హైదరాబాదులో ₹500 నకిలీ నోట్లు.. జాగ్రత్త..! యూట్యూబ్ లో చూసి తయారీ.. రూ.6.78 కోట్లు!

Hyderabad Fake Currency Racket Busted: హైదరాబాద్‌ శివార్లలో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించి భారీ ముఠా గుట్టురట్టు చేశారు. అద్దె ఇంట్లోనే నకిలీ నోట్ల ముద్రణ యూనిట్‌ను ఏర్పాటు చేసి చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు యూట్యూబ్‌ వీడియోలు, ఇతర సోషల్‌ మీడియా కంటెంట్‌ చూసి నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

Hyderabad Fake Currency Racket Busted
Hyderabad Fake Currency Racket Busted

రూ.500 నోట్ల నకిలీ ముద్రణ కేంద్రం గుర్తింపు.. కుంట్లూరులో భారీగా నకిలీ కరెన్సీ పట్టివేత..

పోలీసుల వేషంలో వచ్చి డబ్బులు దోపిడీ.. హైదరాబాద్‌లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్‌..

హైదరాబాద్‌ శివార్లలో నకిలీ కరెన్సీ తయారీ కేంద్రాన్ని తెలంగాణ పోలీసులు గుర్తించి భారీ ముఠా గుట్టురట్టు చేశారు. అద్దె ఇంట్లోనే నకిలీ నోట్ల ముద్రణ యూనిట్‌ను ఏర్పాటు చేసి చలామణి చేసేందుకు ప్రయత్నిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ప్రధాన నిందితుడు యూట్యూబ్‌ వీడియోలు, ఇతర సోషల్‌ మీడియా కంటెంట్‌ చూసి నకిలీ నోట్ల తయారీ విధానాన్ని నేర్చుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

నవంబర్‌ 1న రామోజీ ఫిల్మ్‌ సిటీ సమీపంలోని జాతీయ రహదారి 65పై ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు, షాద్‌నగర్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌ టీమ్‌ (SOT) సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన కారును ఆపి తనిఖీ చేశారు. అందులో ఉన్న నలుగురి వద్ద నుంచి రూ.8 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లను గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ ముఠా కార్యకలాపాల గురించి కీలక సమాచారం బయటపడింది.

పోలీసుల విచారణలో హైదరాబాద్‌ శివార్లలోని కుంట్లూరులో ఒక అద్దె ఇంటిని కేంద్రంగా చేసుకుని నకిలీ కరెన్సీ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించగా నకిలీ నోట్ల ముద్రణ యూనిట్‌ బయటపడింది. ఆ ఇంట్లో మరో 134 కట్టల నకిలీ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.6.70 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. కారులో పట్టుబడిన రూ.8 లక్షల నోట్లతో కలిపి మొత్తం రూ.6.78 కోట్ల విలువైన నకిలీ కరెన్సీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ నోట్ల తయారీకి ఉపయోగిస్తున్న ప్రింటర్లు, స్కానర్లు, ల్యాప్‌టాప్‌, లామినేషన్‌ యంత్రం, నోట్లను కత్తిరించేందుకు వినియోగించే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా గుర్తించిన మడుపోజు కర్ణాకర్‌ యూట్యూబ్‌ వీడియోలు, ఇతర సోషల్‌ మీడియా కంటెంట్‌ ద్వారా నకిలీ నోట్ల తయారీ ప్రక్రియను నేర్చుకున్నట్లు ఫ్యూచర్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి వెల్లడించారు.

నిజమైన నోట్లను స్కాన్‌ చేసి.. ఫోటోషాప్‌తో మార్పులు

విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం, కర్ణాకర్‌ ముందుగా అసలైన రూ.500 నోట్లను స్కాన్‌ చేసేవాడు. అనంతరం ఫోటోషాప్‌ వంటి ఇమేజ్‌ ఎడిటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లను ఉపయోగించి వాటి చిత్రాల్లో మార్పులు చేసి నకిలీ నోట్లను ముద్రించేవాడని పోలీసులు తెలిపారు. ఇలా తయారుచేసిన నోట్లను మార్కెట్‌లోకి తీసుకెళ్లేందుకు ముఠా సభ్యులు ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు గుర్తించారు.

ప్రతి రూ.లక్ష అసలు నగదుకు బదులుగా రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు నకిలీ కరెన్సీ ఇస్తామని ఆశ చూపి కొనుగోలుదారులను ఆకర్షించాలని నిందితులు భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ ప్రతిపాదనకు ఆశించిన స్పందన రాకపోవడంతో, అసలు డబ్బును దోచుకునేందుకు మరో పథకాన్ని అమలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

పోలీసుల వేషంలో వచ్చి అసలు నగదు దోపిడీ

కొనుగోలుదారుల నమ్మకం పొందేందుకు మొదట కొంత అసలైన కరెన్సీని చూపించేవారు. దీంతో తమతో జరుగుతున్నది నిజమైన లావాదేవీనేనని వారు నమ్మేలా చేసేవారు. ఆ తర్వాత ముఠా సభ్యులు నకిలీ పోలీసుల అవతారం ఎత్తేవారు. ఇందుకోసం నకిలీ గుర్తింపు కార్డులు, వాకీటాకీలు, బొమ్మ తుపాకులు, నకిలీ నంబర్‌ ప్లేట్లు ఉన్న వాహనాలను ఉపయోగించినట్లు పోలీసులు తెలిపారు.

తాము పోలీసులమని చెప్పి కొనుగోలుదారులను బెదిరించి, వారి వద్ద ఉన్న అసలు డబ్బుతో అక్కడి నుంచి పరారయ్యేవారని దర్యాప్తులో వెల్లడైంది. ఈ విధంగా ఇద్దరు బాధితులను వేర్వేరు ఘటనల్లో మోసం చేసి, ఒకరి నుంచి రూ.2 లక్షలు, మరొకరి నుంచి రూ.3 లక్షలు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో మడుపోజు కర్ణాకర్‌, చినొళ్ల మాణిక్య రెడ్డి, చెరుకుపల్లి రత్నాకర్‌ రెడ్డి, కరణం అజయ్‌ కుమార్‌ అనే నలుగురిని అరెస్టు చేశారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.

సోషల్‌ మీడియా వేదికల ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుని నకిలీ కరెన్సీ తయారీకి పాల్పడటమే కాకుండా, పోలీసుల వేషంలో అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నించిన ఈ ముఠా వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసులో పరారీలో ఉన్న మిగిలిన నిందితుల పాత్ర, నకిలీ నోట్లను ఎక్కడెక్కడ చలామణి చేయాలని భావించారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags

Be the first to react

Latest