వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో భక్తులకు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు టీటీడీ పాలక మండలి అత్యవసరంగా సమావేశమై, డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు మొత్తం 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈసారి దర్శనాల్లో సామాన్య భక్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని తీర్మానించారు.
వైకుంఠ ద్వారం ఏర్పాటైన మొదటి మూడు రోజులు, రూ.300 దర్శన టికెట్లు మరియు శ్రీవాణి కోటా టికెట్లను టీటీడీ రద్దు చేసింది. జనవరి 2 నుండి 8 వరకు రోజుకు 15,000 రూ.300 దర్శన టికెట్లు, 1,000 శ్రీవాణి టికెట్లు అందుబాటులో ఉంటాయి. మొదటి మూడు రోజులకు టికెట్లు ఈ-డిప్ ద్వారా కేటాయించబడతాయి. నవంబర్ 27 నుండి డిసెంబర్ 1 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు, డిసెంబర్ 2న ఈ-డిప్ ఫలితాలు ప్రకటిస్తారు.
టీటీడీ వెబ్‌సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల రిజిస్ట్రేషన్, కేటాయింపు జరుగుతుంది. జనవరి 6, 7, 8 తేదీల్లో తిరుమల–తిరుపతి స్థానికులకు రోజుకు 5,000 టోకెన్లు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. ఈ 10 రోజులలో ప్రోటోకాల్ ప్రముఖులు తప్ప మిగతా అన్ని ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేయబడ్డాయి, తద్వారా భక్తులకు ఎక్కువ అవకాశం లభిస్తుంది.
ఈ క్రమంలో, టీటీడీ మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. అలిపిరిలో నిర్వహించే శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను కూడా డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ 10 రోజుల పాటు భక్తులకు ఈ హోమం టికెట్లు అందుబాటులో ఉండవు. సాధారణంగా ఈ హోమం టికెట్ ధర రూ.1,600 ఉండి, ఒక్కో టికెట్‌తో ఇద్దరు పాల్గొనవచ్చు.
అలిపిరి హోమంలో పాల్గొనే వారికి ప్రత్యేక ప్రవేశ దర్శనం కూడా లభిస్తుంది కాబట్టి భక్తులు ఎక్కువగా తీసుకునే టికెట్ ఇది. ఉదయం 8:30కి రిపోర్టింగ్, 9 గంటలకు ప్రారంభమయ్యే ఈ హోమం రెండు గంటలకు పైగా కొనసాగుతుంది. అయితే వైకుంఠ ఏకాదశి రద్దీ కారణంగా ఈ సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు టీటీడీ స్పష్టం చేసింది.