తెలంగాణ రైతులకు సంక్రాంతి పండుగ ముందే ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో పెట్టుకుని రైతుభరోసా నిధులను సంక్రాంతి కానుకగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసింది. గతంలో వానాకాలం సీజన్‌లో తక్కువ సమయంలోనే భారీ మొత్తంలో నిధులు విడుదల చేసి రైతుల ప్రశంసలు అందుకున్న ప్రభుత్వం రైతులకు సాగు ప్రారంభ దశలోనే ఆర్థిక భరోసా కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా చూపుతున్నాయి.
రబీ పంటల కాలంనే సాగు రాష్ట్రవ్యాప్తంగా జనవరిలో ముమ్మరంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఖర్చులకు డబ్బు అందుబాటులో ఉండేలా ముందుగానే రైతుభరోసా నిధులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం అవసరమైన నిధుల లెక్కలు సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. ఇప్పటికే డిసెంబరు నెలలో కొన్ని జిల్లాల్లో సాగు ప్రారంభమైనప్పటికీ, ప్రధానంగా జనవరి రెండో వారం నుంచి పెద్ద ఎత్తున పంటల సాగు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయానికి రైతుల చేతికి పెట్టుబడి సాయం అందితే వడ్డీల భారం లేకుండా వ్యవసాయం చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రైతుభరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈసారి కూడా భారీ మొత్తాన్నే కేటాయించింది. రాష్ట్ర బడ్జెట్‌లో మొత్తం రూ.18 వేల కోట్లను ఈ పథకం కోసం ముందే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటిన్నర ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా, రెండు పంటలకుగాను ఎకరానికి రూ.12 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. గత వానాకాలం సీజన్‌లో దాదాపు 69 లక్షల మంది రైతులకు రూ.8,700 కోట్లకు పైగా నిధులు జమ చేసిన ప్రభుత్వం, యాసంగిలో కూడా అదే స్థాయిలో ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేస్తోంది.
ఈ నేపథ్యంలో వ్యవసాయ శాఖ అధికారులు సాగు లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్‌లో రైతుల వివరాలు నమోదు చేస్తున్నారు. గత సీజన్‌లలో ఎంతమంది రైతులకు రైతుభరోసా అందింది, ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఎంత ఎకరాల సాగు జరుగుతోంది అనే అంశాలపై స్పష్టమైన డేటాను సేకరిస్తున్నారు. ఎకరానికి రూ.6 వేల చొప్పున ఎంత మొత్తం అవసరమవుతుందన్న దానిపై లెక్కలు తయారు చేసి, ప్రభుత్వ ఆదేశాలు రాగానే ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధమవుతున్నారు.
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, రైతుభరోసా నిధుల విడుదల తేదీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ వస్తోంది. సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయితే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కూడా ఊతం లభిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పండుగ వేళ నగదు ప్రవాహం పెరగడం వల్ల మార్కెట్లలో చలనం ఏర్పడుతుందని వారు అభిప్రాయపడుతున్నారు.