USA: న్యూయార్క్ రోడ్డు ప్రమాదంలో ఏపీ యువతి మృతి.. మూలపాడు గ్రామంలో విషాదం!
USA: అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి అట్లూరి ప్రసన్న (25) దుర్మరణం చెందారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
అమెరికాలో విషాదం.. ఎన్టీఆర్ జిల్లా యువతి అట్లూరి ప్రసన్న దుర్మరణం..
ఉద్యోగ ప్రయత్నాల వేళ విషాదం.. న్యూయార్క్ ప్రమాదంలో ఏపీ యువతి మృతి..
అమరావతి: అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి అట్లూరి ప్రసన్న (25) దుర్మరణం చెందారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన ప్రసన్న మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
పోలీసుల వివరాల ప్రకారం.. జూలై 5న తెల్లవారుజామున న్యూయార్క్ స్టేట్లోని స్టేట్ రూట్స్ 224, 13 కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రసన్న ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగకుండా ముందుకు వెళ్లిన సమయంలో ఎదురుగా గ్రీన్ సిగ్నల్తో వస్తున్న బ్రయాన్ జె. వుడ్వర్త్ నడుపుతున్న మరో వాహనం బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు వెనుక సీటులో కూర్చున్న ప్రసన్న తీవ్రంగా గాయపడి, అనంతరం ఆమెను రాబర్ట్ ప్యాకర్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న డ్రైవర్తో పాటు మరో ఇద్దరు ప్రయాణికులు గాయపడగా, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అయితే ప్రసన్న కుటుంబ సభ్యులు, ఆమె బంధువు రవికుమార్ ఏర్పాటు చేసిన ‘గోఫండ్మీ’ పేజీలో మరో వివరాన్ని వెల్లడించారు. ఎదురుగా వస్తున్న వాహనం రెడ్ సిగ్నల్ను దాటి రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు పేర్కొన్నారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ప్రసన్న ఇటీవలే న్యూయార్క్లోని పేస్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉన్నత విద్య అనంతరం ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. తమ కుమార్తెను కోల్పోయిన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ప్రస్తుతం ప్రసన్న పార్థివ దేహాన్ని స్వగ్రామం మూలపాడుకు తీసుకురావడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికాలోని తెలుగు ప్రవాసులు కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు.
Tags
Be the first to react
