మంగళగిరిలో మహిళల టీ-20 క్రికెట్ సందడి.. WAPLకు బ్రాండ్ అంబాసిడర్‌గా..
WAPL Mangalagiri: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 తొలి సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంతో మహిళల క్రికెట్ సందడి మొదలైంది.
యువ మహిళా క్రికెటర్లకు సువర్ణావకాశం.. WAPL సీజన్-1 షురూ..
నారా బ్రాహ్మణి, మిథాలీ రాజ్ చేతుల మీదుగా WAPL ట్రోఫీ ఆవిష్కరణ..
మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే దిశగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) టీ-20 తొలి సీజన్ ఘనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం సాయంత్రం నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంతో మహిళల క్రికెట్ సందడి మొదలైంది.
యువ మహిళా క్రికెటర్లలోని ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన అవకాశాలు కల్పించడం, భవిష్యత్తులో ఉమెన్ ప్రీమియర్ లీగ్ (WPL), భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకునేలా ప్రోత్సహించడమే WAPL ప్రధాన లక్ష్యంగా ఏసీఏ తెలిపింది. రాష్ట్రంలో ఫ్రాంచైజీ విధానంలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్ యువ క్రీడాకారిణులకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు వేదికగా నిలవనుంది.
WAPL తొలి సీజన్ ప్రారంభోత్సవానికి హెరిటేజ్ ఫుడ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి ముఖ్య అతిథిగా హాజరై లీగ్‌ను లాంఛనంగా ప్రారంభించారు. స్టేడియం ప్రాంగణానికి చేరుకున్న ఆమెకు ఎంపీ, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, రాజ్యసభ ఎంపీ, ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ బాబు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌తో కలిసి WAPL ట్రోఫీని నారా బ్రాహ్మణి ఆవిష్కరించారు.
మహిళా క్రికెటర్లకు గొప్ప అవకాశం
WAPL ప్రారంభోత్సవంలో నారా బ్రాహ్మణి మాట్లాడుతూ మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. తమ ప్రతిభను నిరూపించుకునేందుకు మహిళా క్రికెటర్లకు ఈ లీగ్ ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారిణులకు సరైన అవకాశం లభిస్తే వారు అద్భుతంగా రాణించగలరని అన్నారు.
ఈ లీగ్‌లో పాల్గొంటున్న యువ క్రికెటర్లు భవిష్యత్ తరాలకు రోల్ మోడల్స్‌గా నిలిచే అవకాశం ఉందని బ్రాహ్మణి పేర్కొన్నారు. మంగళగిరిని వేదికగా చేసుకుని యువ మహిళా క్రికెటర్లకు ఇలాంటి అవకాశం కల్పిస్తున్న ఏసీఏ నిర్వాహకులను ఆమె అభినందించారు.
మిథాలీ రాజ్ బ్రాండ్ అంబాసిడర్
భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ WAPLకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె సారథ్యంలో భారత మహిళా క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పెరిగిన నేపథ్యంలో, యువ క్రీడాకారిణులకు ఆమె అనుభవం, ప్రేరణ ఉపయోగపడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.
నాలుగు జట్ల మధ్య పోటీ
WAPL తొలి సీజన్‌లో నాలుగు ఫ్రాంచైజీలు బరిలోకి దిగుతున్నాయి. రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్, అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ జట్లు టైటిల్ కోసం పోటీపడుతున్నాయి.
మంగళగిరిలోని ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏడు రోజుల పాటు మొత్తం 13 మ్యాచ్‌లు జరగనున్నాయి. శనివారం మధ్యాహ్నం రాయలసీమ జెన్ స్టార్స్, గోదావరి ఈగల్స్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. అదే రోజు సాయంత్రం అమరావతి ఈ-ఛాంపియన్స్, వైజాగ్ ఫైర్ బర్డ్స్ మధ్య రెండో మ్యాచ్ నిర్వహించారు.
యువ ప్రతిభకు వేదికగా WAPL
మహిళా క్రికెట్‌లో ప్రతిభ ఉన్నప్పటికీ తగిన అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువ క్రీడాకారిణులకు రాష్ట్రస్థాయి ప్రీమియర్ లీగ్‌లు కీలక వేదికగా మారుతున్నాయి. పోటీ క్రికెట్‌లో అనుభవం సంపాదించడంతో పాటు తమ ఆటతీరును మెరుగుపరుచుకునేందుకు WAPL అవకాశం కల్పించనుంది. భవిష్యత్తులో రాష్ట్రం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి మరింత మంది మహిళా క్రికెటర్లు ఎదగడానికి ఈ లీగ్ దోహదపడుతుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో నారా బ్రాహ్మణిని నిర్వాహకులు ప్రత్యేక జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి.
ఈ కార్యక్రమంలో ఏసీఏ(ACA International) అధ్యక్షుడు కేశినేని శివనాథ్, కార్యదర్శి సానా సతీష్ బాబు, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు, భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్, ఏసీఏ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు డి. విష్ణుతేజ, ఏసీఏ క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ, ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు వైఎస్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.