విశాఖకు తాగునీటి భద్రత.. సూపర్ ఎల్‌నినో నేపథ్యంలో కీలక ఆదేశాలు!
Visakhapatnam Water Security: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
విశాఖకు నీటి భరోసా.. ఏలేరు నుంచి కణితికి 350 క్యూసెక్కుల నీటిపై దృష్టి..
విశాఖ తాగునీటి సమస్యకు ప్రత్యామ్నాయ మార్గాలు.. రైవాడకు పోలవరం నీటిని లిఫ్ట్ చేసే యోచన..
అమరావతి: సూపర్ ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం నగరానికి తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు నీటి కొరత రాకుండా సమగ్ర ప్రణాళిక రూపొందించినట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. విశాఖ భవిష్యత్ నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
విశాఖ తాగునీటి అవసరాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇరిగేషన్, పురపాలక శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. నగరానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాటి నిల్వలు, పరిమితులు, ప్రత్యామ్నాయ మార్గాలు, పైప్‌లైన్లు, లిఫ్ట్‌ల ద్వారా నీటిని తరలించే అవకాశాలపై సమావేశంలో సమగ్రంగా చర్చించినట్లు పేర్కొన్నారు.
ఏలేరు–కణితి ద్వారా తాగునీటికి భరోసా
విశాఖకు తాగునీటిని అందించే కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఏలేరు నుంచి ప్రస్తుతం రోజుకు 300 క్యూసెక్కుల నీరు వస్తోందని మంత్రి తెలిపారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లోనూ పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేయగలుగుతున్నామని చెప్పారు.
ఏలేరు రిజర్వాయర్‌లో ప్రస్తుతం 10.2 టీఎంసీల నీరు ఉండగా, అందులో 6.1 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉన్నట్లు మంత్రి వివరించారు. 2027 జూన్ వరకు విశాఖకు రోజుకు 300 క్యూసెక్కుల నీటిని ప్రణాళికాబద్ధంగా అందించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఏలేరు నుంచి కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు వచ్చే నీటిని రోజుకు 300 నుంచి 350 క్యూసెక్కులకు పెంచే అవకాశాలను పరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో ఏలేరు డెడ్ స్టోరేజీలోని నీటిని కూడా వినియోగించుకునేలా మోటార్లు, పంపులను ముందుగానే సిద్ధం చేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.
రైవాడకు ప్రత్యామ్నాయ నీటి వనరులపై దృష్టి
విశాఖకు మరో కీలక నీటి వనరైన రైవాడ రిజర్వాయర్‌లో పరిస్థితిపై కూడా ప్రభుత్వం దృష్టి సారించింది. రైవాడ పూర్తి సామర్థ్యం 3.6 టీఎంసీలు కాగా, ప్రస్తుతం కేవలం 0.9 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు.
రైవాడ కింద సుమారు 5 వేల ఎకరాల సాగు జరుగుతున్న నేపథ్యంలో నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు తాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం సూచించినట్లు చెప్పారు.
రైవాడకు ప్రత్యామ్నాయంగా పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి నీటిని లిఫ్ట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని మంత్రి తెలిపారు. ఎల్‌ఎంసీ 162వ కిలోమీటర్ వద్ద లేదా అనువైన ప్రాంతంలో లిఫ్ట్ ఏర్పాటు చేసి రైవాడకు నీటిని అందించే ప్రతిపాదనలను వారం రోజుల్లో పరిశీలించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీరు
విశాఖకు మరో ముఖ్యమైన నీటి వనరు మేఘాద్రిగెడ్డ రిజర్వాయర్. దీని పూర్తి సామర్థ్యం 1.17 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 0.2 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి తెలిపారు.
పోలవరం ఎడమ ప్రధాన కాలువ నుంచి మేఘాద్రిగెడ్డకు 100 క్యూసెక్కుల నీటిని అందించేందుకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మొత్తం 10.5 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో ఇప్పటికే 9 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయని, మరో 1.5 కిలోమీటర్ల పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు.
మిగిలిన పైప్‌లైన్ పనులతో పాటు మోటార్లు, పంపుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి మేఘాద్రిగెడ్డకు నీటిని అందించాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. రైల్వే, ఎలక్ట్రికల్ క్రాసింగ్‌ల వద్ద ఉన్న సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
తాటిపూడి నీటిని జాగ్రత్తగా వినియోగించాలి
తాటిపూడి రిజర్వాయర్ సామర్థ్యం 3.3 టీఎంసీలు కాగా, ప్రస్తుతం సుమారు 1.2 నుంచి 1.26 టీఎంసీల నీరు మాత్రమే ఉందని మంత్రి రామానాయుడు తెలిపారు. అందుబాటులో ఉన్న నీటిని సమర్థవంతంగా వినియోగించడంతో పాటు విజయనగరం సాగునీటి అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం సూచించినట్లు చెప్పారు.
తక్కువ నీటితో పంటలు సాగు చేసే విధానాలను అవలంబించాలని, సాగునీటి వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షించాలని విజయనగరం కలెక్టర్‌ను సీఎం ఆదేశించినట్లు మంత్రి వివరించారు.
పురుషోత్తపట్నం లిఫ్ట్‌తో విశాఖకు నీటి భరోసా
స్థానిక వర్షాలపై ఆధారపడే రైవాడ, మేఘాద్రిగెడ్డ, తాటిపూడి రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు మంత్రి తెలిపారు. విశాఖ తాగునీటి సరఫరాలో కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
పురుషోత్తపట్నం ఎత్తిపోతల ద్వారా ఏలేరు రిజర్వాయర్‌ను నింపడం వల్లే ప్రస్తుతం విశాఖకు కీలకమైన నీటి సరఫరా కొనసాగుతోందని మంత్రి పేర్కొన్నారు. పోలవరం పూర్తయ్యే వరకు వేచి చూడకుండా అప్పట్లో పురుషోత్తపట్నం లిఫ్ట్‌ను ఏర్పాటు చేయడం ముందుచూపుకు నిదర్శనమని అన్నారు.
పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులను గతంలో విమర్శించిన వారు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాటి ప్రయోజనాలను ప్రజలు చూస్తున్నారని మంత్రి వ్యాఖ్యానించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని అందించడం వల్ల శ్రీశైలం నీటిని రాయలసీమ, నాగార్జునసాగర్ తాగునీటి అవసరాలకు వినియోగించుకునే అవకాశం ఏర్పడిందన్నారు. అదే విధంగా పురుషోత్తపట్నం ద్వారా ఏలేరును నింపడం వల్ల సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లోనూ విశాఖ తాగునీటికి భరోసా ఏర్పడిందని తెలిపారు.
2027లో పోలవరం నుంచి ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు
2027లో పోలవరం ప్రాజెక్టు పూర్తయిన వెంటనే పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎడమ ప్రధాన కాలువను 17,500 క్యూసెక్కుల సామర్థ్యంతో పూర్తి చేసి గోదావరి వరద జలాలను ఉత్తరాంధ్రకు అందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
పోలవరం పనులు పూర్తయి ఉంటే ఉత్తరాంధ్రకు గోదావరి జలాల ప్రయోజనం మరింత ముందుగానే అందేదని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం విషయంలో జరిగిన జాప్యం కారణంగా ఉత్తరాంధ్రకు నీటి ప్రయోజనాలు ఆలస్యమయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు.
డేటా సెంటర్ల నీటి అవసరాలపై తప్పుడు ప్రచారం వద్దు
విశాఖలో రాబోయే డేటా సెంటర్లకు అవసరమయ్యే నీటి పరిమాణంపై తప్పుడు ప్రచారం జరుగుతోందని మంత్రి అన్నారు. నగర తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, పారిశ్రామిక అవసరాలను కూడా సమతుల్యం చేస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నీటి వనరులను అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతిపై దీర్ఘకాలిక ప్రణాళిక
విశాఖకు భవిష్యత్తులో తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంటి ప్రాజెక్టులపైనా ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి తెలిపారు. గ్రావిటీ ద్వారా విశాఖకు నీటిని అందించే అవకాశాలను కూడా పరిశీలించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు.
తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక నీటి భద్రతను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. సూపర్ ఎల్‌నినో పరిస్థితుల్లో ఈ ఏడాది అత్యవసర పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి విశాఖ నగరంలో తాగునీటి ఇబ్బంది లేకుండా చూడడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
సెప్టెంబర్ 23న మరోసారి సమీక్ష
విశాఖ నీటి సమస్యపై సెప్టెంబర్ 23న మరోసారి కీలక సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమావేశానికి విశాఖ ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇరిగేషన్, పురపాలక శాఖ అధికారులు హాజరవుతారని చెప్పారు.
విశాఖ భవిష్యత్తు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని తాగునీరు, పారిశ్రామిక అవసరాలకు శాశ్వత నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. తక్షణ అవసరాలకు అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించడంతో పాటు, భవిష్యత్తులో నగర అవసరాలను తీర్చేలా కొత్త ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు.
Tags
Be the first to react