తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించిన భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ దేశ అభివృద్ధికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేస్తున్న కృషిని ప్రశంసించారు. దేశం, భారతీయతపై చర్చించేందుకు భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ఒక గొప్ప వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు.
ప్రాచీన కాలంలోనే భారతదేశం విజ్ఞానానికి పుట్టినిల్లుగా ఉన్నదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. వేల సంవత్సరాల క్రితమే శాస్త్రం, సాంకేతికత, జీవన విధానాల్లో మన పూర్వీకులు ప్రపంచానికి మార్గదర్శకులుగా నిలిచారని చెప్పారు. హరప్పా నాగరికతలో కనిపించిన అర్బన్ ప్లానింగ్ నేటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తోందని వివరించారు.
యోగాభ్యాసం భారతదేశానికి చెందిన గొప్ప వారసత్వమని చంద్రబాబు నాయుడు తెలిపారు. సుమారు 2900 ఏళ్ల క్రితమే యోగాను అభ్యసించిన ఘనత మనదేనని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నిర్వహించామని గుర్తు చేశారు. ప్రస్తుతం 150కి పైగా దేశాల్లో యోగా సాధన జరుగుతోందని చెప్పారు.
అలాగే, 2600 ఏళ్ల క్రితమే ఆయుర్వేదం ద్వారా భారతదేశం వైద్య సేవలు అందించిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాలు భారతీయ విద్యా సంప్రదాయానికి నిదర్శనమన్నారు. సున్నా ఆవిష్కరణ, చదరంగం వంటి మేధస్సును పెంపొందించే ఆవిష్కరణలు కూడా భారతీయుల నుంచే ప్రపంచానికి వెళ్లాయని తెలిపారు.
విజ్ఞానం, గణితం, వైద్యం, ఆర్థికశాస్త్రం వంటి అనేక రంగాల్లో భారతదేశం గొప్ప నిపుణులను అందించిందని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆర్యభట్ట, భాస్కరాచార్య, చరక, ధన్వంతరి, కౌటిల్యుడు వంటి మహనీయులు భారతీయ మేధస్సుకు ప్రతీకలని పేర్కొన్నారు. వారి ఆలోచనలు, కృషి నేటి తరానికి కూడా స్పూర్తిగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.