ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణ సదుపాయం అందించాలనే లక్ష్యంతో ‘ఆంధ్రా ట్యాక్సీ’ యాప్‌ను ప్రారంభించింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఈ యాప్‌ను అధికారికంగా లాంఛ్ చేశారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆటో, ట్యాక్సీ యూనియన్ల ప్రతినిధులు, రవాణా, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. యాప్ ప్రారంభం అనంతరం కలెక్టర్ స్వయంగా ఆటో బుక్ చేసి ప్రయాణించి, యాప్ పనితీరును పరిశీలించారు.
ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ ద్వారా పర్యాటకులు, స్థానికులు తక్కువ ధరల్లో, భద్రంగా ప్రయాణించే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా అధిక చార్జీలు వసూలు చేసే సమస్యకు చెక్ పెట్టడమే ఈ యాప్ ప్రధాన లక్ష్యం. ఆటో, క్యాబ్‌లను క్యూఆర్ కోడ్, వాట్సప్, యాప్, వెబ్‌సైట్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లో పర్యాటక ప్యాకేజీలు కూడా అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.
మహిళల భద్రతకు ఈ యాప్‌లో ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. యాప్ ద్వారా బుక్ చేసిన ప్రతి వాహన వివరాలు, ప్రయాణికుల సమాచారం నేరుగా స్థానిక పోలీస్ స్టేషన్‌లకు చేరుతుంది. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా వెంటనే స్పందించేందుకు ఎస్‌వోఎస్ సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే 100, 112, 181 వంటి అత్యవసర నంబర్లు కూడా యాప్‌లో పొందుపరిచారు.
ఆటో డ్రైవర్ల మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రతి ఆటోలో క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులు ఈ కోడ్‌ను స్కాన్ చేసి డ్రైవర్ ప్రవర్తనపై ఫిర్యాదు చేయవచ్చు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, లేదా ప్రయాణంలో ఏదైనా వస్తువు మర్చిపోతే కూడా ఈ కోడ్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వొచ్చు. దీనివల్ల సమస్యలను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుంది.
ఈ ఆంధ్రా ట్యాక్సీ యాప్ రవాణా సేవలకే పరిమితం కాకుండా మరిన్ని సౌకర్యాలు అందించనుంది. హోటల్ బుకింగ్, ప్రయాణంతో పాటు వసతి కలిపిన ప్యాకేజీలు కూడా ఇందులో అందుబాటులోకి రానున్నాయి. రవాణా శాఖ అధికారులు ఫిట్‌నెస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇస్తారు. ఈ యాప్ ద్వారా ప్రయాణం మరింత సులభం, సురక్షితం, పారదర్శకంగా మారుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.