భారత్‌లో ఆటోరిక్షాతో ప్రేమలో పడ్డ బ్రిటన్ జంట.. ఏకంగా లండన్‌కే తీసుకెళ్లారు!
British Couple's Unique India Trip: విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అనుభవాలను గుర్తుగా ఫొటోలు, వీడియోలు, చిన్నచిన్న వస్తువులను తీసుకురావడం సాధారణం. కానీ ఓ బ్రిటన్ జంట మాత్రం భారత పర్యటనలో తమకు తోడుగా నిలిచిన ఆటోరిక్షాను వదిలి వెళ్లలేకపోయారు. ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఆ ఆటోను సముద్ర మార్గంలో తమ దేశానికి తరలించారు. ఈ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
- బ్రిటన్‌కు చెందిన హెలెన్, మిక్ దంపతులు భారత్‌లో ఆటోలో 75 రోజుల పాటు ఏకంగా 4,218 కిలోమీటర్లు ప్రయాణించారు.
- భారత్‌లో పర్యటన ముగిసినా ఆటోను వదిలి వెళ్లలేక సముద్ర మార్గంలో బ్రిటన్‌కు పంపించారు.
- బ్రిటన్ దంపతులు తమ ఆటోకు ముద్దుగా ‘టిమ్మీ ది టిన్ క్యాన్’ అని పేరు పెట్టుకున్నారు.
British Couple's Unique India Trip: విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడి అనుభవాలను గుర్తుగా ఫొటోలు, వీడియోలు, చిన్నచిన్న వస్తువులను తీసుకురావడం సాధారణం. కానీ ఓ బ్రిటన్ జంట మాత్రం భారత పర్యటనలో తమకు తోడుగా నిలిచిన ఆటోరిక్షాను వదిలి వెళ్లలేకపోయారు. ఏకంగా వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఆ ఆటోను సముద్ర మార్గంలో తమ దేశానికి తరలించారు. ఈ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
75 రోజుల్లో 4,218 కిలోమీటర్ల ప్రయాణం
బ్రిటన్‌కు చెందిన హెలెన్, మిక్ దంపతులు భారత్‌లో 75 రోజుల పాటు పర్యటించారు. ఈ సందర్భంగా తమిళనాడులోని చెన్నైలో రిజిస్టర్ అయిన ఎరుపు, నలుపు రంగుల బజాజ్ ఆటోరిక్షాపై ఏకంగా 4,218 కిలోమీటర్లు ప్రయాణించారు. ఈ ఆటోకు వారు ముద్దుగా ‘టిమ్మీ ది టిన్ క్యాన్’ అని పేరు పెట్టుకున్నారు.
భారతదేశంలోని పలు ప్రాంతాలను సందర్శించేందుకు ఈ ఆటోనే ప్రధాన వాహనంగా ఉపయోగించుకున్నారు. తమ ప్రయాణంలో భాగంగా ఆగ్రాలోని ప్రపంచ ప్రఖ్యాత తాజ్‌మహల్‌ను కూడా సందర్శించారు. ఈ ఆటో ముందు భాగంలో కార్టూన్ కళ్లతో పాటు నవ్వుతున్నట్లుగా ఉండే బొమ్మను ఏర్పాటు చేయడంతో రోడ్లపై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఆరు నెలల నిరీక్షణ.. చివరకు బ్రిటన్‌కు చేరిన ఆటో
భారత పర్యటన ముగిసిన తర్వాత దంపతులు తమ ఆటోను ఇక్కడే వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు. దీంతో సముద్ర మార్గం ద్వారా దానిని బ్రిటన్‌కు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేయగా.. ఆటో బ్రిటన్ చేరుకోవడానికి సుమారు ఆరు నెలల సమయం పట్టింది.
ఎట్టకేలకు 2026 అక్టోబర్ 23న లండన్ గేట్‌వే పోర్టుకు ‘టిమ్మీ’ చేరుకుంది. దీంతో భారత రోడ్లపై వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఈ చిన్న ఆటో.. ఇప్పుడు బ్రిటన్ గడ్డపై అడుగుపెట్టింది. అయితే అక్కడి రోడ్లపై నడపాలంటే అవసరమైన అనుమతులు, ఇతర అధికారిక ప్రక్రియలను దంపతులు పూర్తి చేయాల్సి ఉంది.
హర్ష గోయెంకా పోస్టుతో వెలుగులోకి..
ఈ ఆసక్తికరమైన విషయాన్ని ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ‘‘భారత ఆటోరిక్షా యూకేకు వెళ్తోంది! భారత రోడ్ల నుంచి బ్రిటన్ వీధుల వరకు.. ఎంత అద్భుతమైన ప్రయాణం’’ అంటూ ఆయన పోస్టు చేశారు. దీంతో ఈ కథనం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
నెటిజన్ల ఆసక్తికరమైన కామెంట్లు
ఈ జంట తమ ఆటోపై చూపించిన అభిమానాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వారి నిర్ణయాన్ని అభినందిస్తుండగా.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
‘‘అద్భుతమైన నిర్ణయం.. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం’’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘టుక్ టుక్‌లు కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి’’ అని మరొకరు పేర్కొన్నారు. ఇంకొందరు ‘‘బ్రిటన్ రోడ్లపై ఇక ఈ ఇండియన్ ఆటో హల్‌చల్ చేయబోతోంది’’ అంటూ సరదాగా స్పందించారు.
మొత్తానికి భారత పర్యటనలో పరిచయమైన ఓ సాధారణ ఆటోరిక్షా.. హెలెన్, మిక్ దంపతులకు మరిచిపోలేని ప్రయాణ భాగస్వామిగా మారింది. అందుకే వేల కిలోమీటర్లు దాటిన అనుబంధాన్ని తమ దేశానికి కూడా తీసుకెళ్లారు.
