దేశ రక్షణను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులను రన్‌వేలుగా మార్చే కీలక ప్రణాళికలను అమలు చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు, రవాణా విమానాలు సులభంగా ల్యాండ్ అయ్యేలా ఈ రన్‌వేలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే జాతీయ రహదారులపై రన్‌వేలు ఏర్పాటు చేయగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఈ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో ఇప్పటికే జాతీయ రహదారులపై రన్‌వేలు సిద్ధమయ్యాయి. బాపట్ల జిల్లా కొరిశపాడు–రేణంగివరం మధ్య నిర్మించిన రన్‌వే విమానాలు దిగేందుకు అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. రహదారి పూర్తిగా సూటిగా ఉండటం, ఒంపులు లేకపోవడం వల్ల రెండు సార్లు ట్రయల్ రన్‌లు విజయవంతంగా నిర్వహించారు. 2023లో విమానం ల్యాండ్ చేసి తిరిగి టేకాఫ్ చేయగా, ట్రాఫిక్‌ను తాత్కాలికంగా నిలిపివేసి ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించారు. ఈ విజయంతో వైమానిక దళం కూడా దీనికి ఆమోదం తెలిపింది.
ఇదిలా ఉండగా, 2021లో సింగరాయకొండ బైపాస్ వద్ద జాతీయ రహదారిని రన్‌వేగా విస్తరించే ప్రయత్నం జరిగింది. అయితే అక్కడ నాణ్యత లోపాలు ఉండటంతో విమానాల ల్యాండింగ్‌కు అది అనర్హమని తేలింది. దీంతో ఆ రన్‌వే ఉపయోగంలోకి రాలేదు. ఇప్పుడు ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, సింగరాయకొండ ప్రాంతంలో మరోసారి కొత్తగా రన్‌వే ఏర్పాటు చేయడానికి కేంద్రం అడుగులు వేస్తోంది.
సింగరాయకొండ మండలంలోని మూలగుంటపాడు, కనుమళ్ల గ్రామాల మధ్య ఉన్న జాతీయ రహదారిని సుమారు 4 కిలోమీటర్ల మేర కాంక్రీట్ రన్‌వేగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ రహదారిపై డివైడర్లు లేకుండా పూర్తిగా విమానాలు దిగేలా రూపకల్పన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రెండు గ్రామాల్లో కలిపి దాదాపు 15 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంది. దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ ఇప్పటికే అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది.
భూసేకరణకు సంబంధించి ఏ సర్వే నంబర్లలో ఎంత భూమి తీసుకోవాలనే వివరాలతో రెవెన్యూ అధికారులు సర్వే పనులు పూర్తి చేశారు. జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ స్వయంగా ప్రతిపాదిత రన్‌వే ప్రాంతాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో భూసేకరణను పూర్తి చేసి అప్పగించే బాధ్యత తమదేనని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే సింగరాయకొండ జాతీయ రహదారి రన్‌వే నిర్మాణంపై పూర్తి స్పష్టత రానుందని తెలుస్తోంది.