భారతదేశ తూర్పు తీరానికి ముఖద్వారంగా పేరొందిన విశాఖపట్నం పోర్టు అథారిటీ దేశ నౌకాయాన రంగంలో మరోసారి తన సత్తా చాటింది. అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొంటూ, సరుకు రవాణాలో ఏటా కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఇతర ప్రధాన పోర్టులకు గట్టి పోటీ ఇస్తూ, రాబోయే మూడేళ్లలో దేశంలోనే నంబర్ వన్ పోర్టుగా నిలవాలనే లక్ష్యంతో వేగంగా ముందుకెళ్తోంది.
ఈ ఆర్థిక సంవత్సరంలో విశాఖ పోర్టు చరిత్రలోనే ఓ కీలక మైలురాయిని చేరుకుంది. కేవలం 249 రోజుల్లో 60 మిలియన్ మెట్రిక్ టన్నుల సరుకు హ్యాండ్లింగ్ చేసి రికార్డు సృష్టించింది. గత రెండేళ్లలో ఇదే స్థాయి సరుకు రవాణాకు 275 రోజులు పట్టగా, ఈసారి ముందుగానే లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న 90 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గోను కూడా దాటే దిశగా పోర్టు వేగంగా అడుగులు వేస్తోంది.
సరుకు రవాణా మరింత వేగవంతం కావడానికి పోర్టులో ఆధునిక సాంకేతికతను ప్రవేశపెడుతున్నారు. రూ.14.03 కోట్లతో వెసెల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (VMS) అమలు కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనివల్ల నౌకల రాకపోకలు క్రమబద్ధీకరించబడతాయి, ఎగుమతి–దిగుమతులకు పట్టే సమయం తగ్గుతుంది. అలాగే బెర్తుల ఆధునికీకరణ, ఛానెల్స్ లోతు పెంపు, జెట్టీల విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
విశాఖ పోర్టు తన 90 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో భారీ విజయాలను సాధిస్తోంది. యూరప్ నుంచి వచ్చిన 366 మీటర్ల పొడవైన ‘ఎంఎస్‌సీ మోనికా క్రిష్టినా’ అనే భారీ కంటైనర్ షిప్‌ను విజయవంతంగా బెర్తింగ్ చేయడం గర్వకారణంగా మారింది. ఒకే నౌక ద్వారా 1.99 లక్షల మెట్రిక్ టన్నుల మాంగనీస్, 1.60 లక్షల మెట్రిక్ టన్నుల క్రూడాయిల్, ఒకే నెలలో 22 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు దిగుమతి చేసి పాత రికార్డులను తిరగరాసింది.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు, సొంత వనరులను సమర్థంగా వినియోగిస్తూ విశాఖ పోర్టు ఆదాయాన్ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. మాంగనీస్, బొగ్గు, జిప్సం వంటి ఖనిజాల రవాణాతో అంతర్జాతీయ వాణిజ్యంలో కీలక కేంద్రంగా మారుతోంది. త్వరలో VTMS (వెసెల్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) పూర్తిస్థాయిలో అమలులోకి వస్తే, విశాఖ పోర్టు ప్రపంచంలోని అగ్రశ్రేణి పోర్టుల సరసన నిలవనుంది.