TCA: హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ స్వర్ణోత్సవ మహాసభలకు ముమ్మర ఏర్పాట్లు!
TCA: అమెరికాలోని హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ప్రతిష్టాత్మక స్వర్ణోత్సవ మహాసభలు (గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్–2026) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగు సమాజానికి ఐదు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తుగా నిర్వహిస్తున్న ఈ చారిత్రక వేడుకలు ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్లో జరగనున్నాయి.
హ్యూస్టన్లో తెలుగు వైభవం.. టీసీఏ గోల్డెన్ జూబ్లీ వేడుకలకు సర్వం సిద్ధం..
ప్రవాస తెలుగువారిని ఒక్క వేదికపైకి తెస్తున్న టీసీఏ స్వర్ణోత్సవాలు..
అమెరికాలోని హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ (టీసీఏ) ప్రతిష్టాత్మక స్వర్ణోత్సవ మహాసభలు (గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్–2026) అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. తెలుగు సమాజానికి ఐదు దశాబ్దాలుగా అందిస్తున్న సేవలకు గుర్తుగా నిర్వహిస్తున్న ఈ చారిత్రక వేడుకలు ఆగస్టు 7, 8 తేదీల్లో ఫోర్ట్ బెండ్ ఎపిసెంటర్లో జరగనున్నాయి.
"50 సంవత్సరాల సేవ... తెలుగు ఐక్యతకు స్వర్ణయుగ వేడుక!" అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ మహాసభలను మరపురాని వేడుకగా నిలిపేందుకు సుమారు 30 ప్రత్యేక కమిటీలు, 150 మందికి పైగా వాలంటీర్లు గత మూడు నెలలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. మహాసభలకు విచ్చేసే ప్రతి తెలుగు కుటుంబానికి ప్రత్యేక అనుభూతిని అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ మహాసభలకు టీసీఏ అధ్యక్షుడు యాదగిరి రెడ్డి, కన్వీనర్ జితేందర్ రెడ్డి నాయకత్వం వహిస్తుండగా, కన్వెన్షన్ కోర్ టీమ్ సభ్యులు సమన్వయంతో అన్ని కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదే సమయంలో 2026–27 నూతన కార్యవర్గం భారత కాన్సుల్ జనరల్ డి.సి. మంజునాథ్ను మర్యాదపూర్వకంగా కలిసి స్వర్ణోత్సవ మహాసభలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించింది. ఈ సమావేశంలో ప్రవాస భారతీయుల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ, యువతలో తెలుగు భాషాభిమానాన్ని పెంపొందించడం, తెలుగు సమాజ ఐక్యతను మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ 50 ఏళ్ల సంబరాలను నిర్వహించేందుకు టీసీఏ కట్టుబడి ఉందని ప్రతినిధులు తెలిపారు.
స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రముఖ సాహితీవేత్తలు శ్రీనివాస్ అవసరాల, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, డాక్టర్ అరుణ సుబ్బారావు, బులుసు అపర్ణ, డాక్టర్ గరికపాటి గురజాడ తదితరులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
1976లో ప్రారంభమైన హ్యూస్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఈ ఏడాదితో 50 సంవత్సరాల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటోంది. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని వివిధ విభాగాలకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ కోర్ కమిటీ, అడ్వైజరీ కౌన్సిల్, ట్రస్టీలు, సెరిమోనియల్ కమిటీ, ఈవెంట్ సమన్వయ కమిటీలు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నాయి.
స్వర్ణోత్సవాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కూడా ప్రత్యేక స్థానం కల్పించారు. పిల్లలు, యువతలో నైతిక విలువలు, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించేందుకు టీసీఏ ఆధ్యాత్మిక కమిటీ ఆధ్వర్యంలో 'భగవద్గీత టాలెంట్ షో–2026' నిర్వహించనున్నారు. హనుమాన్ దత్త యోగా సెంటర్లో జరిగే ఈ పోటీల్లో భగవద్గీత 12వ అధ్యాయం (భక్తి యోగం), 15వ అధ్యాయం (పురుషోత్తమ ప్రాప్తి యోగం)లోని శ్లోకాలను కంఠస్థం చేసి పఠించాల్సి ఉంటుంది. విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేయనున్నారు.
ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు పూజ్యనీయులు అమ్మ శ్రీ కరుణామయి హ్యూస్టన్ పర్యటన కూడా ఖరారైంది. ఆమె ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రవచనం స్వర్ణోత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ పవిత్ర సత్సంగంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు భక్తులను ఆహ్వానించారు.
అలాగే ఆగస్టు 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు అర్చకులు శ్రీ హనుమాన్ స్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం స్వర్ణోత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభను తీసుకురానుంది.
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, సాహిత్యం, ఆధ్యాత్మికత, సేవా కార్యక్రమాలు, కుటుంబ విలువలు అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తున్న ఈ స్వర్ణోత్సవ మహాసభలు అమెరికాలోని తెలుగు సమాజానికి చిరస్మరణీయ వేడుకగా నిలవనున్నాయని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు కుటుంబాలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ చారిత్రక వేడుకలను విజయవంతం చేయాలని టీసీఏ పిలుపునిచ్చింది.
Tags
Be the first to react