అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావం! ప్రభుత్వం చేపట్టిన పనులపై సీఎం చంద్రబాబు వివరణ!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను వరుసగా తాకిన అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తుఫాన్ల కారణంగా భారీగా ఆస్తి, పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని తెలిపారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టంపై వివరాలు వెల్లడించారు.
- అర్నబ్, మురసు తుఫాన్ల కారణంగా ఏపీకి రూ.4,526 కోట్ల నష్టం జరిగినట్లు చంద్రబాబు వెల్లడించారు.
- 17 జిల్లాల్లోని 19,265 రేషన్ షాపుల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచారు.
- తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ నుంచి విద్యుత్ పునరుద్ధరణకు సిబ్బంది సహకారం తీసుకున్నాం.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను వరుసగా తాకిన అర్నబ్, మురసు తుఫాన్ల సమయంలో ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. తుఫాన్ల కారణంగా భారీగా ఆస్తి, పంట నష్టం జరిగినప్పటికీ ప్రాణనష్టాన్ని నివారించడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని తెలిపారు. అమరావతిలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి నిర్వహించిన మీడియా సమావేశంలో తుఫాన్ల ప్రభావం, సహాయక చర్యలు, విద్యుత్ పునరుద్ధరణ, పంట నష్టంపై వివరాలు వెల్లడించారు.
90 శాతం కచ్చితత్వంతో తుఫాన్ అంచనాలు
అర్నబ్, మురసు తుఫాన్ల విషయంలో వాతావరణ పరిస్థితులు, గాలుల వేగం, వర్షపాతం, వరద ముప్పును ముందుగానే విశ్లేషించామని చంద్రబాబు తెలిపారు. ఆర్టీజీఎస్, అవేర్ వ్యవస్థల ద్వారా అందిన సమాచారాన్ని ఆధారంగా చేసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులతో పోల్చి చూసినప్పుడు తమ అంచనాలు 90 శాతం వరకు కచ్చితంగా ఉన్నాయని వెల్లడించారు.
ముంపు గ్రామాలను ముందుగానే గుర్తించి, ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సిబ్బంది, అవసరమైన పరికరాలను సిద్ధంగా ఉంచినట్లు వివరించారు. రెస్క్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన్ అనే మూడు అంశాలకు ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.
31 వేల విద్యుత్ స్తంభాలు నేలకూలాయి
తుఫాన్ల ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదని సీఎం వెల్లడించారు. సుమారు 31 వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 4,095 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని తెలిపారు. అలాగే 548 సబ్స్టేషన్లలో సరఫరా నిలిచిపోయిందన్నారు.
ఇంతటి నష్టంతో విద్యుత్ వ్యవస్థను పూర్తిస్థాయిలో పునరుద్ధరించడానికి సాధారణంగా కనీసం 20 రోజులు పట్టేదని, అయితే అధికారుల సమన్వయం, ముందస్తు ప్రణాళికతో కేవలం 4-5 రోజుల్లోనే పునరుద్ధరణ పనులు చేపట్టగలిగామని చెప్పారు. భారీ వర్షంలోనూ విద్యుత్ సిబ్బంది ప్రాణాలకు తెగించి పనిచేశారని ప్రశంసించారు. కూలిన చెట్లను తొలగిస్తూ, డ్రిల్లింగ్ యంత్రాల సాయంతో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
పొరుగు రాష్ట్రాల సహకారం తీసుకున్నాం
తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా ఇతర రాష్ట్రాల సహకారం కూడా తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులతో పాటు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో మాట్లాడి విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బందిని పంపించాలని కోరినట్లు చెప్పారు.
గతంలో ఒడిశాలో తుఫాన్ సహాయక చర్యలకు ఏపీ నుంచి సిబ్బందిని పంపించామని గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరించామని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోనూ మాట్లాడినట్లు వెల్లడించారు. కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించి నష్టాన్ని అంచనా వేసినట్లు తెలిపారు.
తుఫాన్లతో రూ.4,526 కోట్ల నష్టం
అర్నబ్ తుఫాన్ కారణంగా రాష్ట్రంలో భారీగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని సీఎం వెల్లడించారు. సుమారు 3.52 లక్షల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 23,211 హెక్టార్లలో ఉద్యాన పంటలు నష్టపోయినట్లు తెలిపారు.
తుఫాన్ నష్టంపై కేంద్రానికి రూ.4,526 కోట్ల మేరకు మధ్యంతర నివేదిక పంపించినట్లు చెప్పారు. త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను కూడా సమర్పిస్తామని వెల్లడించారు. మురసు తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై ప్రాథమిక అంచనాలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
5 వేల మంది గర్భిణులను ఆస్పత్రులకు తరలింపు
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుందని చంద్రబాబు తెలిపారు. 17 జిల్లాల్లోని 19,265 రేషన్ షాపుల్లో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను అందుబాటులో ఉంచినట్లు చెప్పారు.
ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 5 వేల మంది గర్భిణులను ముందస్తుగా ఆస్పత్రులకు తరలించినట్లు వెల్లడించారు. గత వారం రోజుల్లో 1,029 మంది గర్భిణులకు ప్రసవాలు జరిగినట్లు తెలిపారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు అంబులెన్సులు, అత్యవసర మందులు, యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉంచినట్లు వివరించారు.
అంటువ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు
తుఫాన్ల అనంతరం పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని సీఎం చెప్పారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించడంతో పాటు అంటువ్యాధులు ప్రబలకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు బాధ్యతల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటమే ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నామని పేర్కొన్నారు. వరుస తుఫాన్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో పనిచేసిందని వివరించారు.
Be the first to react
