వియత్నాం దేశంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదానికి దారితీశాయి. 1500 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదవడంతో సెంట్రల్ వియత్నాంలోని అనేక ప్రాంతాలు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి. రోడ్లు, గ్రామాలు, పట్టణాలు అన్నీ ఒకే నీటి మడుగుగా మారాయి.
ఈ భారీ వర్షాలు వరదలతో పాటు ప్రమాదకరమైన కొండచరియలు విరిగిపడటానికి కూడా కారణమయ్యాయి. ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. వరదల తీవ్రతతో 43 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. అదేవిధంగా 10 వేల హెక్టార్ల వ్యవసాయ భూముల్లో పంటలు పూర్తిగా నాశనమయ్యాయి.
ఇంకా చాలా ప్రాంతాల్లో నీరు తగ్గకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు రావడంతో వారు పై అంతస్తుల్లోకి లేదా ఇళ్ల మేడమీదకు చేరి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. రక్షణ బృందాలు వరదల్లో చిక్కుకున్న ప్రజలను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నాయి.