ఆంధ్రప్రదేశ్ మీదుగా నడుస్తున్న పలు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు రైల్వే శాఖ మరో రెండు స్టేషన్లలో కొత్తగా హాల్ట్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని తీసుకున్న ఈ నిర్ణయాన్ని రైల్వే అధికారులు అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. చర్లపల్లి–తిరుపతి–చర్లపల్లి (07001/07002) వీక్లీ స్పెషల్ రైలు నవంబర్ 19 నుంచి నవంబర్ 26 వరకు ప్రకాశం జిల్లా దిగువమెట్ట రైల్వే స్టేషన్‌లో ఆగనుంది. చర్లపల్లి నుంచి బుధవారం ఉదయం 4.30 గంటలకు బయల్దేరే 07001 రైలు 4.32 గంటలకు దిగువమెట్ట స్టేషన్‌లో హాల్ట్ తీసుకుంటుందని వెల్లడించారు. తిరుపతి నుంచి బయల్దేరే 07002 రైలు ప్రతి గురువారం రాత్రి 11.20 గంటలకు అదే స్టేషన్‌లో ఆగి తిరిగి ప్రయాణం కొనసాగిస్తుందని అధికారులు వివరించారు.
అదేవిధంగా, చర్లపల్లి–కొల్లాం–చర్లపల్లి (07107/07108) వీక్లీ స్పెషల్ రైలు కూడా నెల్లూరు జిల్లా కావలి రైల్వే స్టేషన్‌లో ఆగేలా ప్రత్యేక సదుపాయం కల్పించారు. నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22, 29 తేదీలతో పాటు జనవరి 5, 12, 19 తేదీల్లో చర్లపల్లి నుంచి కొల్లాం వెళ్లే 07107 రైలు రాత్రి 9.23 గంటలకు కావలి స్టేషన్‌లో ఆగనుంది. ఇదే విధంగా, కొల్లాం నుంచి చర్లపల్లి వచ్చే 07108 రైలు ప్రతి బుధవారం బయల్దేరి నవంబర్ 26 నుంచి జనవరి 21 వరకు రాత్రి 12.33 గంటలకు కావలి స్టేషన్‌లో హాల్ట్ తీసుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మార్పులతో స్థానిక ప్రయాణికులు చాలా వరకు లాభపడతారని, కొత్త హాల్ట్‌లను గమనించి ప్రయాణం ప్లాన్ చేసుకోవాల్సిందిగా సూచించారు.
ఇదిలా ఉండగా, తమిళనాడులోని తిరుచిరాపల్లి నుంచి మహారాష్ట్రలోని నాందెడ్ వరకు నడుస్తున్న ప్రత్యేక రైళ్లు (07615/07616) కూడా ప్రయాణికులకు భారీ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఈ రైళ్లు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 31 వరకు నడుస్తాయి. ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరే 07615 రైలు, బుధవారం సాయంత్రం 6 గంటలకు తిరుచిరాపల్లి చేరుతుంది. ఇదే విధంగా, ప్రతి బుధవారం రాత్రి 9 గంటలకు తిరుచిరాపల్లి నుంచి బయల్దేరే 07616 రైలు, గురువారం రాత్రి 11 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైళ్లు ఏపీలోని నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల స్టేషన్‌లలో ఆగుతుండటంతో రాష్ట్ర ప్రయాణికులకు ఈ రూట్ చాలా సౌకర్యంగా మారనుంది.
రాబోయే రెండు నెలల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. పండుగలు, ట్రాఫిక్ పెరిగే రోజులు, ఉద్యోగ మరియు విద్య సంబంధిత ప్రయాణాలు ఎక్కువగా ఉండే కాలం కావడంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నామని రైల్వే వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ తాజా హాల్ట్‌లతో పాటు కొత్త ప్రత్యేక రైళ్లు ప్రవేశపెడితే, ఏపీ ప్రయాణికులు ప్రయాణాలను మరింత సులభంగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారులు ప్రయాణికులకు సూచిస్తూ, రైళ్ల రాకపోకల తాజా షెడ్యూల్‌ను గమనించి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు.