USA: అమెరికా యూనికార్న్లలో భారతీయుల హవా.. NFAP నివేదికలో కీలక వివరాలు!
USA: అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి భారతీయులు నాయకత్వం వహించడం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం సీఈఓలుగానే కాదు, అమెరికాలోని అతిపెద్ద స్టార్టప్లు, యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులుగా కూడా భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
అమెరికా ఆవిష్కరణలకు వలసదారులే బలం.. భారతీయులదే కీలక పాత్ర..
775 యూనికార్న్ కంపెనీల్లో 455 వలసదారుల స్థాపన.. NFAP నివేదిక వెల్లడి..
అమెరికాలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలకు సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి భారతీయులు నాయకత్వం వహించడం మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం సీఈఓలుగానే కాదు, అమెరికాలోని అతిపెద్ద స్టార్టప్లు, యూనికార్న్ కంపెనీల వ్యవస్థాపకులుగా కూడా భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారని తాజా నివేదిక వెల్లడించింది.
అమెరికాకు చెందిన నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ (NFAP) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో ఉన్న 775 యూనికార్న్ కంపెనీల్లో 455 కంపెనీలు (59 శాతం) వలసదారులు లేదా వారి సహ వ్యవస్థాపకులు ప్రారంభించినవే. 2018లో ఈ శాతం 55గా ఉండగా, ప్రస్తుతం 59 శాతానికి పెరగడం విశేషం.
యూనికార్న్ కంపెనీలు అంటే కనీసం ఒక బిలియన్ డాలర్ల విలువ కలిగిన ప్రైవేట్ స్టార్టప్లు. అమెరికాలో బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన కంపెనీల్లో దాదాపు 66 శాతం సంస్థలు వలసదారులు లేదా వారి సంతానం స్థాపించినవే అని నివేదిక పేర్కొంది.
ఇక యూనికార్న్ కంపెనీల్లో దాదాపు 80 శాతం సంస్థల్లో వలసదారులు వ్యవస్థాపకులుగానే కాకుండా సీఈఓలు, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇంజినీరింగ్ వంటి కీలక నాయకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే, అమెరికాకు అంతర్జాతీయ విద్యార్థులుగా వెళ్లిన వారు స్థాపించిన కంపెనీలు మొత్తం బిలియన్ డాలర్ల కంపెనీల్లో 24 శాతం ఉన్నాయి.
వలసదారులు స్థాపించిన ఈ 455 కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 5 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరింది. ఇది ప్రపంచంలోని కేవలం ఏడు దేశాలను మినహాయిస్తే, మిగిలిన అన్ని దేశాల స్టాక్ మార్కెట్ల మొత్తం విలువ కంటే ఎక్కువగా ఉండటం విశేషం. యూనికార్న్ కంపెనీల విలువను కూడా కలిపితే ఈ మొత్తం 5.8 ట్రిలియన్ డాలర్లకు పైగా ఉంటుంది.
2018లో అమెరికాలో మొత్తం 91 యూనికార్న్ కంపెనీలు మాత్రమే ఉండగా, వాటిలో 50 కంపెనీలను వలసదారులు స్థాపించారు. అయితే 2026 ఏప్రిల్ నాటికి యూనికార్న్ కంపెనీల సంఖ్య 775కు చేరగా, అందులో 455 కంపెనీలు వలసదారుల భాగస్వామ్యంతో ఏర్పడ్డాయి.
2016లో వలసదారులు స్థాపించిన యూనికార్న్ కంపెనీల మొత్తం విలువ 168 బిలియన్ డాలర్లు ఉండగా, 2026 నాటికి అది 5 ట్రిలియన్ డాలర్లకు చేరింది. అంటే కేవలం పదేళ్లలో 2,876 శాతం వృద్ధి నమోదైంది. ఈ లెక్కల్లో ఇప్పటికే స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అయిన కంపెనీల విలువను కూడా చేర్చలేదు. అలాంటి కంపెనీల విలువ మరో 837 బిలియన్ డాలర్లకు పైగా ఉంది.
ఈ విజయాల్లో భారతీయుల పాత్ర మరింత ప్రత్యేకంగా నిలిచింది. 2026 నాటికి భారతదేశంలో జన్మించిన పారిశ్రామికవేత్తలు స్థాపించిన లేదా సహ-స్థాపించిన అమెరికన్ యూనికార్న్ కంపెనీల సంఖ్య 96కు చేరింది.
ఈ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్, హెల్త్కేర్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ వంటి అత్యాధునిక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి.
Perplexity AI, Nutanix, Rubrik, Zscaler, Postman, Freshworks, Glean, Innovaccer, ThoughtSpot, Cohesity వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా వేలాది సంస్థలు, ప్రభుత్వాలు, కోట్లాది వినియోగదారులకు సేవలందిస్తున్నాయి. వీటిలో కొన్ని ఇప్పటికే అమెరికా స్టాక్ మార్కెట్లలో విజయవంతంగా లిస్టింగ్ అయ్యాయి.
ఈ విజయవంతమైన భారతీయ వ్యవస్థాపకులు చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, పుణే, పంజాబ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి ప్రాంతాల నుంచి వచ్చినవారు. సాధారణ కుటుంబాల నుంచి ఎదిగి ప్రపంచస్థాయి కంపెనీలను నిర్మించడం ద్వారా వారు భారత యువతకు ఆదర్శంగా నిలిచారు.
ఈ కంపెనీలు కేవలం బిలియన్ల డాలర్ల విలువను సృష్టించడమే కాకుండా లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తూ ప్రపంచ సాంకేతిక రంగ అభివృద్ధికి కీలకంగా మారాయి. అమెరికా ఆవిష్కరణల కథలో భారతీయ వలసదారులు ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
అమెరికా స్వాతంత్ర్యానికి 250 ఏళ్లు పూర్తవుతున్న వేళ, ఒకవైపు "మేక్ అమెరికా గ్రేట్ అగైన్" నినాదం, మరోవైపు వలసదారులపై కఠిన వలస విధానాలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో, అమెరికా అభివృద్ధిలో వలసదారుల పాత్ర ఎంత కీలకమో ఈ NFAP నివేదిక మరోసారి స్పష్టంగా చాటిచెప్పింది. భారతీయుల ప్రతిభ, నాయకత్వం, పారిశ్రామిక దృక్పథం ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ప్రభావం చూపుతోందో ఈ గణాంకాలు మరోసారి నిరూపిస్తున్నాయి.
Tags
Be the first to react
