తెలుగు ఎన్నారైల సంక్షేమం కోసం APNRT కోఆర్డినేటర్ల నియామకం... కెనడా, యూరప్ లిస్ట్ ఇదిగో!
ఈ అంతర్జాతీయ కమిటీల నియామకం ద్వారా ప్రవాసాంధ్రులతో బంధం మరింత బలోపేతం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ప్రవాస తెలుగు వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేందుకు, వారి నైపుణ్యాలను మాతృభూమి ప్రగతికి ఉపయోగించేందుకు ఈ నూతన కోఆర్డినేటర్లు చురుకైన పాత్ర పోషించనున్నారు.
అమరావతి కేంద్రంగా ఎన్ఆర్టీ సొసైటీ (NRT Society) తమ అంతర్జాతీయ కమిటీలను భారీగా విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఏకతాటిపైకి తెచ్చేందుకు మరియు మాతృభూమి అభివృద్ధే ధ్యేయంగా ఈ నూతన కోఆర్డినేటర్ల నియామకం జరిగింది. కెనడా మరియు ఐరోపా (యూరప్) దేశాలలో చురుగ్గా పనిచేసే నాయకులకు ఈ కమిటీలలో కీలక బాధ్యతలను అప్పగించారు. ఈ మేరకు ఎన్ఆర్టీ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ (CEO) నూతన నియామకాలకు సంబంధించిన అధికారిక జాబితాను విడుదల చేసింది.
కెనడా రీజియన్కు సంబంధించి ప్రాంతీయ, రాష్ట్ర, నగర స్థాయిల్లో బలమైన నాయకత్వాన్ని ఎంపిక చేశారు. రీజినల్ కోఆర్డినేటర్లుగా శ్రీకాంత్ వున్నవ, అన్నపూర్ణ నిమ్మగడ్డ బాధ్యతలు స్వీకరించారు. వివిధ రాష్ట్రాలు, నగరాల పరిధిలో కృష్ణా జవ్వాజి, ఫణి ప్రకాష్ పొసాని, మోహన్ బొందా, ప్రదీప్ ఈమని వంటి ప్రముఖులు సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు. కెనడాలోని వాంకోవర్, మాంట్రియల్, రెజినా, కాలగరీ వంటి ప్రధాన నగరాల్లో తెలుగు ప్రవాసుల సమస్యల పరిష్కారానికి, వారిని ఏకం చేయడానికి ఈ బృందం కృషి చేయనుంది.
ఐరోపా ఖండంలో ముఖ్యంగా ఉత్తర యూరప్ పరిధిలోకి వచ్చే బ్రిటన్ (UK), ఐర్లాండ్, బెల్జియం, స్వీడన్ దేశాలకు ప్రత్యేక సమన్వయ కమిటీలను వేశారు. వున్నం ప్రవీణ్ కుమార్, సురేష్ వరికూటి, భాను ప్రకాష్ వుల్లంకి సహా పలువురు ప్రాంతీయ ప్రతినిధులుగా నియమితులయ్యారు. యూకే కంట్రీ కోఆర్డినేటర్లుగా మాహి తల్లూరి, శ్రీధర్ రావు నారా, అవినాష్ పుదోట వంటి పెద్ద బృందం రంగంలోకి దిగింది. అలాగే ఐర్లాండ్, స్వీడన్, బెల్జియం దేశాల్లో కూడా సమర్థులైన తెలుగు వారికి కీలక బాధ్యతలు అప్పగించారు.
మరోవైపు సెంట్రల్ మరియు సదరన్ యూరప్ పరిధిలోని జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోలాండ్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలకు కూడా నూతన కమిటీలను ప్రకటించారు. ఈ రీజియన్కు మద్దిపట్ల టిట్టు (ఇంద్రసేన నాయుడు), కుడితిపూడి శ్రీకాంత్, నరేష్ కోనేరు ప్రాంతీయ సారథులుగా వ్యవహరిస్తారు. జర్మనీలో శివశ్యామ్ బుద్దన, ఇటలీలో అనిల్ కుమార్ మద్దిపట్ల సహా వివిధ దేశాల్లో దేవి రాజశేఖర్ ఉండవల్లి, సురేష్ చింతల, కృష్ణ వల్లూరుపల్లి వంటి వారు ఆయా దేశాల సమన్వయకర్తలుగా వ్యవహరించనున్నారు.
ఈ అంతర్జాతీయ కమిటీల నియామకం ద్వారా ప్రవాసాంధ్రులతో బంధం మరింత బలోపేతం కానుంది. అమరావతి రాజధాని నిర్మాణంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ప్రవాస తెలుగు వారి భాగస్వామ్యాన్ని పెంచడమే ఈ కమిటీల ప్రధాన లక్ష్యం. విదేశాల్లో ఉన్న తెలుగు వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడేందుకు, వారి నైపుణ్యాలను మాతృభూమి ప్రగతికి ఉపయోగించేందుకు ఈ నూతన కోఆర్డినేటర్లు చురుకైన పాత్ర పోషించనున్నారు.
APNRT కోఆర్డినేటర్లుగా నియమితమైన ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రవాసి తరపున శుభాకాంక్షలు.
Tags
Be the first to react