బరువు తగ్గాలనే ఆలోచన కేవలం యువతలోనే కాదు వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఇంట్లో ప్రధాన చర్చగా మారిపోతోంది. పనిలో ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం, కావాలనిపించినప్పుడు ఏదో తింటూ ఉండటం ఇవి అన్నీ కలిసి శరీర బరువు పెరగడానికి దారితీస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆరోగ్యానికి మంచిగా బరువు తగ్గడంలో సహాయపడే ఆహారాల కోసం ప్రజలు ఎక్కువగా వెతుకుతున్నారు. ఈ జాబితాలో ఎప్పుడూ ముందుంటుంది ఓట్స్. కానీ ఓట్స్ నిజంగా బరువు తగ్గిస్తాయా? లేక ఇది కూడా ఒక ఫ్యాషన్ ఫుడ్‌నా? అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.
ఓట్స్ ప్రత్యేకత ఫైబర్‌నే అనాలి వీటిలో ఉండే బీటా గ్లూకాన్ అనే ద్రవీభవించే ఫైబర్ కడుపులో నీటిని పీల్చుకుని మందంగా మారుతుంది. దాంతో మనం తిన్న ఆహారం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అకస్మాత్తుగా ఆకలి వేయకుండా ఎక్కువసేపు తృప్తి భావం ఉంటుంది. రోజు మొత్తం అల్పాహారం, జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఒక్క లక్షణమే పెద్ద సహాయం.
ఓట్స్‌కు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటం మరో బలం. ఇది శరీరానికి శక్తిని ఒక్కసారిగా కాదు, నెమ్మదిగా విడుదల చేస్తుంది. ఇలా శక్తి స్ధాయిలు స్థిరంగా కొనసాగడంతో మనసు, కడుపు రెండూ క్రమబద్ధంగా పనిచేస్తాయి. పని మధ్యలో అలసట, చిరాకు తగ్గి, అధిక చక్కెర ఉన్న ఆహారాలపై ఆసక్తి తగ్గిపోతుంది. దీన్నే నిపుణులు ఆరోగ్యకరమైన weight management లో కీలకమెనని చెబుతున్నారు.
ఓట్స్ పోషక విలువలూ తక్కువేమీ కావు. వీటిలో మగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్ లాంటి శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెటాబాలిజాన్ని వేగవంతం చేసి శరీరం కొవ్వును మరింత సమర్థవంతంగా దహనం చేయడంలో సహాయపడతాయి. అలాగే ఓట్స్‌లో ఉన్న కాంప్లెక్స్ కార్బ్స్ జీర్ణం కావడానికి శరీరం అదనంగా శక్తి వినియోగించుకోవాలి. ఈ ప్రక్రియలో కూడా అదనపు కేలరీలు ఖర్చవుతాయి. దీన్నే "థర్మిక్ ఎఫెక్ట్" అంటారు.
ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఓట్స్ క్రమం తప్పకుండా తినేవారి పొట్ట చుట్టు కొవ్వు క్రమంగా తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి నియంత్రితమై, శరీరం కొవ్వు నిల్వ చేసుకునే అవకాశం తగ్గుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే ఓట్స్ తింటే ఎక్కువసేపు చురుకుదనం, తేలిక అనిపిస్తుంది. వ్యాయామం చేసే వారికి ఇవి అద్భుతమైన ప్రీ-వర్కౌట్ భోజనం.
అయితే ఓట్స్ తినేప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ ఓట్స్‌లో చక్కెర, సువాసన పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గడం కంటే పెంచడానికే ఎక్కువ అవకాశముంటుంది. అందుకే స్టీల్ కట్ ఓట్స్ లేదా రోల్డ్ ఓట్స్‌ను ఎంచుకోవడం ఉత్తమం. పైగా ఎక్కువ తీపి పదార్థాలు, డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే కేలరీలు మించిపోతాయి. బదులుగా తాజా పండ్లు, కొద్దిగా విత్తనాలు, పెరుగు వంటివి కలిపితే రుచికరంగా, ఆరోగ్యకరంగా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది.