు భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ఆఫ్రికా, దక్షిణ అమెరికా వంటి ప్రాంతాలు తక్కువ పరిమాణంలో ఉన్నట్లుగా కనిపిస్తాయి.
అసలు మెర్కేటర్ మ్యాప్ ఎందుకు రూపొందించారు?
ఇక్కడ మెర్కేటర్ మ్యాప్‌ను తప్పుపట్టడం కంటే దాని అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి. ఫ్లెమిష్ కార్టోగ్రాఫర్ గెరార్డస్ మెర్కేటర్ 1569లో ఈ ప్రొజెక్షన్‌ను రూపొందించారు.
దీని ప్రధాన లక్ష్యం దేశాల పరిమాణాలను కచ్చితంగా చూపించడం కాదు. సముద్ర ప్రయాణాల్లో నావికులకు మార్గాలను సులభంగా గుర్తించేందుకు దీనిని రూపొందించారు.
నిర్దిష్ట దిక్సూచి దిశలో ప్రయాణించే మార్గాలను మ్యాప్‌పై సూటి గీతలుగా చూపించడం వల్ల నావిగేషన్ సులభమైంది. అయితే భూమి గోళాకారంలో ఉండటంతో దాన్ని చదునైన మ్యాప్‌గా మార్చేటప్పుడు ఉత్తర, దక్షిణ ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా సాగిపోయాయి. అందుకే అధిక అక్షాంశాల్లోని దేశాలు వాస్తవ పరిమాణం కంటే పెద్దగా కనిపించే పరిస్థితి ఏర్పడింది.
కొత్తగా తెరపైకి వచ్చిన ఈక్వల్ ఎర్త్ మ్యాప్
ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌ను 2018లో కార్టోగ్రాఫర్ల బృందం అభివృద్ధి చేసింది. దీని ప్రధాన లక్ష్యం నావిగేషన్ కాదు. భూమిపై వివిధ ప్రాంతాలు ఆక్రమించిన అసలు విస్తీర్ణాన్ని సాధ్యమైనంత మెరుగ్గా చూపించడం.
మెర్కేటర్, ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌లను పక్కపక్కన ఉంచితే తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈక్వల్ ఎర్త్‌లో ఆఫ్రికా మరింత పెద్దదిగా కనిపిస్తుంది. ఉత్తర అమెరికా, యూరప్ పరిమాణం తగ్గినట్లు కనిపిస్తుంది. దక్షిణ అమెరికా కూడా వాస్తవ పరిమాణానికి దగ్గరగా కనిపిస్తుంది.
ధ్రువ ప్రాంతాల వద్ద కనిపించే అతిశయోక్తి కూడా తగ్గుతుంది. భారత్ కూడా ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌లో మెర్కేటర్‌తో పోలిస్తే కొద్దిగా పెద్దదిగా కనిపిస్తుంది.
మ్యాపులు మన ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయా?
మ్యాప్ అంటే కేవలం ఒక ప్రాంతం ఎక్కడ ఉందో తెలుసుకునే సాధనం మాత్రమే కాదని భౌగోళిక నిపుణులు చెబుతున్నారు. కెన్యాకు చెందిన భౌగోళిక శాస్త్రవేత్త కియోకో ముయెండో అభిప్రాయం ప్రకారం, మ్యాపులు ప్రాంతాలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో కూడా ప్రభావితం చేస్తాయి.
అందువల్ల ఒక దేశం లేదా ఖండం పటంలో చాలా పెద్దగా కనిపించడం, మరో ప్రాంతం చిన్నగా కనిపించడం ప్రజల మనసుల్లో కూడా ఒక రకమైన భావనను కలిగించవచ్చనే చర్చ ఉంది.
ఆఫ్రికన్ యూనియన్ కూడా ఈక్వల్ ఎర్త్ వైపు
ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్‌కు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఫిబ్రవరిలో ఆఫ్రికన్ యూనియన్ సభ్య దేశాలు కూడా దీనిని స్వీకరించాయి.
ఈ మ్యాప్ ద్వారా ప్రపంచంలోని వివిధ భూభాగాలు నిజంగా ఎంత విస్తీర్ణాన్ని ఆక్రమించాయో ప్రజలకు మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది.
ఈక్వల్ ఎర్త్ కూడా పూర్తిగా పరిపూర్ణం కాదు
అయితే ఈక్వల్ ఎర్త్ మ్యాప్‌ను కూడా పూర్తిగా లోపాల్లేని మ్యాప్‌గా చూడలేం. భూమి గుండ్రంగా ఉంటుంది. మ్యాప్ మాత్రం చదునుగా ఉంటుంది. అందువల్ల భూమిని ఏ ఫ్లాట్ మ్యాప్‌లోనూ ఎలాంటి తేడా లేకుండా చూపించడం సాధ్యం కాదు.
ఈక్వల్ ఎర్త్ భూభాగ విస్తీర్ణాన్ని మెరుగ్గా చూపించినా, మెర్కేటర్ మ్యాప్‌లో ఉన్న కొన్ని నావిగేషన్ ప్రయోజనాలను కోల్పోతుంది. భూమిపై ఉన్న సూటి మార్గాలు కూడా ఇందులో అదే విధంగా కనిపించవు. వివిధ ప్రాంతాల మధ్య నిజమైన దూరాన్ని కూడా ఇది పూర్తిగా కచ్చితంగా కొలవలేదు.
యూసీఎల్ కార్టోగ్రఫీ ప్రొఫెసర్ జేమ్స్ చెషైర్ చెప్పినట్లుగా, ఒక మ్యాప్ విస్తీర్ణం, ఆకారం, దూరం, దిశ వంటి అంశాలను వివిధ స్థాయిల్లో కాపాడగలదు. కానీ ఇవన్నింటినీ ఒకేసారి పూర్తిగా కచ్చితంగా చూపించడం సాధ్యం కాదు.
పీటర్స్ మ్యాప్ కూడా మరో ప్రత్యామ్నాయం
దేశాల అసలు విస్తీర్ణాన్ని మరింత న్యాయంగా చూపించేందుకు ప్రయత్నించిన మరో మ్యాప్ పీటర్స్ ప్రొజెక్షన్. దీనిని జర్మన్ చరిత్రకారుడు ఆర్నో పీటర్స్ 1970ల ప్రారంభంలో రూపొందించారు. అయితే దీనికి ఆధారం 1855లో స్కాటిష్ కార్టోగ్రాఫర్ జేమ్స్ గాల్ వివరించిన ప్రొజెక్షన్.
ఈ మ్యాప్ కూడా ఈక్వల్ ఎర్త్ మాదిరిగా దేశాలు, ఖండాల విస్తీర్ణాన్ని వాస్తవానికి దగ్గరగా చూపిస్తుంది. అయితే అందుకోసం వాటి ఆకారాల్లో మార్పులు చేస్తుంది.
ధ్రువ ప్రాంతాలు కుదించబడినట్లు కనిపిస్తాయి. భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎక్కువగా సాగినట్లు కనిపిస్తాయి. ఉదాహరణకు రష్యా పీటర్స్ మ్యాప్‌లో వాస్తవంగా కనిపించే దానికంటే చాలా చిన్నగా కనిపిస్తుంది.
మరి ఏదే అసలైన ప్రపంచ పటం?
ప్రపంచానికి ఒక్కటే పరిపూర్ణమైన మ్యాప్ లేదు. భూమి గోళాకారంలో ఉండటం, మ్యాప్ చదునుగా ఉండటం వల్ల ఏదో ఒక అంశంలో రాజీ పడాల్సిందే.
మెర్కేటర్ మ్యాప్ దిశలు, నావిగేషన్‌కు ఉపయోగకరంగా ఉంటుంది. కానీ భూభాగ పరిమాణాలను వక్రీకరిస్తుంది. పీటర్స్ మ్యాప్ విస్తీర్ణాన్ని వాస్తవానికి దగ్గరగా చూపిస్తుంది. కానీ దేశాల ఆకారాలను మార్చేస్తుంది.
ఈక్వల్ ఎర్త్ మాత్రం భూభాగాల పరిమాణాలను మరింత సమతుల్యంగా, వాస్తవానికి దగ్గరగా చూపించేందుకు ప్రయత్నిస్తుంది. అయితే అది కూడా ప్రతి అంశాన్ని పూర్తిగా కచ్చితంగా చూపించలేం.
అందుకే ఇకపై ప్రపంచ పటాన్ని చూసినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మ్యాప్ అనేది భూమికి అద్దం కాదు.. భూమిని మనకు అర్థమయ్యేలా చూపించే ఒక విధానం మాత్రమే. ఏ ప్రొజెక్షన్‌ను ఉపయోగిస్తున్నామన్న దానిపై ప్రపంచం మన కళ్లకు కనిపించే తీరు కూడా మారుతుంది.
Be the first to react