రాజకీయ నాయకుల మధ్యలో దుబాయ్ బతుకమ్మ !
Dubai Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాజకీయ రంగు పులుముకుంది. విదేశీ గడ్డపై తెలంగాణ ప్రవాసులు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు బీఆర్ఎస్ నినాదాలతో మార్మోగాయి. పూల పండుగలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో ‘సారు రావాలి.. కారు కావాలి’ అంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయబద్ధంగా సాగాల్సిన వేడుకలు రాజకీయ సభను తలపించడంతో కొందరు మహిళలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
- ‘సారు రావాలి.. కారు కావాలి’అంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.
- రాజకీయ ప్రసంగాలపై మహిళల అసహనం.. త్వరలో కాంగ్రెస్, బీజేపీ అనుకూల సంఘాల వేడుకలు.
Dubai Bathukamma: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రాజకీయ రంగు పులుముకుంది. విదేశీ గడ్డపై తెలంగాణ ప్రవాసులు నిర్వహించిన బతుకమ్మ సంబరాలు బీఆర్ఎస్ నినాదాలతో మార్మోగాయి. పూల పండుగలో భాగంగా నిర్వహించిన వేడుకల్లో ‘సారు రావాలి.. కారు కావాలి’ అంటూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేయడం చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయబద్ధంగా సాగాల్సిన వేడుకలు రాజకీయ సభను తలపించడంతో కొందరు మహిళలు అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఆదివారం సాయంత్రం దుబాయిలో సిరిసిల్ల జిల్లాకు చెందిన పి. కిరణ్ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రవాసీ సంఘం ఈటీసీఏ ఆధ్వర్యంలో బతుకమ్మ ఉత్సవాలు జరిగాయి. దుబాయితో పాటు ఇతర ఎమిరేట్ల నుంచి పెద్ద సంఖ్యలో తెలంగాణ కుటుంబాలు తరలిరావడంతో కార్యక్రమ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. బతుకమ్మ ఆటపాటలతో సందడి నెలకొన్న వేళ బీఆర్ఎస్ నాయకుల నినాదాలు, నృత్యాలు వేడుకల్లో రాజకీయ వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
కేటీఆర్ వస్తారని ప్రచారం.. హాజరుకాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
ఈ వేడుకలకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని నిర్వాహకులు ప్రకటించారు. అయితే, ఆయన కార్యక్రమానికి రాలేదు. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు వేడుకల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, సంజయ్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఏ. జీవన్ రెడ్డి, షకీల్, బిగాల గణేశ్ తదితరులు హాజరయ్యారు.
వేదికపై నేతల సందడి, కార్యకర్తల నినాదాలతో కార్యక్రమం రాజకీయ సభను తలపించింది. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని నిర్వహించిన వేడుకల్లో పార్టీ నినాదాలు వినిపించడంపై కొందరు మహిళలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో వచ్చిన వారికి రాజకీయ ప్రసంగాలు, నినాదాలు నచ్చలేదన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
‘దుబాయి స్టేడియమా.. ఎల్బీ స్టేడియమా?’
కార్యక్రమంలో పాల్గొన్న ఏ. జీవన్ రెడ్డి జనసందోహాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, ఇక్కడి హాజరును చూస్తుంటే దుబాయి స్టేడియంలో ఉన్నామా? హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఉన్నామా? అన్న సందేహం కలుగుతోందని వ్యాఖ్యానించారు. దుబాయిలో కనిపించిన స్పందన బీఆర్ఎస్కు ప్రజాదరణ ఉందనే సంకేతమని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సభలో రాజకీయ ఉత్సాహాన్ని మరింత పెంచాయి.
మాజీ ఎమ్మెల్యే షకీల్ అరబ్ సంప్రదాయ దుస్తులైన కందూరా ధరించి వేడుకలకు హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మరోవైపు, కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన కాన్సుల్ జనరల్ విష్ణువర్ధన్ రెడ్డి కారు దిగిన తర్వాత గేటు దాటి లోపలికి చేరుకోవడానికి సుమారు అరగంట సమయం పట్టినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రవాసులు తరలిరావడంతో ప్రాంగణం వద్ద రద్దీ నెలకొంది.
ఇక కాంగ్రెస్, బీజేపీ అనుకూల సంఘాల వంతు
దుబాయిలో బతుకమ్మ వేడుకల సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు రాజకీయ సందడి చేయగా, రానున్న శని, ఆదివారాల్లో కాంగ్రెస్, బీజేపీ అనుకూల సంఘాలు కూడా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో విదేశీ గడ్డపై జరిగే బతుకమ్మ సంబరాలు రాజకీయ పార్టీలకు తమ ఉనికిని చాటుకునే వేదికలుగా మారుతున్నాయి.
తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రవాసుల బతుకమ్మ వేడుకలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే, సంప్రదాయ పండుగల్లో రాజకీయ పార్టీల నినాదాలు, ప్రసంగాలకు ఎంతవరకు చోటివ్వాలన్న ప్రశ్న కూడా ఈ పరిణామాలతో తెరపైకి వస్తోంది.
Be the first to react