Atchennaidu: ఖరీఫ్కు ఎరువుల కొరత లేదు.. రాష్ట్రవ్యాప్తంగా సమృద్ధిగా నిల్వలు.. మంత్రి అచ్చెన్నాయుడు హామీ!
Atchennaidu: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు రాష్ట్రవ్యాప్తంగా తగినంతగా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా, డీఏపీ సరఫరా సజావుగా కొనసాగుతోంది..
బఫర్ స్టాక్తో అప్రమత్తమైన ప్రభుత్వం.. ఎరువుల కొరత లేదన్న మంత్రి..
అమరావతి: ఖరీఫ్ సీజన్లో రైతులకు ఎలాంటి ఎరువుల కొరత లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులు రాష్ట్రవ్యాప్తంగా తగినంతగా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరమైన ఎరువులను ప్రభుత్వం సకాలంలో అందిస్తుందని భరోసా ఇచ్చారు.
మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం, జూలై 10 నాటికి రాష్ట్రంలో 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3,69,646 మెట్రిక్ టన్నుల యూరియా ఖరీఫ్ అవసరాల్లో 85 శాతం మేరకు, 85,683 మెట్రిక్ టన్నుల డీఏపీ 64 శాతం అవసరాలను తీర్చగలదని తెలిపారు.
రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా జిల్లాల వారీగా మార్క్ఫెడ్ గోదాముల్లో బఫర్ స్టాక్ను సిద్ధంగా ఉంచామని మంత్రి చెప్పారు. ఏ ప్రాంతంలోనైనా నిల్వలు తగ్గిన వెంటనే అదనపు ఎరువులను పంపించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని వివరించారు. పలు ఎరువుల తయారీ కంపెనీల నుంచి కూడా నిల్వలను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ గోదాముల్లో భద్రపరుస్తున్నామని తెలిపారు. అవసరానికి అనుగుణంగా అదనపు రైల్వే ర్యాకుల ద్వారా ఎరువులు రాష్ట్రానికి చేరుతున్నాయని చెప్పారు.
జిల్లాల వారీగా ఎరువుల నిల్వలు, వినియోగాన్ని ప్రతిరోజూ సమీక్షిస్తూ అవసరమైన చోట వెంటనే సరఫరా చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. యూరియాతో పాటు డీఏపీ పంపిణీ కూడా ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారమే కొనసాగుతోందని చెప్పారు.
విజయనగరం జిల్లా ఆర్. అముదాలవలస మండలం సంకిలి రైతు సేవా కేంద్రం వద్ద జరిగిన ఘటనపై కూడా మంత్రి స్పందించారు. ఆ కేంద్రం పరిధిలో 731 ఎకరాల వరి, 90 ఎకరాల ఉద్యాన పంటలు, 80 ఎకరాల చెరకు సాగు ఉన్నప్పటికీ ప్రస్తుతం 90 ఎకరాల వరి, 80 ఎకరాల చెరకు మాత్రమే సాగులో ఉన్నట్లు తెలిపారు.
సంకిలి రైతు సేవా కేంద్ర పరిధిలోని సంకిలి, చిన్నయ్యపేట, బొడ్డవలస, అప్పాపురం, ఎం.ఆర్.పేట గ్రామాలకు తొలి విడతలో 811 యూరియా బస్తాలు అవసరమని గుర్తించామని చెప్పారు. ఇప్పటికే బొడ్డవలస, అప్పాపురం గ్రామాలకు 225 బస్తాలు పంపిణీ పూర్తయిందని, మిగిలిన గ్రామాలకు 219 బస్తాలు పంపిణీ చేపడుతున్న సమయంలో రైతులు పెద్ద సంఖ్యలో రావడంతో ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందని వివరించారు.
ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని సమీప రైతు సేవా కేంద్రం నుంచి వెంటనే 444 అదనపు యూరియా బస్తాలను తరలించి అదే రోజున రైతులకు అందుబాటులో ఉంచామని మంత్రి తెలిపారు. గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించి, టోకెన్ విధానం, క్యూలైన్ ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ కొనసాగిస్తున్నామని చెప్పారు.
ప్రస్తుతం విజయనగరం జిల్లాలో 9,987 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, అందులో మార్క్ఫెడ్ వద్ద 4,850 మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు.
రాష్ట్రంలో ఎక్కడా ఎరువుల కొరత లేదని, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. రైతులు అలాంటి ప్రచారాలను నమ్మవద్దని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన ఎరువులను సకాలంలో అందిస్తోందని ఆయన స్పష్టం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు.
Tags
Be the first to react
