NRI Parents Meet: ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం.. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణపై పిలుపు!
NRI Parents Meet: విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల మధ్య మాతృభాషపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. మాగులూరి భాను ప్రకాష్ సమన్వయంతో పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొని తమ అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు.
మాతృభాష తెలుగును భావితరాలకు అందిద్దాం: ప్రవాస కుటుంబాలకు పిలుపు..
తెలుగు మన ఆస్తి, అస్తిత్వం.. ప్రవాస తల్లిదండ్రుల సమావేశంలో భాను ప్రకాష్..
విదేశాల్లో నివసిస్తున్న తెలుగు కుటుంబాల మధ్య మాతృభాషపై అవగాహన పెంపొందించేందుకు నిర్వహించిన ప్రవాస తల్లిదండ్రుల ఆత్మీయ సమావేశం ఉత్సాహంగా జరిగింది. మాగులూరి భాను ప్రకాష్ సమన్వయంతో పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రవాస తెలుగు కుటుంబాలు పాల్గొని తమ అనుభవాలు, ఆలోచనలను పంచుకున్నారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, రాష్ట్ర కార్యదర్శి పాతూరి నాగభూషణం మాట్లాడుతూ, ఉపాధి కోసం ప్రపంచంలోని అనేక దేశాలకు వెళ్లినా తెలుగు భాషను మరచిపోవద్దని సూచించారు. ముఖ్యంగా అమెరికాలో నివసిస్తున్న తెలుగు కుటుంబాలు తమ పిల్లలకు మాతృభాషను నేర్పించాల్సిన బాధ్యత ఉందన్నారు.
"మన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలను తరువాతి తరాలకు అందించాలి. అన్ని భాషలు నేర్చుకోవడం మంచిదే. కానీ ఇంట్లో మాత్రం మాతృభాష అయిన తెలుగులోనే మాట్లాడే అలవాటు పెంచుకోవాలి. అదే మన గుర్తింపు, మన సంస్కృతిని నిలబెడుతుంది" అని ఆయన అన్నారు.
సమావేశాన్ని సమన్వయం చేసిన మాగులూరి భాను ప్రకాష్ మాట్లాడుతూ, తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని, అది ప్రతి తెలుగువారి ఆస్తి, అస్తిత్వమని చెప్పారు. తల్లిదండ్రులు, పిల్లల మధ్య బంధాన్ని మరింత బలపరిచే వారధి తెలుగు భాషేనని పేర్కొన్నారు. జీవితాంతం మాతృభాషను సజీవంగా ఉంచి, భావితరాలకు అందించడం ప్రతి తెలుగు కుటుంబం బాధ్యత అని ఆయన అన్నారు.
సమావేశంలో పాల్గొన్న ప్రవాస తల్లిదండ్రులు విదేశాల్లో పిల్లలకు తెలుగు నేర్పడంలో ఎదురవుతున్న అనుభవాలను పంచుకున్నారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను కొత్త తరానికి చేరవేసేందుకు ఇలాంటి కార్యక్రమాలు మరింత అవసరమని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో సీతారామారావు ఎండూరు, శంకర్రావు పొన్నం, కృష్ణమోహన్ జంపాల, సత్యనారాయణరాజు, చంద్రనాథ్ నంబూరు, వెంకటరెడ్డి గోలి, సుబ్బారావు చిట్టెల, రామకృష్ణారెడ్డి, గంగారావు పొనగోటి, భాస్కరరావు చీటీ, సురేష్, యోగానంద్ వంకిన, నూరిబాబు షేక్, సురేష్ లగిశెట్టి, గణేష్రెడ్డి బుడిపాటి, రాజా కరణం, రాజేంద్రప్రసాద్ పులిపాటి, ప్రభు బచ్చు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Tags
Be the first to react
