రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహించిన ప్రణవ్ మోహన్ లాల్ తాజా చిత్రం ‘డైస్ ఇరే’. థియేటర్లలో ప్రదర్శితమై ప్రశంసలు అందుకున్న తర్వాత ఈ మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది ఈ మలయాళ హారర్ థ్రిల్లర్. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ ఈ మూవీతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు.
హారర్ థ్రిల్లర్లకు ఉండే క్రేజ్ వేరు. ఇక ఇందులోనూ అసలైన హారర్ తో భయపెట్టే సినిమాలు మరింత స్పెషల్. ఈ డైస్ ఇరే ఇలాంటి మూవీనే. ప్రణవ్ మోహన్ లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఈ మూవీ శుక్రవారం (డిసెంబర్ 5) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. జియోహాట్‌స్టార్‌లో అడుగుపెట్టింది ఈ చిత్రం. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఇండియా బయట ఉన్న ఆడియన్స్ కోసం డైస్ ఇరే మరో ఓటీటీలోకి కూడా వచ్చేసింది.సంప్లీ సౌత్ లో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది ఈ మూవీ. ఇండస్ట్రీ ట్రాకర్ సక్నిల్క్ నివేదికల ప్రకారం 'డైస్ ఇరే' ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 82 కోట్లు వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ చిత్రం భారతదేశంలో రూ.40.88 కోట్లు వసూలు చేయగా, విదేశీ మార్కెట్లలో సుమారు రూ. 33 కోట్లు సమకూర్చుకుంది. హాలోవీన్ సందర్భంగా 2025 అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘డైస్ ఇరే’ ఎక్కువగా సానుకూల సమీక్షలను అందుకుంది.
విమర్శకులు ఈ చిత్రంలో ప్రణవ్ నటన, రాహుల్ సదాశివన్ దర్శకత్వం, ఆకట్టుకునే సినిమాటోగ్రఫీ, వాతావరణ సంగీతం, ప్రభావవంతమైన హారర్ అంశాలు, గట్టి స్క్రీన్‌ప్లే, వేగవంతమైన రన్‌టైమ్‌ను ప్రశంసించారు.
దాని ఆకట్టుకునే ప్రదర్శనతో 'డైస్ ఇరే' 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన నాల్గవ మలయాళ చిత్రంగా నిలిచింది. ఓవరాల్ గా అత్యధిక వసూళ్లు సాధించిన 21వ మలయాళ చిత్రంగా స్థానం దక్కించుకుంది.
ఆత్మ, ప్రతీకారం అనే అంశాల చూట్టూ సాగే సినిమానే డైస్ ఇరే. ఇందులో రోహన్ (ప్రణవ్ మోహన్ లాల్) ఓ ఆర్కిటెక్ట్. అతనిది రిచ్ ఫ్యామిలీ. పేరేంట్స్ అమెరికాలో ఉంటారు. రోహన్ ఇక్కడ ఇండియాలో ఓ పెద్ద ఇంట్లో ఒంటరిగానే ఉంటాడు. ఒక రోజు అతని క్లాస్ మేట్ కని (నర్తకి) సూసైడ్ చేసుకుంటుంది. ఆ ఫ్యామిలీని పరామర్శించేందుకు రోహన్ వాళ్ల ఇంటికి వెళ్తాడు.
కని రూమ్ లో ఉన్న ఓ రెడ్ కలర్ హెయిర్ క్లిప్ ను రోహన్ తీసుకొని తన ఇంటికి వెళ్తాడు. అప్పటి నుంచే రోహన్ ఇంట్లో వింత సంఘటనలు జరుగుతాయి. ఏదో ఆత్మ తనను వెంటాడుతున్నట్లే అనిపిస్తుంది. అది కని ఆత్మ అని రోహన్ అనుకుంటాడు. కని బ్రదర్ కిరణ్ ఓ సారి రోహన్ ఇంటికి వస్తాడు. అతణ్ని పై అంతస్తు నుంచి కిందకు తోసేస్తుంది ఓ రహస్య శక్తి.
మరి ఆ ఆత్మ ఎవరు? కనిని ప్రేమించిన ఫిలిప్ కు ఈ కథకు సంబంధం ఏంటీ? క్లైమాక్స్ లో వచ్చే సూపర్ ట్విస్ట్ ఏంటీ? అన్నది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే.