H1B Visa: గూగుల్లో ఉద్యోగం.. నెల రోజుల్లోనే తొలగింపు.. హెచ్-1బీ వీసాతో అమెరికాలో ఉద్యోగుల కష్టాలు వెలుగులోకి!

H1B Visa: అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం చాలా మంది విదేశీ ఉద్యోగుల కల. కానీ ఆ కల ఒక్కసారిగా చెదిరిపోతే పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో చైనాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గు యిచెన్ అనుభవం చెబుతోంది.

H1B Visa
H1B Visa

కలల ఉద్యోగం కళ్లముందే కూలింది.. 60 రోజుల గడువుతో హెచ్-1బీ ఉద్యోగుల ఆందోళన..

గూగుల్ లేఆఫ్తో కష్టాల్లో హెచ్-1బీ ఉద్యోగి.. కొత్త ఉద్యోగం కోసం కాలంతో పోటీ..

అమెరికాలోని ప్రముఖ టెక్ కంపెనీలో ఉద్యోగం సంపాదించడం చాలా మంది విదేశీ ఉద్యోగుల కల. కానీ ఆ కల ఒక్కసారిగా చెదిరిపోతే పరిస్థితి ఎంత కఠినంగా ఉంటుందో చైనాకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గు యిచెన్ అనుభవం చెబుతోంది. గూగుల్లో ఉద్యోగంలో చేరిన కొద్ది వారాలకే ఆయన ఉద్యోగం కోల్పోయి, హెచ్-1బీ వీసా నిబంధనల కారణంగా కేవలం 60 రోజుల్లో కొత్త ఉద్యోగం వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

31 ఏళ్ల గు యిచెన్ ప్రస్తుతం కాలిఫోర్నియాలోని అమెజాన్లో పనిచేస్తున్నారు. తన అనుభవాన్ని ఆయన బిజినెస్ ఇన్సైడర్తో పంచుకున్నారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ అర్బానా-షాంపెయిన్ నుంచి ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఇంజినీరింగ్లో చదువు పూర్తి చేసిన ఆయన 2017లో అమెజాన్లో చేరారు. మొదట ఓప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ద్వారా పనిచేసిన ఆయన, మూడో ప్రయత్నంలో హెచ్-1బీ వీసా లాటరీలో ఎంపికై ఉద్యోగాన్ని కొనసాగించారు.

2022 చివర్లో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపడుతున్న సమయంలో గూగుల్ నుంచి వచ్చిన ఆఫర్ను ఆయన అంగీకరించారు. జీతభత్యాలు ఆకర్షణీయంగా ఉండటంతో పాటు ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా సులభంగా సాగిందని చెప్పారు. మార్కెట్ పరిస్థితులు అంత అనుకూలంగా లేవని అమెజాన్ మేనేజర్ హెచ్చరించినప్పటికీ, మంచి అవకాశం అని భావించి గూగుల్లో చేరారు.

అయితే ఆయన చేరిన వెంటనే పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గూగుల్ ఏర్పాటు చేయాలని భావించిన ప్రయోగాత్మక ప్రాజెక్టును ఖర్చుల తగ్గింపు చర్యల్లో భాగంగా రద్దు చేసింది. దీంతో ఆ ప్రాజెక్టుకు ఎంపికైన మొత్తం బృందాన్నే ఉద్యోగాల నుంచి తొలగించింది.

"క్రిస్మస్ సమయంలో ఉద్యోగంలో చేరాను. జనవరి నెలలోనే ఉద్యోగం పోయిందని సమాచారం వచ్చింది. అసలు ఒక్కరోజు కూడా నిజమైన పని చేసే అవకాశం రాలేదు" అని గు యిచెన్ తెలిపారు.

ఉద్యోగం కోల్పోవడంతో మరో పెద్ద సమస్య ఆయన ముందుకొచ్చింది. హెచ్-1బీ వీసా నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన తర్వాత 60 రోజులలోపు మరో సంస్థలో ఉద్యోగం సంపాదించి, వీసా స్పాన్సర్షిప్ మార్చుకోవాలి. లేకపోతే అమెరికా విడిచి వెళ్లాల్సి ఉంటుంది.

ఈ సమయంలో గూగుల్లోనే ఇతర విభాగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించినా అవకాశం దొరకలేదు. అదే సమయంలో మెటా, అమెజాన్, ఒరాకిల్ సహా అనేక టెక్ కంపెనీల్లో భారీగా ఉద్యోగాల కోతలు కొనసాగడంతో కొత్త ఉద్యోగం దొరకడం మరింత కష్టమైంది.

కేవలం అమెరికాలో ఉండటానికే ఏదో ఒక ఉద్యోగం చేయాలనే ఆలోచనకు బదులుగా గు యిచెన్ కొంతకాలం స్వదేశం చైనాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. తన స్వస్థలం నాన్జింగ్లో కుటుంబ సభ్యులతో గడిపి, తర్వాత యునాన్ ప్రాంతంలో పర్యటించారు.

కొంతకాలం తర్వాత అమెజాన్లోని తన పాత బృందంలో ఖాళీ ఏర్పడిందని మాజీ సహోద్యోగులు సమాచారం ఇవ్వడంతో మళ్లీ అదే కంపెనీలో చేరారు. గతంలో ఉన్న ఉద్యోగానికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ పత్రాలు ఇప్పటికే ఆమోదం పొందడంతో తిరిగి ఉద్యోగంలో చేరడం కూడా సులభమైంది.

ప్రస్తుతం కాలిఫోర్నియాలోని సన్నీవేల్లో అమెజాన్లో పనిచేస్తున్న గు యిచెన్ అమెరికా గ్రీన్ కార్డ్ కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ అనుభవం తనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పిందని, కెరీర్లో కష్టపడి పనిచేయడమే కాకుండా సరైన సమయం కూడా చాలా ముఖ్యమని ఆయన అన్నారు.

గు యిచెన్ అనుభవం ఒక్కరిదే కాదు. ఇటీవల అమెరికాలో టెక్ రంగంలో జరిగిన భారీ ఉద్యోగాల కోతలతో వేలాది మంది హెచ్-1బీ ఉద్యోగులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా భారతీయ ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు.

ఉద్యోగం కోల్పోయిన తర్వాత కొంత అదనపు సమయం పొందేందుకు చాలామంది బీ-2 విజిటర్ వీసాకు మారేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఇటీవల అదనపు పత్రాల పరిశీలన, వీసా తిరస్కరణలు పెరగడంతో ఆ మార్గం కూడా కఠినంగా మారిందని ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.

అమెరికా పౌరసత్వ, ఇమ్మిగ్రేషన్ సేవలు (USCIS), హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం విడుదల చేసిన 2025 ఆర్థిక సంవత్సర గణాంకాల ప్రకారం, మొత్తం 4,06,348 హెచ్-1బీ వీసా ఆమోదాల్లో 2,83,772 భారతీయులకే లభించాయి. దీంతో హెచ్-1బీ వీసాపై భారతీయ ఐటీ నిపుణులు ఎంతగా ఆధారపడుతున్నారో ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

Tags

Be the first to react

Latest