తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు మన ఊరికి వెళ్లొచ్చా అని ఉద్యోగుల నుంచి స్కూల్ పిల్లల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. సాంప్రదాయంగా చూసుకుంటే సంక్రాంతి అనేది తెలుగు వారికి అది పెద్ద పండుగ చెప్పుకోవాలి. అటువంటి పండగకు ఏపీ సర్కార్ ఊరట కలిగించే వార్త . 2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌లో భాగంగా పాఠశాలలకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్, సెలవుల వివరాలను ప్రకటించిన ప్రభుత్వం, ఇప్పుడు సంక్రాంతి సెలవుల తేదీలపై పూర్తి స్పష్టత ఇచ్చింది. ఈ నిర్ణయంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే తమ పండుగ ప్రయాణాలపై ప్రణాళికలు వేసుకునే అవకాశం ఏర్పడింది.
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి 10, 2026 నుంచి జనవరి 18, 2026 వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయని విద్యాశాఖ ప్రకటించింది. మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులు అమలులో ఉంటాయని స్పష్టం చేసింది. ఈ సెలవుల అనంతరం జనవరి 19 నుంచి మళ్లీ తరగతులు యథావిధిగా ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. ఈ సెలవులు ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యాసంస్థలకు కూడా వర్తిస్తాయని పేర్కొన్నారు. అకడమిక్ క్యాలెండర్‌లో ఎలాంటి మార్పులు ఉండవని, పరీక్షల షెడ్యూల్ కూడా యథాతథంగా కొనసాగుతుందని స్పష్టత ఇచ్చారు.
సంక్రాంతి పండుగకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి సమయంలో లక్షలాది మంది తమ స్వగ్రామాలకు వెళ్లి కుటుంబ సభ్యులతో కలిసి పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా విద్యార్థులు ఈ సెలవులను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. గ్రామాల్లో సంప్రదాయ పండుగ వాతావరణం, ఆటలు, సంబరాలు అనుభవించేందుకు ఈ సెలవులు ఎంతో ఉపయోగపడతాయి.
తెలంగాణలోనూ ఇదే తరహా నిర్ణయం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా జనవరి 10 నుంచి జనవరి 15 వరకు సెలవులు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే సెలవుల వ్యవధిని పెంచే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ జనవరి 19 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
సెలవుల కాలంలో జనవరి 14న భోగి, జనవరి 15న మకర సంక్రాంతి, జనవరి 16న కనుమ, జనవరి 17న ముక్కనుమ పండుగలు వరుసగా వస్తాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు నిర్బంధం లేకుండా పండుగలను ఆనందంగా జరుపుకునే అవకాశం లభించనుంది. అదనంగా జనవరి 23న వసంత పంచమి, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి.