సామాన్యుడి భయంకర అనుభవం.. ప్రకృతి విలయ తాండవం మధ్యలో కన్నీటి కోనసీమ ఘోష!
Konaseema: కోనసీమ జిల్లాలో అర్నాబ్ పెను తుఫాను గంటకు 150 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో అపార నష్టాన్ని మిగిల్చింది. వేలాది కొబ్బరిచెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో వందలాది పల్లెలు అంధకారంలో మునిగిపోయాయి. ఫోన్ చార్జింగ్‌లు లేక బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఈ గాయాలు మానకముందే మురసు తుఫాను కుండపోత వర్షాలతో గ్రామాలను ముంచెత్తింది. తాగునీరు లేక బిందెలతో జనం బారులు తీరగా, నిత్యావసరాల ధరలు పెరిగాయి. మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసమే ఈ ప్రకృతి ప్రకోపానికి కారణమని నిపుణులు హెచ్చరిస్తుండగా, పల్లెల్లో తక్షణ విద్యుత్, తాగునీరు అందించాలని ప్రజలు కోరుతున్నారు.
రచన: కత్తి మండ ప్రతాప్
ఆకాశం ఎప్పుడూ ఇంత క్రూరంగా ఉంటుందని కోనసీమ ఊహించలేదు. గాలి ఇంతటి ఉగ్రరూపం దాలుస్తుందని కొబ్బరిచెట్లు కూడా అనుకోలేదు. తమ ఒడిలో పచ్చదనాన్ని పరుచుకుని, మనుషుల జీవితాలకు నీడనిచ్చిన పల్లెలను ప్రకృతి ఒక్క రాత్రిలో ఇలా గుర్తుపట్టలేనంతగా మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఒకప్పుడు పిల్లగాలుల పలకరింపుతో పరవశించిన కోనసీమకు, అదే గాలి ప్రళయ గర్జనగా మారి గుండెలను చీల్చుతుందని తెలియదు. నిన్నటివరకు ఆకుల సవ్వడితో సంగీతం పలికించిన చెట్లే, నేడు నేలకొరిగి విషాదానికి ప్రతీకలుగా మిగులుతాయని ఎవరు ఊహించారు?
అర్నాబ్ తుఫాను వస్తోందని రోజులుగా ప్రచారం సాగింది. టీవీ తెరల మీద హెచ్చరికలు. సోషల్ మీడియాలో భయపెట్టే దృశ్యాలు. గంటకు ఇంత వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ విశ్లేషణలు. తీరం ఎక్కడ దాటుతుందోనని చర్చలు. ప్రభుత్వ యంత్రాంగం ముందు చూపు హెచ్చరికలు ఇవన్నీ చూస్తున్న ప్రజలు మాత్రం ఎప్పటిలాగే అనుకున్నారు.తుఫానుల గురించి వినడం కోనసీమకు కొత్తేమీ కాదు కదా! ఇలాంటివి ఎన్నో చూశాం కదా! ఈసారీ ఏదో వచ్చి వెళ్లిపోతుందిలే! అనుకున్నారు. ప్రకృతి విసరబోయే పెను విపత్తు తీవ్రతను ఊహించలేక సాధారణంగానే తమ పనుల్లో నిమగ్నమయ్యారు.కానీ ప్రకృతి ప్రకోపం ఎప్పుడూ ముందస్తు హెచ్చరికల తీవ్రతను బట్టి మనిషికి అర్థం కాదు. ఒక్కోసారి ప్రశాంతంగా కనిపించే ఆకాశం వెనుక ఎంతటి విధ్వంసం దాగి ఉంటుందో, ఆకాశం తన రంగు మార్చినప్పుడే తెలుస్తుంది.
మధ్యాహ్నం వరకు ఎండ తన ప్రతాపాన్ని చూపించిన కోనసీమలో సాయంత్రం నాలుగు గంటలకల్లా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నీలాకాశం మీద నల్లని మబ్బులు సైన్యంలా కమ్ముకున్నాయి. సూర్యుడిని ఎవరో నల్లటి తెర వెనక్కి లాగినట్టయింది. వెలుగుకు, చీకటికి మధ్య ప్రకృతి ఏదో రహస్య యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా వాతావరణం మారిపోయింది.
మొదట చిన్నగా చిరుజల్లులు పలకరించాయి. ఆకుల మీద పడిన చినుకులు మెల్లగా నేలను తడిపాయి. ఆ చినుకుల్లోనూ పెద్ద ప్రమాదం కనిపించలేదు. కానీ ఆకాశం వేసిన ఆ తొలి చినుకులు సాధారణ వర్షానికి సంకేతాలు కావు. రాబోయే విలయానికి ప్రకృతి పంపిన నిశ్శబ్దపు ముందస్తు సందేశాలు.
సాయంత్రం కాస్త చీకటి పడే సమయానికి వాన ఉధృతమైంది. గాలి స్వరం మారిపోయింది. అప్పటివరకు మెల్లగా కదిలిన కొబ్బరి మట్టలు ఒక్కసారిగా ఉన్మాద నృత్యం చేయసాగాయి. ఒక్కసారిగా చెట్లు వంగాయి. కొమ్మలు విరిగాయి. గాలి శబ్దం క్రమంగా పెరిగింది. అది చెవుల్లో వినిపించే శబ్దం కాదు. గుండెల్లోకి చొచ్చుకుపోయే భయంకరమైన గర్జన. ఒక్కసారిగా గాలి తన సహనాన్ని కోల్పోయిన రాక్షసిలా విరుచుకుపడింది. గంటకు 150 కిలోమీటర్లకు పైబడిన వేగంతో వీచిన ప్రచండ పవనాలు కోనసీమను చుట్టుముట్టాయి. కొబ్బరిచెట్లు నేలను తాకేలా వంగిపోయాయి. వాటి మట్టలు గాలికి కొరడాల్లా విసురుకున్నాయి. సుడిగాలులు వీధుల్లోకి దూసుకొచ్చాయి. ఇంటి తలుపులు దబదబా కొట్టుకున్నాయి. కిటికీలు వణికాయి. పైకప్పుల మీద రేకులు గాలికి రెక్కలు కట్టుకున్న పక్షుల్లా ఎగిరిపోయాయి.ప్రకృతి ఒక్కసారిగా తన సౌందర్యపు ముసుగు తొలగించి, భీకరమైన మరో రూపాన్ని బయటపెట్టింది.
బయట ఏం జరుగుతోందో చూడటానికి తలుపు తెరిచే ధైర్యం కూడా లేని పరిస్థితి. బయటకు మనిషి వస్తే తోసేసే గాలి . ఇంట్లో ఉన్నవారి గుండెల్లో గుబులు. చిన్నపిల్లలు తల్లుల ఒడిలో దాక్కున్నారు. గాలి శబ్దానికి ఉలిక్కిపడుతూ తల్లి చేతులను మరింత గట్టిగా పట్టుకున్నారు. పిల్లల ఏడుపులు గాలి గర్జనలో కలిసిపోయాయి. వృద్ధులు దేవుడిని తలచుకున్నారు. ఇంటి పైకప్పు ఎప్పుడు ఎగిరిపోతుందో, ఏ చెట్టు ఎప్పుడు మీద పడుతుందో తెలియని భయంతో ప్రతి క్షణం యుగంలా గడిచింది.ఆ సమయంలో గడియారం ముళ్లు కదులుతున్నాయి. కానీ మనుషుల గుండెల్లో కాలమే నిలిచిపోయింది.
తుఫాను తీరం ఎక్కడ దాటుతుంది? ఇక్కడా? అక్కడా? అంటూ సాగిన అంచనాలన్నింటినీ వెనక్కి నెట్టి, అది కోనసీమను చుట్టుముట్టినట్టుగా తన ప్రతాపాన్ని చూపించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సుడులు తిరుగుతూ, ప్రతి పల్లె తలుపు తట్టి తన ఉనికిని చాటుకున్నట్టుగా ప్రకృతి విలయతాండవం చేసింది.ఆ రాత్రి గాలి చెట్లను కేవలం ఊపలేదు. వాటి జీవితాలనే పెకలించింది. దశాబ్దాలుగా నేలలో వేళ్లూనుకున్న వృక్షాలు క్షణాల్లో నేలమట్టమయ్యాయి. చెట్లు ఒకదానిమీద ఒకటి కూలిపోయాయి. భారీ వృక్షాలు ఇళ్లమీద విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు ఒక్కొక్కటిగా నేలకొరిగాయి. విద్యుత్ తీగలు తెగిపడి రహదారులపై పాముల్లా పాకాయి. ట్రాన్స్ఫార్మర్లు ఎగిరిపడ్డాయి. ఇంటి పైకప్పులు పెకలించుకుపోయాయి. రేకులు ఎక్కడివో తెలియని చోట్లకు ఎగిరిపోయాయి.తాటాకు గుడిసెలు నామ రూపాలు లేకుండా పోయాయి .రైతుల పంట పొలాలు పాడై పోయాయి .ఆశలు ఆవిరయ్యాయి . కోనసీమ రైతుకు కొబ్బరి చెట్టు కేవలం కల్పవృక్షం కాదు. కన్నబిడ్డలా పెంచుకున్న కొడుకు. తుఫాను ఆ చెట్టును నేలకూల్చినప్పుడు, ఒక వృక్షం మాత్రమే విరగదు. ఆ రైతు గుండెలో ఒక కొడుకు కూలిపోయాడు అనే భావన .
గాలి కొట్టిన దెబ్బకు చెట్లు విరిగిన శబ్దం, రేకులు ఎగిరిన శబ్దం, విద్యుత్ స్తంభాలు పడిన శబ్దం, వర్షపు హోరు... అన్నీ కలగలిసి ఒక భయానక సంగీతంలా వినిపించాయి. ఆ సంగీతంలో మనిషి గొంతు వినిపించలేదు. వినిపించినా అది గాలిలో కలిసిపోయింది.
ఆ రాత్రి కోనసీమకు రాత్రి కాదు. కాళరాత్రి. ప్రకృతి రాసిన విధ్వంస కావ్యానికి ఆకాశమే నల్లటి కాగితమైంది. గాలి దాని మీద రాసిన ప్రతి అక్షరం ఒక పల్లె విషాదగాథగా మిగిలింది.
తెల్లవారింది. కానీ చీకటి మాత్రం తొలగలేదు.
రాత్రంతా భయంతో గడిపిన ప్రజలు ఉదయాన్నే బయటకు వచ్చి చూసిన దృశ్యాలు గుండెల్ని పిండేశాయి. నిన్నటి వరకు పచ్చదనంతో పలకరించిన వీధులు ఇప్పుడు చెట్ల శవాలతో నిండిపోయాయి. తలలు వంచుకున్న కొబ్బరిచెట్లు, విరిగిన వృక్షాలు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు, తెగిపడిన తీగలు, చెల్లాచెదురైన ట్రాన్స్ఫార్మర్లు, కూలిన ఇంటి పైకప్పులు... ఎటు చూసినా ప్రకృతి విధ్వంసం వేసిన సంతకమే!
నిన్నటి వరకు ఇంటి ముందు నీడనిచ్చిన చెట్టు నేడు అదే ఇంటి మీద పడి శిథిలాన్ని సృష్టించింది. తరతరాలుగా నిలిచిన వృక్షాలు వేళ్లతో సహా పెకలించుకుపోయాయి. కొన్నిచోట్ల చెట్ల కింద రహదారులే కనిపించకుండా పోయాయి. కొమ్మలు, ఆకులు, విరిగిన కాండాలు రహదారులను పూర్తిగా కప్పేశాయి.
నిన్నటి వరకు ఊరికి దారి చూపిన రహదారులు నేలకొరిగిన వృక్షాల నిర్జీవ దేహాలతో మూసుకుపోయాయి. ప్రధాన మార్గాలు సైతం అడ్డంకులతో నిండిపోయాయి. గ్రామాలకు వెళ్లే దారులు కనిపించని పరిస్థితి. కొన్ని పల్లెలు ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ద్వీపాల్లా మిగిలిపోయాయి.
పచ్చని కోనసీమ ఒక్క రాత్రిలో తన రూపాన్ని కోల్పోయింది. ఊరు ఊరులా లేదు. వీధి వీధిలా లేదు. ప్రకృతి ఒడిలో నిద్రించిన పల్లెలు ఒక్కసారిగా యుద్ధభూముల్లా కనిపించాయి. నిన్నటి వరకు సుపరిచితమైన పరిసరాలు నేడు పరాయివిగా మారిపోయాయి. సొంత ఇంటి ముందు నిలబడి కూడా అది తమ ఊరేనా అని నమ్మలేని దుస్థితి.
కొబ్బరి తోటల మధ్య నుంచి కనిపించే ఇళ్లకు బదులు, విరిగిన చెట్ల మధ్య నుంచి కనిపించే శిథిలాలు. పిల్లల ఆటలతో సందడిగా ఉండే వీధులకు బదులు, నేలకొరిగిన చెట్లతో మూసుకుపోయిన దారులు. రాత్రి గడిచిందన్న ఉపశమనం కంటే, తెల్లవారిన తర్వాత కనిపించిన విధ్వంసం మరింత భయాన్ని నింపింది. ప్రజలు ఇంతటి భీకర గాలిని ఎప్పుడూ చూడలేదని వాపోయారు.
1996 లో ఒకసారి కోనసీమకు భారీ తుఫాను వచ్చినా అప్పటి దానికన్నా ఇదే పెద్ద తుఫాను అని వృద్దులు చెప్పడం ..ఊహ తెలిసి దివిసీమ ఉప్పెన తర్వాత ....ఇదే పెద్ద గాలి వన అని కొందరు చెప్పడం జరిగింది .
కళ్లముందు పెరిగిన చెట్లు నేలకూలడం, తాము నివసిస్తున్న ఇళ్ల మీదే ప్రమాదం విరుచుకుపడటం, ఒక్క రాత్రిలో తమ చుట్టూ ఉన్న ప్రపంచమే మారిపోవడం వారిని కలచివేసింది.
చెట్లు తొలగిస్తే దారి తెరుచుకుంటుంది. కానీ పోయిన విద్యుత్తు ఎప్పుడు వస్తుంది?...ఇప్పుడు కోనసీమ ప్రజల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే!
తుఫాను వెళ్లిపోయింది. కానీ అది మిగిల్చిన చీకటి మాత్రం వెళ్లలేదు. విద్యుత్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమైంది. వేలాది స్తంభాలు నేలకొరిగాయి. తీగలు తెగిపోయాయి. ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ వ్యవస్థను తిరిగి నిలబెట్టడం ఒక భారీ సవాలుగా మారింది.
ప్రధాన రహదారులపై పడిన చెట్లను నెమ్మదిగా తొలగిస్తున్నారు. కొన్ని ప్రధాన మార్గాలు పునరుద్ధరించినా, గ్రామాల లోపల మాత్రం ఇంకా చెట్లు, స్తంభాలు అడ్డంగా పడే ఉన్నాయి. ఎక్కడ చూసినా తొలగించాల్సిన చెట్లు. నిలబెట్టాల్సిన స్తంభాలు. సరిచేయాల్సిన తీగలు. చేయాల్సిన పనుల జాబితా కొండంతగా కనిపిస్తోంది.స్థానిక యువకులు, గ్రామస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. చేతికి దొరికిన పరికరాలతో చెట్లను తొలగిస్తున్నారు. దారులు సరిచేస్తున్నారు. తమ ఊరిని తామే కాపాడుకోవాలన్న తపనతో శ్రమిస్తున్నారు. చెట్టు పడితే దారి మూసుకుపోతుందని తెలిసినా, మరోసారి గొడ్డలి పట్టి పనిలోకి దిగుతున్నారు. వారి చేతుల్లో అలసట ఉన్నా, మనసుల్లో మాత్రం తమ గ్రామాన్ని తిరిగి నిలబెట్టాలన్న పట్టుదల కనిపిస్తోంది. కానీ వారి చేతుల్లోని గొడ్డళ్లు, రంపాలు ఎంతవరకు పనిచేస్తాయి? వేలాది చెట్లు, వందలాది విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన తీగల మధ్య పునరుద్ధరణ ఒక భారీ యుద్ధంలా మారింది.
విద్యుత్ పునరుద్ధరణకు పది రోజులకు పైగా పట్టవచ్చన్న అంచనాలు ప్రజలను మరింత ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని గ్రామాల్లో ఇంకా స్తంభాలను నిలబెట్టే పనులే ప్రారంభ దశలో ఉన్నాయి.విద్యుత్తు లేకపోవడం అంటే కేవలం బల్బులు వెలగకపోవడం కాదు. దానితో ముడిపడిన ప్రతి అవసరం ఒక్కొక్కటిగా మూగబోవడమే! విద్యుత్ నిలిచిపోవడంతో కోనసీమ పల్లెలపై చీకటి కేవలం రాత్రిలా పరుచుకోలేదు. వెలుగుకు అలవాటుపడిన జీవితాలనే ఒక్కసారిగా మింగేసిన నల్లని నిశ్శబ్దంలా ఆవరించింది. ప్రతి ఇంటి గడపా చీకటి గుహగా మారింది. వీధి దీపాలు మూగబోయాయి. ఇళ్లలో బల్బులు వెలగలేదు. నిన్నటివరకు వెలుగులతో కళకళలాడిన పల్లె వీధులు ఇప్పుడు దారి తెలియని చీకటి గర్భంలో కలిసిపోయాయి.
ఇప్పుడు కోనసీమలో ప్రతి ఇంటి నోటా వినిపిస్తున్న మాట ఒక్కటే. కరెంటు ఎప్పుడు వస్తుంది?
ఆ ప్రశ్నలో కేవలం వెలుగు కోసం ఎదురుచూపు లేదు. దాహంతో ఉన్న గొంతుకు నీరు కావాలన్న ఆర్తి ఉంది.రాత్రి పిల్లలకు భయం లేకుండా నిద్రపుచ్చాలన్న తపన ఉంది. వంట చేసుకోవాలన్న అవసరం ఉంది. అనారోగ్యంతో ఉన్నవారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న ఆందోళన ఉంది.
విద్యుత్తు లేకపోవడం అంటే జీవితపు చక్రం ఒక్కసారిగా ఆగిపోవడమేనని ఇప్పుడు ప్రతి పల్లె అనుభవిస్తోంది.
సెల్ఫోన్లలో చార్జింగ్ అయిపోయింది. కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతింది. కేబుళ్లు తెగిపోయాయి. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఎవరు ఎక్కడున్నారో తెలియదు. బంధువులు క్షేమంగా ఉన్నారో లేదో తెలుసుకునే మార్గం లేదు. ఒక ఊరిలో జరిగిన ప్రమాదం మరో ఊరికి చేరేలోపే గంటలు గడిచిపోతున్నాయి.
ఒకప్పుడు అరచేతిలో ప్రపంచాన్ని చూసిన మనిషి, నేడు అదే అరచేతిలోని ఫోన్ పనిచేయక నిస్సహాయంగా చూస్తున్నాడు. చార్జింగ్ తగ్గుతున్న కొద్దీ ఫోన్‌తోపాటు ఆశలు కూడా తగ్గిపోతున్నాయి. ఒక్క శాతం బ్యాటరీ మిగిలినా, ఏదో ఒక అత్యవసర సమాచారం పంపించగలమేమోనని ఎదురుచూస్తున్న పరిస్థితి.
ఇంట్లో ఉన్న చార్జింగ్ ఫోన్లు కూడా చివరి శ్వాస తీసుకుంటున్న దీపాల్లా ఒక్కొక్కటిగా మూగబోతున్నాయి. జనరేటర్లు సంపన్నులు అద్దెకు తీసుకెళ్లిపోయారు. సామాన్యుడికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలూ కరువయ్యాయి.కొన్ని చోట్ల గంటకు జనరేటర్ కు పదిహేను వందలు అడిగి ఒక గనత ఇంటింటికి పెట్టి వ్యాపారం చేసుకుంటున్నారు .వాటర్ వస్తే చాలు అనే చిన్న ఆశతో జనాలు వాటి వైపు మొగ్గు చూపుతున్నా జనరేటర్లు దొరకడం లేదు .
చీకటికి అలవాటుపడని గ్రామాలు చీకటితో సహజీవనం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం కాగానే భయం మళ్లీ పల్లెల్లోకి అడుగుపెడుతోంది. ఒకప్పుడు వెలుగులతో కళకళలాడిన ఇళ్లు ఇప్పుడు నిశ్శబ్దపు గుహల్లా మారిపోయాయి.
ఇంట్లో దీపం వెలిగించుకోవడానికి కూడా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. రాత్రి బయటకు వెళ్లాలంటే భయం .ఇప్పుడు కొవ్వోత్తులే దిక్కయ్యాయి . కాని అవి కూడా దొరకడం లేక విల విల్లాడుతున్నారు .
చీకటి అంటే వెలుగు లేకపోవడమే అనుకున్నాం. కానీ ఇప్పుడు చీకటి అంటే నీరు లేకపోవడం, అవసరాలు తీరకపోవడం ... సమాచారం లేకపోవడం, రాకపోకలు లేకపోవడం, కనీస భరోసా లేకపోవడం అని కోనసీమ చెబుతోంది.
ఇంతలో మరో సమస్య తాగునీరు!
మనిషి ఒక్కరోజు అన్నం లేకుండా ఉండగలడేమో కానీ, నీరు లేకుండా ఎలా బతకగలడు? ఇంటి ముందు ఉన్న కుళాయి మూగబోయింది. నీటి మోటార్లు పనిచేయడం లేదు. స్నానం చేయడానికి నీళ్లు లేవు. వంట చేసుకోవడానికి నీళ్లు లేవు. కనీస అవసరాలు తీర్చుకోవడానికి కూడా నీటి కోసం బారులు తీరాల్సిన దుస్థితి.కొందరు వారం అయ్యినా స్నానాలు చేయని పరిస్థితి .
ఒకప్పుడు ఇంటి గుమ్మం దగ్గరే అందుబాటులో ఉన్న నీటి కోసం ఇప్పుడు వీధుల వెంట తిరగాల్సిన పరిస్థితి. బిందెలు పట్టుకుని నిలబడిన మహిళలు. నీటి కోసం ఎదురుచూస్తున్న వృద్ధులు. చిన్న చిన్న పాత్రలతో తాగునీటి కోసం పడిగాపులు కాస్తున్న కుటుంబాలు. ఆ బారుల్లో నిలిచిన ప్రతి ఒక్కరి కళ్లలో ఒకటే ప్రశ్న. ఈరోజు నీళ్లు ఎక్కడ దొరుకుతాయి?
జనరేటర్ల సహాయంతో అందిస్తున్న తాగునీరు సైతం సామాన్యుడికి భారంగా మారింది. వంద రూపాయలు పెట్టి తాగునీరు కొనాల్సిన పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తోంది.అకడ కూడా బారులు తీరిన జనం .
నీరు ప్రకృతి ఇచ్చిన వరం. కానీ విపత్తు వేళ అదే నీరు అందని ద్రాక్షగా మారింది. ఒకప్పుడు కుళాయి తిప్పితే ధారగా వచ్చిన నీటి కోసం ఇప్పుడు వంద రూపాయల నోటు చేతిలో పట్టుకుని ఎదురుచూడాల్సిన దుస్థితి.
నిత్యావసర వస్తువుల కొరత మొదలైంది. కూరగాయలు సరిగా దొరకడం లేదు. దొరికిన వాటి ధరలు పెరిగిపోయాయి. విపత్తులోనూ కొందరి వ్యాపార దాహం తగ్గలేదు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవాల్సిన సమయంలో అవసరాలను అవకాశాలుగా మార్చుకునే దుస్థితి కనిపిస్తోంది.
ప్రకృతి ఒక దెబ్బ కొడితే, అవసరాల కొరత మరో దెబ్బ కొడుతోంది. గాలి ఇళ్ల పైకప్పులను ఎగరేస్తే, చీకటి మనుషుల ధైర్యాన్ని పరీక్షిస్తోంది. నీటి కొరత గొంతులను ఎండబెడుతోంది. విద్యుత్తు లేకపోవడం జీవితపు చక్రాన్నే నిలిపేస్తోంది.
కోనసీమ గ్రామాలు ఒక్కసారిగా సంవత్సరాల వెనక్కి వెళ్లిపోయినట్టయ్యాయి. ఆధునిక సాంకేతికత చేతిలో ఉన్నా, విద్యుత్తు లేకపోతే మనిషి ఎంత నిస్సహాయుడో ఈ తుఫాను మరోసారి నిరూపించింది.
వేలాది రూపాయల విలువైన ఫోన్లు ఉన్నా ఉపయోగం లేదు. విద్యుత్ పరికరాలు ఉన్నా పనిచేయవు. ఇంట్లో నీటి కుళాయి ఉన్నా నీరు రాదు. బయటకు వెళ్లడానికి రహదారి ఉన్నా చెట్లు అడ్డంగా పడిపోయాయి. అభివృద్ధి పరుగులు తీసిన కాలంలో ఒక్క విద్యుత్ సరఫరా నిలిచిపోతే మనిషి జీవితం ఎంతగా వెనక్కి వెళ్లిపోతుందో ఈ విపత్తు కళ్లకు కట్టింది.
ఇంకా ఆ గాయాలు మానలేదు. రహదారులపై చెట్లు పూర్తిగా తొలగిపోలేదు. విద్యుత్ స్తంభాలు తిరిగి నిలబడలేదు. ఇళ్లకు కొత్త పైకప్పులు అమరలేదు. సెల్ఫోన్లకు ప్రాణం పోసే విద్యుత్తు రాలేదు. పల్లెల్లో చీకటి ఇంకా తిష్టవేసే ఉంది.
అప్పుడే మరో ప్రకృతి పరీక్ష!
అర్నాబ్ విధ్వంసం నుంచి కోలుకునేలోపే మురసు తుఫాను ప్రభావం మొదలైంది.ఈసారి ప్రచండ గాలులు లేకపోయినా, ఆకాశం తన కన్నీటిని ఆపుకోలేదు. నల్లని మేఘాలు కుండపోతగా విరుచుకుపడ్డాయి. ఒక రోజు మొత్తం ఎడతెరిపి లేని వర్షం. చినుకు చినుకుగా మొదలైన వాన జలపాతంలా మారింది. ఆకాశానికి చిల్లులు పడినట్టుగా నీరు ధారాపాతంగా కురిసింది.అర్నాబ్ గాలి చేసిన గాయాల మీద మురసు వాన నీటి మంటను రుద్దినట్టయింది. ఇంకా విరిగిన చెట్లను తొలగించలేదు. నేలకొరిగిన స్తంభాలను నిలబెట్టలేదు. ఇళ్ల పైకప్పులకు మరమ్మతులు చేయలేదు. విద్యుత్తు కోసం ఎదురుచూపులు ఇంకా ముగియలేదు. అలాంటి సమయంలో ఈ భారీ వర్షం మరో సమస్యగా వచ్చి పడింది.నేల మీద నీరు నిలిచింది. కాలువలు పొంగిపొర్లాయి. రహదారులు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరింది. ఎక్కడ చూసినా నీరే. నిన్నటి వరకు చెట్లు అడ్డుపడిన దారుల్లో నేడు వర్షపు నీరు అడ్డుగోడగా నిలిచింది.ఇప్పటికే చెట్లు కూలి దారులు మూసుకుపోయిన గ్రామాలకు ఈ వర్షం మరో అడ్డంకిగా మారింది. బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉండలేని పరిస్థితి. రాకపోకలు స్తంభించాయి. ఒకవైపు విద్యుత్తు కోసం ఎదురుచూపులు.
మరోవైపు నీటిలో మునిగిపోతున్న వీధులు.ఇంటి గుమ్మం దగ్గర నిలిచిన నీరు క్రమంగా లోపలికి చేరుతుంటే, దాన్ని బయటకు తోడే శక్తి కూడా లేని పరిస్థితి. విద్యుత్ మోటార్లు పనిచేయవు. నీటిని బయటకు పంపే మార్గాలు సరిగా లేవు. ఒకవైపు తాగడానికి నీరు దొరకదు. మరోవైపు వర్షపు నీరు ఇంట్లోకి చేరుతుంది. ప్రకృతి సృష్టించిన ఈ వైరుధ్యం ఎంతటి విషాదం!...అర్నాబ్ గాలి కోనసీమ పైకప్పులను పెకలిస్తే, మురసు వాన ఆ పల్లెల గడపల్లోకి నీటిని పంపింది.
ఒక గాయం మీద మరో గాయం. ఒక కన్నీటి చుక్క ఆరకముందే మరో కన్నీటి ధార. తుఫాను విరిగిన చెట్ల మధ్య వర్షం తన దారిని వెతుక్కుంటూ వచ్చింది. పల్లెలు ఇంకా కోలుకోకముందే ప్రకృతి మరోసారి పరీక్షకు నిలిపింది.
నిజానికి కోనసీమ ప్రజలు కోరుకున్నది పెద్దగా ఏమీ కాదు. తమ ఇళ్లకు విద్యుత్తు రావాలి. తాగడానికి నీరు దొరకాలి. రహదారుల మీదుగా రాకపోకలు సాగాలి. రోజువారీ పనులు చేసుకుంటూ ప్రశాంతంగా జీవించాలి. కానీ ఇప్పుడు ఈ కనీస అవసరాలే అందని దూరంలో నిలిచిపోయాయి.ఇప్పుడు కోనసీమ ప్రజలకు కావాల్సింది జాలి మాటలు కాదు. తక్షణ సహాయం. విద్యుత్ పునరుద్ధరణ. తాగునీరు. నిత్యావసర వస్తువులు. రహదారుల పునరుద్ధరణ. కమ్యూనికేషన్ వ్యవస్థ పునరుద్ధరణ. నష్టపోయిన ఇళ్లకు అండ. పునరావాసం. ప్రజల కనీస జీవనం తిరిగి గాడిలో పడేలా సమగ్ర చర్యలు.
ప్రకృతి ముందు మనిషి చిన్నవాడే కావచ్చు. కానీ ప్రకృతి విలయానికి ఎదురొడ్డి నిలబడే మానవ ధైర్యం చిన్నది కాదు.
నిన్నటి వరకు పచ్చని కొబ్బరి తోటల మధ్య చిరుగాలులతో పలకరించిన కోనసీమ, నేడు విరిగిన కొమ్మల మధ్య బతుకుదారి వెతుక్కుంటోంది. గోదావరి గాలికి ఊగిన కొబ్బరి ఇప్పుడు నేలపై నిశ్శబ్దంగా పడి ఉన్నాయి. వెలుగులతో కళకళలాడిన పల్లెలు చీకటిలో మునిగిపోయాయి. ప్రతి ఇంటికీ ఒక నష్టం. ప్రతి వీధికీ ఒక విషాదం. ప్రతి మనసులోనూ ఒక భయం.ఒకప్పుడు సాయంత్రం వేళ ఇంటి ముందు కూర్చుని కబుర్లు చెప్పుకున్న మనుషులు, ఇప్పుడు చీకటి పడకముందే ఇంటికి చేరుకోవాలని చూస్తున్నారు. పిల్లలకు బయట ఆడుకోవడానికి వీధులు లేవు. వృద్ధులకు ప్రశాంతంగా గడపడానికి వెలుగు లేదు. మహిళలకు నీటి కోసం నిరీక్షణ. యువతకు గ్రామాన్ని తిరిగి నిలబెట్టాలన్న బాధ్యత. ప్రతి ఒక్కరి జీవితం ఒక్కసారిగా కొత్త కష్టాల మధ్య చిక్కుకుపోయింది.తుఫాను వెళ్లిపోయిందని ప్రకృతి శాంతించినట్టే. కానీ కోనసీమలో మాత్రం దాని గాయాలు ఇంకా రక్తమోడుతూనే ఉన్నాయి.
చీకటి పడితే కోనసీమ పల్లెలు ఇప్పటికీ ఉలిక్కిపడుతున్నాయి. గాలి కాస్త గట్టిగా వీచినా గుండెల్లో పాత భయం మళ్లీ కదులుతోంది. ఆకాశంలో మబ్బు కనిపించినా కళ్లలో ఆందోళన మొదలవుతోంది. ఎందుకంటే వారికి తుఫాను అంటే ఇప్పుడు కేవలం వాతావరణ వార్త కాదు. అది ఒక భయంకరమైన రాత్రి. అది కూలిపోయిన చెట్టు. అది నేలకొరిగిన విద్యుత్ స్తంభం. అది నీళ్ల కోసం పడిన నిరీక్షణ. అది చీకట్లో గడిచిన నిస్సహాయ జీవితం. అది తెగిపోయిన కమ్యూనికేషన్. అది మూసుకుపోయిన రహదారి. అది వంద రూపాయలకు కొనాల్సి వచ్చిన తాగునీరు. అది ఇంకా తిరిగి వెలగని ఇంటి దీపం.ఇది ప్రకృతి ప్రకోపం ముందు మనిషి ఎదుర్కొన్న నిస్సహాయత. ఇది కూలిపోయిన చెట్ల మధ్య మళ్లీ జీవితాన్ని వెతుక్కుంటున్న ప్రజల వ్యథ.ఇది ఇంకా వెలుగు కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రజల కన్నీటి సంతకం!
చివరిగా ...
ప్రకృతి ప్రకోపమా? మనిషి స్వయంకృతాపరాధమా?
ప్రకృతి ఇంతలా విరుచుకుపడటానికి కారణం ఏమిటి? తుఫానుల తీవ్రతకు వాతావరణ మార్పులే కారణమా? లేక ప్రకృతిని మన చేతులతో మనమే గాయపరుస్తున్నామా? ప్లాస్టిక్ వ్యర్థాలతో నదులు, కాలువలను విషతుల్యం చేస్తున్నాం. ఆక్వా పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలు, గ్యాస్ లీకేజీలు, రసాయన కాలుష్యాలు పల్లె గాలిని, నేలను, నీటిని కలుషితం చేస్తున్నాయి. అభివృద్ధి పేరుతో చెట్లను నిర్దాక్షిణ్యంగా నరికేస్తున్నాం. చెరువులను పూడ్చేస్తున్నాం. సహజ నీటి ప్రవాహాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. పరిశ్రమల వ్యర్థాలను విచ్చలవిడిగా వదిలేస్తున్నాం. భూమి పొరలను తవ్వి, గాలిని విషపూరితం చేసి, నీటిని కలుషితం చేసి, చివరకు ప్రకృతే మనకు అన్యాయం చేస్తోందని నిందిస్తున్నాం. వ్యక్తిగత స్వార్థం సామూహిక వినాశనానికి దారితీస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎల్‌నినో వంటి సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు, ప్రపంచ వాతావరణ మార్పులు తుఫానుల తీవ్రతపై ప్రభావం చూపుతున్న వేళ, మనిషి చేస్తున్న పర్యావరణ విధ్వంసం సమస్యను మరింత జటిలం చేస్తోంది.చెట్లను నరికేసి నీడ లేదని ఏడుస్తున్నాం. కాలువలను కబళించి వరద వచ్చిందని విలపిస్తున్నాం. గాలిని కలుషితం చేసి ఊపిరాడటం లేదంటున్నాం. ఇసుక తవ్వకాలు, తీరప్రాంత విధ్వంసం, విచ్చలవిడిగా నిర్మాణాలు... ప్రకృతి ఇచ్చిన వనరులను స్వార్థానికి బలిచేసి, ప్రకృతి విపత్తుల ముందు మాత్రం బాధితులుగా నిలబడుతున్నాం. ఇది ప్రకృతి చేసిన నేరమా? మనిషి చేసిన పాపమా? మన స్వార్థం భవిష్యత్తు తరాల జీవితాలనే కూల్చేస్తోంది. ఇప్పటికైనా ప్రకృతిని కాపాడకపోతే, రేపటి తరాలకు మనం అందించేది పచ్చని భూమి కాదు. కాలుష్యపు వారసత్వం, కన్నీటి చరిత్ర మాత్రమే.
పారిశ్రామిక వ్యర్థాలు ప్రకృతి సమతుల్యతకు సవాళ్లుగా మారుతున్నాయి. మరోవైపు సముద్ర ఉష్ణోగ్రతల మార్పులు, ఎల్‌నినో వంటి వాతావరణ పరిణామాలు తుఫానుల తీవ్రతపై ప్రభావం చూపుతున్నాయి.చెట్లను నరికేసి గాలిని నిందిస్తున్నాం. కాలువలను కబళించి వరదలను శపిస్తున్నాం. సముద్రాన్ని కలుషితం చేసి అలల ఉధృతికి భయపడుతున్నాం. ప్రకృతిని మన అవసరాలకు బలిచేస్తూ, విపత్తు వచ్చినప్పుడు ప్రకృతినే నిందించడం ఎంతటి స్వార్థం! తుఫాను ఒక హెచ్చరిక కావచ్చు. కానీ ప్రకృతిపై మనిషి చేస్తున్న దాడి అంతకంటే పెద్ద ప్రమాదం. రేపటి కోనసీమ పచ్చదనం కోల్పోయిన కన్నీటి నేలగా మిగిలిపోతుంది. ప్రకృతిని కాపాడటం ఇక పర్యావరణ నినాదం కాదు. కోనసీమ మనుగడకు అత్యవసరమైన బాధ్యత.
Tags
1 readers have reacted