ఏపీలో రోడ్ల నిర్మాణానికి లైన్ క్లియర్! ప్రైవేట్ కంపెనీల నుంచీ తారు.. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులకు ఆటంకాలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కూడా బిటుమెన్ (తారు) కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తారు సరఫరాలో ఎదురవుతున్న జాప్యంతో రోడ్డు పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
- ఏపీలో రోడ్డు పనుల కోసం ప్రైవేట్ సంస్థల నుంచి తారు కొనుగోలుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
- రోడ్డు పనుల్లో నాణ్యత పాటించాలి.. జాప్యం చేస్తే కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరిక.
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రహదారుల నిర్మాణం, మరమ్మతుల పనులకు ఆటంకాలు తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రైవేట్ సంస్థల నుంచి కూడా బిటుమెన్ (తారు) కొనుగోలు చేసేందుకు కాంట్రాక్టర్లకు అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తారు సరఫరాలో ఎదురవుతున్న జాప్యంతో రోడ్డు పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్ అండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు.
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఆంధ్రప్రదేశ్ విభాగం) చేసిన విజ్ఞప్తి మేరకు నియమించిన ఆర్ అండ్ బి టెక్నికల్ కమిటీ సిఫార్సులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిబంధనలను సడలించినట్లు మంత్రి తెలిపారు.
VG-10, VG-30, VG-40 రకాల తారుకు అనుమతి
ప్రభుత్వ తాజా నిర్ణయంతో ప్రైవేట్ రిఫైనరీలు, దిగుమతిదారుల నుంచి VG-10, VG-30, VG-40 రకాల బిటుమెన్ను కాంట్రాక్టర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం కొనసాగుతున్న రహదారి పనులతో పాటు కొత్తగా చేపట్టబోయే పనులకు కూడా ఈ వెసులుబాటు వర్తించనుంది.
అయితే ఈ అనుమతి తాత్కాలికమేనని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి తారు సరఫరా తిరిగి ప్రారంభమయ్యే వరకు లేదా 2027 మార్చి 31 వరకు.. ఈ రెండింటిలో ఏది ముందుగా జరిగితే అప్పటి వరకు మాత్రమే ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోళ్లకు అనుమతి ఉంటుందని వివరించారు.
నాణ్యత విషయంలో రాజీ ఉండకూడదు
ప్రైవేట్ సంస్థల నుంచి తారు కొనుగోలు చేసినప్పటికీ నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని మంత్రి అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లు కొనుగోలు చేసిన బిటుమెన్కు సంబంధించిన బిల్లులు, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు, దిగుమతి వివరాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు కూడా తారు నాణ్యతను క్షేత్రస్థాయిలో పరీక్షిస్తారు.
మరోవైపు ప్రైవేట్ మార్కెట్లో తారు ధర ప్రభుత్వ రంగ సంస్థల ధరల కంటే ఎక్కువగా ఉన్నా.. ఆ అదనపు మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించదని మంత్రి స్పష్టం చేశారు. HPCL, BPCL, IOCL సంస్థలు నిర్ణయించిన ధరల ఆధారంగానే కాంట్రాక్టర్లకు చెల్లింపులు ఉంటాయని వెల్లడించారు.
1,790 రోడ్డు పనులకు రూ.3,014 కోట్ల కేటాయింపు
రాష్ట్రంలో రహదారుల పనులకు తారు కొరత ప్రధాన సమస్యగా మారిందని మంత్రి తెలిపారు. HPCL, BPCL, IOCL వంటి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి అవసరమైన స్థాయిలో సరఫరా లేకపోవడంతో పలు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతుల పనులు నెమ్మదించాయని వివరించారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 10,238 కిలోమీటర్ల మేర 1,790 రహదారి పనులకు రూ.3,014 కోట్ల అంచనా వ్యయంతో అనుమతులు మంజూరు చేసింది. వీటిలో ఇప్పటివరకు 626 పనులు పూర్తికాగా, మరో 1,164 పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఈ పనుల్లో ఎక్కువగా రోడ్ల మరమ్మతులు, పునరుద్ధరణ, అభివృద్ధికి సంబంధించినవే ఉన్నాయి.
2026 చివరి నాటికి రోడ్డు పనులు పూర్తి చేయడమే లక్ష్యం
రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనల మేరకు ఇప్పటికే మంజూరైన రహదారి పనులన్నింటినీ 2026 చివరి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ప్రజలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా మెరుగైన రహదారులను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. నిధులు లేదా ముడిసరుకు కొరతను కారణంగా చూపిస్తూ పనులను ఆలస్యం చేస్తే సహించేది లేదని కాంట్రాక్టర్లు, అధికారులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
Be the first to react

