రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న టిడిపి ప్రభుత్వం మాట ఇచ్చినట్లుగానే ‘అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్’ పథకాన్ని వేగంగా అమలు చేస్తోంది. ఈ పథకంలోని రెండో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని పెండ్లిమర్రిలో జరిగిన కార్యక్రమంలో నిధుల జమ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు చంద్రబాబు నాయుడు. రైతు కుటుంబాలకు నేరుగా ఆర్థిక సాయం అందించడమే తమ పాలనకు కేంద్ర బిందువుగా పెట్టుకున్నామని తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఏటా రూ.20,000 ఆర్థిక సహాయం అందిస్తామన్న హామీని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం మొదటి రోజు నుంచే అమలు చేస్తోంది. ఆగస్టు 2న మొదటి విడతగా రూ.7,000 రైతుల ఖాతాల్లో జమ చేయడంతో రైతులు పంట ప్రారంభ దశలోనే ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం పొందారు. ఇప్పుడు రెండో విడతలో మరో రూ.7,000ను నేరుగా ఖాతాల్లోకి జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన మాటకు నిలబడ్డట్లు మరోసారి నిరూపించింది.
మొత్తం రెండు విడతల్లో రైతులకు ఇప్పటివరకు రూ.14,000 చొప్పున సాయం చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో కలిసి రూ.6,309 కోట్ల భారీ మొత్తాన్ని జమ చేయడం టిడిపి ప్రభుత్వ రైతుప్రేమకు స్పష్టమైన నిదర్శనం. ఎలాంటి ఆలస్యం లేకుండా మధ్యవర్తుల జోక్యం లేకుండా డైరెక్ట్‌గా ఈ సాయం చేరడం రైతుల్లో విశ్వాసాన్ని మరింత పెంచుతోంది.
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రైతుల కోసం ప్రకటించిన సూపర్ సిక్స్ హామీల అమలు కొనసాగుతుందని, అన్నదాత సుఖీభవ పథకం అందులో కీలకమని తెలిపారు. రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం ద్వారా వ్యవసాయ రంగానికి మళ్లీ ఊపిరి పోయాలని టిడిపి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నిధుల జమతో రాష్ట్రంలోని చాలా మండలాల్లో రైతులు సంతోషాన్ని వ్యక్తపరిచారు