వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చర్యలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రవీంద్రనాథ్ రెడ్డి, ఆలయం బయట విలేకర్లతో మాట్లాడుతూ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. టీటీడీ దీనిపై సీరియస్‌గా స్పందించింది.
తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు, ఆరోపణలు చేయడం నిషిద్ధం. రవీంద్రనాథ్ రెడ్డి నిబంధనలు ఉల్లంఘించి రాజకీయ వ్యాఖ్యలు చేశారని టీటీడీ భావిస్తోంది. అందుకే ఆయన వ్యాఖ్యలను తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం విచారణలో పెట్టింది. టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను ఉల్లంఘించడంపై చర్యలు చేపట్టబోతున్నట్లు సమాచారం.
రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారు? ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల విషయాన్ని ప్రస్తావించారు. వైఎస్ జగన్ వెంట ఉన్నామని, పులివెందుల ప్రజలు ఎన్నికల ద్వారా దీని సంకేతం ఇచ్చారని చెప్పారు. టీడీపీ కూటమి అరాచకాలు, భయభ్రాంతులకు పాల్పడుతున్నారని, ఈ ప్రభుత్వం పంటలు పండడం లేదని విమర్శించారు.
“సూపర్ సిక్స్” పేరుతో మోసపు హామీలు ఇచ్చినా ఏది కూడా అమలులో లేకపోతోందని, 2029లో జగన్ మళ్లీ ముఖ్యమంత్రిగా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఓటింగ్ శాతం తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారని, ఇది స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎన్నడూ జరగని పరిస్థితి అని ఆరోపించారు. వైఎస్ జగన్ ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.